రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం వెనుక కారణం?

రామలక్ష్మణులకు పరిచయమైన కబంధుడు రాముడితో "రామ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యను పోగొట్టుకుని బాధపడుతున్న వాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, నలుగురు వాసరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వలన సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి, సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. 

ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుకి వెళ్ళు, అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు వాటిని వేటాడి తినచ్చు. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి. అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.

ఆక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామ. పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్థాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి. ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.

ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజు పంపా సరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఎనుగులన్నీ నోట్లోనుండి నెత్తురు. కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక, అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది, దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.

ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామ, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి" అని చెప్పాడు.

 ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories