ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగించే అంగుళీమాలుడి జీవితం!

భారతీయులు సాక్షాత్తు భగవంతుడే అంటూ కీర్తించి, పూజించిన బుద్ధుడి బోధనలు దశదిశలా వ్యాపించాయి. దేశాన్నేలే రాజులనుండి దోపిడీ దొంగల వరకు ఎంతో మందిని ప్రభావితం చేసాయి. వీరిలో కొంతమంది కథలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

క్రూరుడిపై కారుణ్యం

విధి వంచితుడైన అహింసకుడనే బ్రాహ్మణ బాలుడే అంగుళిమాలుడు. దారి దోపిడీ దొంగగా మారి ఎంతో మంది బాట సారులను నిర్దాక్షిణ్యంగా నిర్జించేవాడు. కారుణ్యంతో క్రూరత్వాన్ని జయించి అతణ్ణి భిక్షువుగా మార్చాడు బుద్ధుడు.

నాటిపాపం.. నేడు పశ్చాత్తాపం..

ఆరామానికి చేరిన అంగుళీ మాలుడు పాత జీవితం గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధపడేవాడు. ఎవరెంత అనునయించినా అతడి బాధ ఉపశమించేది కాదు. ఈ సంగతి బుద్ధుడికి తెలిసింది. అంగుళమాలుడి బాధను పోగొట్టి, ఆదర్శ భిక్షువుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు శాక్యముని.

అంగుళీమాలుడు వెంటరాగా బుద్ధుడు వేరొక గ్రామానికి ప్రయాణమయ్యాడు. వారొక అడవి మార్గం గుండా వెళుతూ వృద్ధురాలైన తల్లి ఒడిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని చూశారు. వృద్ధురాలు వారి రాకను గమనించింది. తన కూతురిని కష్టం నుండి కాపాడమని వేడుకుంది. సుఖ ప్రసవం అయ్యేట్టు ఆశీర్వదించమని అర్ధించింది.

ప్రమాణం.. పాప విమోచనం..

 అంగుళీ మాలుణ్ణి అనుగ్రహించే సమయం ఆసన్నమైందని బుద్ధుడు భావించాడు. “ఏం చేస్తున్నానో తెలియక ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా చంపాను. ఒళ్ళు తెలియని అజ్ఞానంలో ఎన్నో పాపాలకు పాల్పడ్డాను అని ప్రమాణం చేసి ఆమెను ఆశీర్వదించు. ప్రమాణం సత్యమే అయితే ఆవిడ బాధ ఉపశమిస్తుంది" అని అంగుళీమాలుణ్ణి అనునయించాడు. "ప్రమాణం ఎలా చేసేది? నేను ఒక మహా పాపిని" అంటూ అంగుళీమాలుడు ఆక్రోశించాడు. మరేమీ ఫరవాలేదని చెబుతూ బుద్ధుడు అతణ్ణి ప్రమాణం చేయమని ప్రోత్సహించాడు.

పరితప్త హృదయంతో అనుమానిస్తూనే బుదుడు చెప్పినట్టుగా అంగుళీమాలుడు ఆమెను ఆశీర్వదించాడు. అక్కడి నుండి కదిలి కొద్ది దూరమైనా వెళ్ళకముందే వారికి పసివాడి ఏడుపు వినిపించింది. ఆశ్చర్యపోవటం అంగుళీమాలుడి వంతయింది. పశ్చాత్తాపం తనను పునీతుణ్ణి చేసిందా!! అని అతడు ఆలోచిస్తున్నంతలోనే వృద్ధస్త్రీ అప్పుడే పుట్టిన పసి పిల్లవాడితో వారి వద్దకు వచ్చింది. ప్రేమతో ఆశీర్వదించమని అర్ధించింది.

అంగుళీమాలుణ్ణి ఆదరంతో చూస్తూ బుద్ధుడు మందహాసం చేశాడు. పిల్లవాడి తలపై చేతిని ఉంచి ఆశీర్వదించాడు. పాపిని సైతం పవిత్రుణ్ణి చేసే బుద్ధుడి కరుణ అంగుళీమాలుడి హృదయాన్ని కరిగించింది. బుద్ధుడి పాదాలపై పడి ప్రేమా శ్రువులతో అంగుళీమాలుడు అభిషేకించాడు. “ఇకనైనా నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిందని నమ్ముతావా!” అంటూ బుద్ధుడు అంగుళీమాలుణ్ణి పైకెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ప్రయాణం కొనసాగించి వారు పక్కనే ఉన్న పల్లెటూరిని చేరుకున్నారు.

అహింసతో అమరత్వం..

 విశ్రాంతి తీసుకున్న తరువాత అంగుళీమాలుడు భిక్షకై ఊళ్ళోకి వెళ్ళాడు. ప్రజలు అతణ్ణి గుర్తించి చేతికి దొరికిన ఆయుధంతో బాగా గాయపరిచి వదిలిపెట్టారు. చావు బతుకుల మధ్య అంగుళీమాలుడు కరుణామయుడైన బుద్ధుని కడసారి దర్శించు కోవాలను కున్నాడు. అతి కష్టంతో నేలపై పాకుతూ బుద్ధుడి వద్దకు బయలుదేరాడు.

తనను సమీపిస్తున్న అంగుళీమాలుణ్ణి చూస్తూనే బుద్ధుడు అతని వద్దకు పరుగెత్తాడు. అతని తలను తన ఒడిలో ఉంచుకుని, శిష్యుల సహాయంతో అతడికి పరిచర్యలు చేశాడు. "ఎలా ఉంది నాయనా?" అంటూ ఎంతో ఆప్యాయంగా అతడిని ప్రశ్నించాడు. “జీవితంలో ముందెన్నడూ లేనంత శాంతిని అనుభవిస్తున్నాను భగవాన్" అని సమాధాన మిస్తున్న అంగుళీమాలుణ్ణి కరుణతో చూస్తూ బుద్ధుడు “వారు గాయపరుస్తున్నప్పుడు నీకేమైనా కోపం వచ్చిందా?” అని ప్రశ్నించాడు. "గతంలో ఎంతో మందిని అమానుషంగా చంపుతున్నప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నన్ను బాధిస్తున్నపుడు వారేం చేస్తున్నారో వారికి తెలియదు." అని అంగుళీమాలుడు తన ఆఖరి శ్వాసను విడిచాడు.

తప్పని తెలిసాక ఒప్పుకునే వినమ్రత ఉంటే చేసిన తప్పులు మనల్ని అంతగా బాధించవు సరికదా మనల్ని తీర్చిదిద్దుతాయి. ఇతరుల తప్పులను సైతం క్షమించే హృదయ వైశాల్యాన్ని ప్రసాదిస్తాయి.

                                        ◆నిశ్శబ్ద.


More Subhashitaalu