గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి??


శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. శ్రద్ధ ఉండాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. దానికి తగ్గట్టు గురువు పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గరకు పోయినపుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును, విధేయతను, శ్రద్ధను గురువు ముందు ప్రకటించాలి. 


అది ఎలాగంటే......... 


మొదటిది ప్రణిపాతము. జ్ఞానము నేర్చుకోడానికి గురువు దగ్గరకు వెళ్లిన సాధకుడు ముందు గురువుగారికి సాష్టాంగ నమస్కారము చేయాలి. దానినే ప్రణిపాతము అని అంటారు. గురువుకు సాష్టాంగ నమస్కారము చేయడం. అంటే తనలో ఉన్న గర్వము, అహంకారము, దర్పము అభిమానము అంతా విడిచిపెట్టినట్టు లెక్క లేకపోతే గురువు గారి పాదములకు నమస్కరించడు. 


దేహాభిమానము ఉన్నంతవరకు విద్య రాదు. గురువు చెప్పినది తలకెక్కదు. ఎందుకంటే "ఈ గురువుకు ఏం తెలుసు. నా కన్నా ఈయనకు బాగా తెలుసా?" అని మనసులో అహంభావము, అభిమానము ఉంటే, ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు. కాబట్టి సాధకుడికి వినయము ముఖ్యము. పోనీ నిలబడి దండం పెడితే చాలదా.... నేల మీద సాష్టాంగ పడాలా... అని కొందరు అనుకుంటారు. గురువుగారి పాదములను తాకడం వలన అహంకారము నశించి వినయం, శ్రద్ధ గురువుగారి మీద భక్తి పెరుగుతాయి. గురువు ఎప్పుడూ శిష్యుడు తనకు ఇలా నమస్కారం చెయ్యాలి అని అనుకోడు. శిష్యుడి లో ఉన్న వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతోనే తెలిసిపోతాయి.


ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు గొప్ప వాడు కావచ్చు. చక్రవర్తి కావచ్చు. గొప్ప అధికారి కావచ్చు. అపరిమితమైన అధికారాలు కలిగి ఉండవచ్చు కాని భగవంతుని ముందు, గురువుల ముందు, తత్వవేత్తల ముందు సామాన్యుడే. పరమాత్మ దృష్టిలో ఈ ప్రాపంచిక మైన, వ్యావహారికమైన పదవులకు, హెూదాలకు విలువ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి చెందినవి. పైగా కొంత కాలానికి పరిమితం అయ్యాయి. ఈ శరీరం శాశ్వతంకాదు. ఈ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతమైన పరమాత్మ ముందు అశాశ్వతములైన పదవులకు హెూదాలకు విలువ లేదు. బ్రహ్మ బలమే నిజమైన బలము హెూదా, అధికారము అన్నీ.


ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగము, హెూదా, కీర్తి, పరాక్రమము ఉండి కూడా వశిష్టుని, బ్రహ్మ బలాన్ని గెలువలేకపోయాడు. తుదకు వశిష్టునికి సాష్టాంగ నమస్కారము చేసి ఆయనచేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. పూర్వ కాలంలో కూడా చక్రవర్తులు, రాజులు తమ తమ రాణులతో కలిసి వనములకు వెళ్లి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచనములను పొందారు అని వింటూ ఉంటాము. ఈ రోజుల్లో కూడా ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, ఉన్నత పదవులలో ఉన్న వారు రమణ మహర్షికి పరమాచార్యకు ప్రణిపాతము చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి గురువుల ముందు గర్వమును అహంకారమును వదిలిపెట్టి ప్రణిపాతము చేయాలి.


ఇంక రెండవది పరిప్రశ్నేన. గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన తరువాత తనలో ఉన్న జిజ్ఞాసను, తపనను ఎలా ప్రకటించాలి అంటే గురువు గారు ప్రసన్నుడిగా ఉండగా చూచి, ఆయనను తనలో ఉన్న సందేహములను గురించి ప్రశ్నించాలి. దానినే పరిప్రశ్న అంటారు. అంటే, కటువుగా కాకుండా, వాద ప్రతివాదముల రూపంలో కాకుండా, వితండ వాదంగా కాకుండా, సౌమ్యంగా, భక్తిభావంతో గురువుగారిని ప్రశ్నించాలి. తాను వేయబోయే ప్రశ్న గురువు గారిని అడగవచ్చునా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు అడగాలి. ఆయన ఇచ్చిన సమాధానములను భక్తితో అర్థం చేసుకోవాలి. అంతే కానీ “నీకేం తెలుసు నీ కన్నా నాకే బాగా తెలుసు" అనే భావన మనసులో రానీయకూడదు.


మూడవది... సేవయా.... అంటే గురువుకు సేవ చేయాలి. అది ఈ రోజుల్లో సాధ్యం అయ్యేది కాదు. పూర్వము గురుకులములో ఉండే శిష్యులు గురువుకు సేవ, శిశ్రూష చేసే వాళు సేవ చేయడం అంటే గురువుకు దగ్గర అవడం. అప్పుడు గురువు గారికి నీ తత్వము, నీ స్వభావము అర్థం అవుతుంది. నీకు ఎలా చెబితే అర్థం అవుతుందో గురువు గారికి అర్థం అవుతుంది. అంతే కాకుండా, గురువుగారి అనుగ్రహము, కటాక్షము పొందాలంటే శుశ్రూష చేయాలి. గురువుగారి కటాక్షము లేనిదే ఆధ్యాత్మికంగా శిష్యుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. గురు సేవ, దైవ సేవ రెండు ప్రతి మానవుడికి అవసరమే. కాబట్టి గురువు గారి వద్ద విద్య నేర్చుకోడానికి ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న తప్పక చేయాలి. ఇవి శిష్యుడిలో ఉండాల్సినవి.

              ◆ వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu