శ్రీపాద శ్రీ వల్లభ దివ్య సిద్ధమంగళ స్తోత్రం అర్థ,
తాత్పర్యాలతో
దీపావళి స్పెషల్ ఆర్టికల్స్ కోసం విచ్చేయండి ...
శ్రీమదనంతశ్రీ విభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |1|
అర్ధాలు: శ్రీ = లక్ష్మి, సంపద, సిరి, గౌరవసూచక ప్రత్యయము (ముందుగావచ్చు పదం) - అనేవి 'శ్రీ' కి గల సామాన్య అర్ధాలు, శ్రీ = పరిపూర్ణ పరబ్రహ్మ, మంగళకరమైన - అనేవి 'శ్రీ' కి గల ఆధ్యాత్మిక వేదాంతార్ధాలు, శ్రీమదనంత శ్రీ = అనంతమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ, విభూషిత = విశేషశోభ కలిగిన.
తాత్పర్యము: "శ్రీమదనంతమైన శ్రీ" చే విశేషంగా శోభిల్లుచున్నవాడా! ఓ అప్పలలక్ష్మీ నరసింహరాజా! నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! శ్రీమదఖండ శ్రీ" నీకు జయమగును గాక! ఈ శ్లోకంలో మనం గుర్తించవలసిన పదాలు రెండున్నాయి. మొదటిది " శ్రీమదనంత శ్రీ", రెండోది "శ్రీమదఖండ శ్రీ". శ్రీపాద శ్రీ వల్లభుల పేరులో రెండు "శ్రీ" లు ఉన్నట్లే, ఈ రెండు పదాల్లో ఒక్కోదాంట్లో రెండు చొప్పున మొత్తం నాలుగు "శ్రీ" లు ఉండి ఈ శ్లోకం చతురస్ర "శ్రీ" శోభితంగా శోభిల్లుతున్నది. పై రెండుపదాల్లో ఉండే మొదటి "శ్రీ" లక్ష్మి, సంపద, శోభ అను అర్ధమును తెలుపుతుండగా రెండవ "శ్రీ" పరంభ్రహ్మను అర్ధంగా తెలుపుతున్నది. "శ్రీ" అని మనం పలికినప్పుడు "శ్రీ" శబ్దంలో 'శ' కారము, 'ర' కారము (రేఫ) మరియు 'ఈ' కారములను స్పష్టంగా వినవచ్చు. ఈ మూడు "కారములు" కలిసి "శ్రీ" ఏర్పడినట్లుగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవంటి "కారములు" కలసి ఏర్పడిన శ్రీపాద శ్రీ వల్లభుల జననమునకు కారణమైన అప్పలలక్ష్మీ నరసింహరాజా, నీకు జయమగును గాక!
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |2|
అర్ధాలు: శ్రీ = మంగళప్రదమైన, రాఖీ = రక్షకట్టు, రక్షాబంధనము, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: శ్రీవిద్యాధరి, రాధ, మరియు సురేఖ అనబడే చెల్లెళ్ళు కట్టిన మంగళప్రదమైన రాఖీలను ధరించినవాడా! ఓ శ్రీపాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మినికలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |3|
అర్ధాలు: వాత్సల్యామృత = అమృతం తో సమానమైన వాత్సల్యప్రేమ, పరిపోషిత = దినదిన ప్రవర్ధమానమైన, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: సుమతీ తల్లి యొక్క అమృతం తో సమానమైన వాత్సల్యప్రేమ ను త్రాగి , దినదిన ప్రవర్ధమానమైనవాడా! ఓ శ్రీ పాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |4|
అర్ధాలు: దుహిత = కూతురు, నందన = బిడ్డ, నుతము = స్తుతింపబడిన (సంస్కృత విశేషణము), శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: సత్యఋషీశ్వరులుగా పేరుగాంచిన బాపనార్య కూతురి బిడ్డడైన ఓ శ్రీ పాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |5|
అర్ధాలు: సంభవ = పుట్టు, ప్రాప్తమగు,కలుగు,ఉదయించు, ఉద్భవించు, జనించు,జన్మించు, ప్రభవించు, గోత్రం = మూలవంశము, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: సవితృకాఠకచయనమనే యజ్ఞం చేయడంవల్ల వచ్చిన పుణ్యఫలంతో భారద్వాజస గోత్రంలో జన్మించినవాడా! ఓ శ్రీ పాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
దోచౌపాతీదేవ్ లక్ష్మీ ఘనసంఖ్యాభోదిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |6|
అర్ధాలు: దో = రెండు (2), చౌ= నాలుగు (4), పాతీదేవ్= పతిదేవ్ - పతిదేవుడు =మార్పు చెందని 9 సంఖ్యవంటి పరబ్రహ్మ, లక్ష్మీ = 8 సంఖ్యను సూచించే మాయావాచకం, చౌపాతీదేవ్= 'చపాతీ' అనబడే భోజన పదార్ధాన్ని ఇవ్వమని అడుగుట ఘనసంఖ్య = 2498 (శ్రీపాద ఘనసంఖ్య), భోదిత = భోదించిన, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: "దోచౌపాతీదేవ్ లక్ష్మీ!" అంటూ బిక్షాటనచేస్తూ, మార్పుచెందని పరబ్రహ్మనని తెలియజేసే 2498 అనే ఘనసంఖ్యను వెల్లడించినవాడా! ఓ శ్రీ పాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |7|
అర్ధాలు: సుత = కూతురు, సంజాతము = కలిగిన, పుట్టిన,అయిన, శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: పుణ్యరాశి అయిన రాజమాంబ కూతురి పుణ్యఫలం వలన ఆమె గర్భం నుండి పుట్టినవాడా! ఓ శ్రీపాద శ్రీ వల్లభ నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక!
సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |8|
అర్ధాలు: నందన = పుత్రుడు, నరహరి = అప్పలలక్ష్మీ నరసింహరాజ శర్మ (గ్రామించబడిన అర్ధం), శ్రీమదఖండ శ్రీ = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: సుమతి పుత్రుడా!, నరహరి (అప్పలలక్ష్మీ నరసింహరాజ శర్మ ) పుత్రుడా! శ్రీపాద దత్త ప్రభో! నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ |9|
అర్ధాలు: నిత్యవిహార = ప్రతీరోజు విహరించు, "శ్రీమదఖండ శ్రీ" = అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ పరబ్రహ్మ.
తాత్పర్యము: పీఠికాపురము లో ప్రతీరోజు విహరించువాడ! మధుమతి సమేత మంగళకరమైన రూపం కలిగినవాడా! నీకు జయమగును గాక! విజయమగును గాక! దిగ్విజయమగును గాక! అఖండమైన లక్ష్మిని కలిగిన ఓ శ్రీపాద పరబ్రహ్మ నీకు విజయమగును గాక!
(సత్యఋషీశ్వర మల్లాది బాపనార్యకృత దివ్య సిద్ధమంగళ స్తోత్రము)
గమనిక : ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఎటువంటి విధినిషేదములు లేవు.
ఫలశృతి: పరమ పవిత్రమైన యీ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మాణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. యీ స్తోత్రమును పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన, స్పర్శ నములు లభించును. యీ స్తోత్రమును పఠించు చోట సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును భక్తీతో పఠించుట వలన మనసున తలచిన కోరికలు నెరవేరి, శ్రీ పాదుల వారి కృపకు పాత్రులగుదురు.