కబంధుడి వృత్తాంతం!

జటాయువు మరణం తరువాత రామలక్ష్మణులు ఇద్దరూ నడుస్తూ వెళ్తుంటే ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, పాదములు లేవు. కేవలం గుండెల దగ్గరినుండి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వారు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది" నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు. ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను" అని అంటూ వాళ్ళని దగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో 'మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము" అన్నాడు.

లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని సరికేశారు. అప్పుడా కబంధుడు "మీరు ఇద్దరు ఎవరు?" అని అడిగాడు.

"ఈయనని రాముడు అంటారు. దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నావేంటి? నీలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడూ చూడలేదు" అని లక్ష్మణుడు అన్నాడు.

అప్పుడా కబంధుడు "నేను మీకు నా కథ చెబుతాను. కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అది ఎమిటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతే ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి" అన్నాడు. 

"సరే, నువ్వు కోరినట్టే నిన్ను కాల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా" అని రామలక్ష్మణులు అడిగారు.

అప్పుడా కబంధుడు "మీకు ఆ విషయాన్ని ఈ శరీరముతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరముతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు. కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి" అన్నాడు.

"కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు" అని రామలక్ష్మణులు అడిగారు.

అప్పుడు కబంధుడు 'పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరముతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది. అది ఎమిటంటే, నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది' అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను.

అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి 'ఇలా ఈ రూపంలో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది' అని చెప్పారు అని అన్నాడు కబంధుడు.

◆వెంకటేశ్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories