అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఎందుకు ఉంటారు...ఈ అమ్మ ప్రత్యేకత ఏంటంటే..!


ఈ సృష్టిని ఓ శక్తి నడిపిస్తోందని ఆ శక్తి ఆ అమ్మవారేనని  చాలా మంది నమ్మకం.  సృష్టికి అమ్మగా అమ్మవారినే భావిస్తారు.  అమ్మవారిని  దేవీ నవరాత్రుల పేరిట  తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో  పూజిస్తారు.  ఇందులో భాగంగా రెండవ రోజున బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని పూజిస్తారు.  కొన్ని చోట్ల అమ్మవారిని  గాయత్రి రూపంలో కూడా అలంకరిస్తారు.  గాయత్రి రూపంలో అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అలంకరిస్తారు.  ఈరోజున గాయత్రి మాత తన బంగారంతో చేసిన అయిదు ముఖాలతో ధగధగ మెరిసిపోతూ  ఉంటుంది.  దీనికి తగినట్టు అమ్మవారి పది చేతులు,  మెడలో పచ్చల హారం,  కంఠాన్ని మెరిపించే ఆభరణాలతో భక్తులను మైమరిపిస్తుంది.

బ్రహ్మచారిణి..

దేవీ నవరాత్రులలో అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తుంది. బ్రహ్మజ్ఞానం కలిగి సర్వం తెలిసిన దేవత ఈ అమ్మ అని చెబుతారు.  బ్రహ్మచారిణి అమ్మవారని పూజిస్తే జ్ఞానం కలుగుతుందని పండితులు చెబుతారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తే మరణ భయం ఉండదట.  అసలు బ్రహ్మచారిణి రూపం, ఆ పేరు ఎలా వచ్చిందంటే..

బ్రహ్మచారిణి అమ్మవారి రూపం విశిష్టమైనది. అమ్మవారి చేతిలో జపమాల, కమండలం ఉంటాయి.  మరొకవైపు కలశం ఉంటుంది.  తెల్లని చీరలో ఈ అమ్మ దర్శనమిస్తుంది.  బ్రహ్మచారిణి అమ్మవారు కఠోర తపస్సు చేస్తూ ఉంటారట.  అందుకే ఈ అమ్మను ఆరాధిస్తే భక్తి పెరగడంతో పాటూ అనుకున్న పనులు కూడా నెరవేరుతాయట.  పరమేశ్వరుడిని భర్తగా  పొందడం కోసం పార్వతి దేవి తీవ్ర తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందింది.  పార్వతీ మాత వివాహానికి ముందే తపస్సు చేసి ఉండటం వల్ల  ఈ అమ్మను తమశ్చారిణి,  బ్రహ్మచారిణి అని పిలుస్తారు. ఈ అమ్మను పూజిస్తే ఐశ్వర్యం,  జ్ఞానం,  వైరాగ్యం,  సహనం,  దైర్యం మొదలైనవన్నీ లభిస్తాయి.

దేవీ నవరాత్రులలో బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించేటప్పుడు "ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః" అనే మంత్రాన్ని జపించాలి.

"యా దేవి సర్వ భూతేమ బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత
నమస్తేస్త్యై నమస్తేయై నమస్తే నమస్తస్యై నమో నమః" అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

కుజదోషం ఉంటే..

చాలామందికి కుజదోషం ఉంటుంది.  కుజ దోషం ఉంటే వివాహం కాదని చెబుతుంటారు. అయితే బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల కుజదోషం తొలగిపోతుంది.  అలాగే జన్మకుండలినిలో  కుజ స్థానం బలపడి ఆస్తి తగాదాలు,  ఆస్తి విషయాలలో  విజయం దక్కుతుంది.


                                           *రూపశ్రీ.


More Dasara - Navaratrulu