కథాసరిత్సాగర కపట బిక్షువు కథ!!

 

కాలం ఏదైనా సరే మనుషులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది వర్తమానం, గతం అని తేడా ఏమీ లేదు ఈ మంచి చెడులకు. అయితే గతంలో జరిగిన చెడు కూడా వర్తమానానికి మంచిని భోదిస్తుందన్నది వంద శాతం నిజం.  నమ్మకాలు మనిషి పుట్టినప్పటి నుండే ఉన్నాయేమో చెప్పలేం. కానీ కొన్ని నమ్మకాల వల్ల చెప్పలేనంత నష్టం జరుగుతుంది. అంతేకాదు కోల్పోయిన తరువాత నమ్మకాల పేరుతో ఎంత విలువైనవి కోల్పోయామో తెలుస్తుంది. అది వస్తువా, మనిషా, బంధాలా అనేది ఆ సందర్భాలలో ఉంటుంది. కథాసరిత్సాగరములో చెప్పబడ్డ, ఇప్పుడు తెలుసుకోబోయే ఒక చిన్న కథ కూడా అలాంటిదే.

ఒకరిని మోసం చేస్తే తిరిగి తాము మోసపోతామని తెలియజెప్పే ఉదంతమిది.

పూర్వం గంగానది తీరంలో మాకండి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక బిక్షువు ఉండేవాడు. అతడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఏమాట మాట్లాడేవాడు కాదు. అతను ఆ నగరంలో ఇంటింటికి వెళ్లి బిక్షం ఎత్తుకునేవాడు. అందరూ అతన్ని గొప్ప స్వామీజీ అనుకునేవారు. అందుకే అతను మాట్లాడకుండా మౌనంగా ఉంటాడని అనుకునేవాళ్ళు. అయితే మోసగాడు ఎక్కువ మౌనంగానే ఉంటాడు అనే విషయం గ్రహించలేదు ఎవరూ. 

ఒకరోజు ఎప్పటిలాగే బిక్షం ఎత్తుకోవడానికి ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చి అతనికి బిక్షం వేసింది. ఆ అమ్మాయి వయసులో ఉండి, కుందనపు బొమ్మలా ఎంతో అందంగా ఉంది. ఆ బిక్షం ఎత్తుకునేవాడు ఆ అమ్మాయి వైపు కళ్ళు ఆర్పకుండా కొద్దిసేపు అలాగే చూసాడు. అప్పుడే ఆ ఇంట్లో నుండి ఆ మ్మాయి తండ్రి బయటకు వచ్చాడు. ఆ బిచ్చగాడు ఆ అమ్మాయి తండ్రికి వినబడేలా "ఎంత బాధాకరం" అని విచారంగా చెప్పి అక్కడినుండి మౌనంగా వెళ్ళిపోతాడు.

ఆ భిక్షగాడి మాట విన్న ఆ అమ్మాయి తండ్రి భయంతో ఆ భిక్షగాడి వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లి "అయ్యా ఏమి జరిగింది ఎందుకు అలా అన్నారు" అని అడిగాడు.

ఆ భిక్షగాడు వెంటనే "నీ కూతురితో చాలా చెడు కర్మలు ఉన్నాయి. ఆమె ముఖం చూస్తూనే నాకు ఆ కర్మలు అన్ని కళ్ళముందు కదలాడాయి" అన్నాడు.

ఆ మాటలు వినగానే ఆ అమ్మాయి తండ్రిలో ఏదో మార్పు కలిగింది. 

"అంటే మీరు ఏమి చెబుతున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి" అని అడిగాడు.

ఏమి లేదు తొందరలో ఆ అమ్మాయి వల్ల మీ ఇంట్లో దారుణాలు జరుగుతాయి, ఆమె చెడు కర్మల వల్ల మీ ఇంట్లో అందరూ కూడా ఇబ్బందుల పాలవుతారు" అని చెబుతాడు బిక్షం ఎత్తుకునేవాడు.

ఆ అమ్మాయి తండ్రి వెంటనే "అయ్యా నా కూతురుకు పెళ్లి వయసు వచ్చింది ఇంకొన్ని రోజులలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అప్పుడు తను నా ఇంట్లో ఉండదు" అని చెబుతాడు.

ఆ బిక్షగాడు వెంటనే నవ్వి "పిచ్చివాడా ఈ బంధాలు అవి, ఇలా ఇంకొకరి చేతిలో పెట్టగానే తెగిపోయేవి కాదు. మీరు ఆమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా ఆమె తాలూకూ కర్మ మిమ్మల్ని సమస్యలలో పడేస్తుంది. ఆ సమస్యలు తప్పించుకోవాలంటే వాటికి వేరే మార్గం ఉంటుంది" అన్నాడు.

ఆ అమ్మాయి తండ్రి క్రమంగా భయంలోకి కూరుకుపోయి కూతురు అనే ప్రేమను, ఆప్యాయతను మరిచిపోయాడు. "స్వామి ఆ దారి ఏదో చెప్పండి. మమ్మల్ని సనస్యల నుండి గట్టెక్కించండి" అని వేడుకుంటాడు. 

ఆ భిక్ష గాడు వెంటనే ఆ అమ్మాయి తండ్రితో "అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ అమ్మాయిని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను నదిలో వదిలిపెట్టేసేయ్యాలి, అంతేకాదు ఆ పెట్టె మీద వెలుగుతున్న ఒక దీపాన్ని ఉంచాలి. ఇలా చేస్తే ఆమె తాలూకూ కర్మ గంగలో లీనమైపోతుంది. మీకు సమస్యలు తప్పుతాయి" అని చెబుతాడు.

ఆ అమ్మాయి తండ్రి ఆ బిక్షం ఎత్తుకునేవాడు చెప్పినట్టే ఆ అమ్మాయిని పెట్టెలో పెట్టి, ఆ పెట్టె మీద దీపం పెట్టి నదిలో వదిలేస్తాడు.

విహారం కోసం వచ్చి నదీ తీరాన బస చేసిన ఒక రాజకుమారుడికి నీటిలో తేలుతూ వస్తున్న పెట్టె, ఆ పెట్టె మీద దీపం వల్ల కనబడెసరికి అతను వెళ్లి ఆ పెట్టెను బయటకు తెచ్చి, పెట్టె తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె నుండి జరిగిన విషయం మొత్తం తెలుసుకుని, అది కచ్చితంగా ఆ బిక్షం ఎత్తుకునే వాడి పనే అనుకుని, ఆ అమ్మాయికి బదులుగా ఒక కొండముచ్చును ఆ పెట్టెలో పెట్టి ముందులగా దానిమీద దీపం పెట్టి మళ్ళీ వదిలేసి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్తాడు.

ఆ బిక్షం ఎత్తుకునేవాడు తన శిస్యులను పిలిచి నదిలో తేలుతూ వస్తున్న పెట్టె, దాని మీద దీపం కనబడితే దాన్ని తీసుకురమ్మని చెబుతాడు. ఆ శిస్యులు అలాగే దీపం కనబడిన పెట్టెను తీసుకొచ్చి ఆ భిక్షగాడి ముందు పెట్టగా, ఆ బిక్షగాడు ఎంతో ఆశతో ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోబోతున్నాననే సంతోషంతో ఆ పెట్టెను తెరుస్తాడు. తెరవగానే అందులో కొండముచ్చు ఆ భిక్షగాడి మీద పడి రక్కేస్తుంది. బతుకుజీవుడా అని వాడు అక్కడి నుండి తప్పించుకుని పోతాడు.

ఈ కథ చదవడం వల్ల నమ్మకానికి మూఢనమ్మకానికి ఎంతటి వ్యత్యాసమొ, మూఢనమ్మకం వల్ల ఎంత నష్టం ఎదురవుతుందో తెలుస్తుంది. పురాణాలు అంటే కేవలం కట్టుకథలో, నిజమైన కథలో ఎవరికి తెలుసని పెదవి విరవక్కర్లేదు, ఇలాంటి నీతి ఎంతో దాగుంటుంది వాటిలో.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories