దేవీ నవ రాత్రులలో అఖండ దీపం శాంతమైతే(ఆరిపోతే) అపచారమా... ఏం చేయాలంటే..!

 

అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.  దేవీ నవ రాత్రులను దేశ వ్యాప్తంగా చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చాలామంది దేవీ నవ రాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉంటారు. ఈ 9రోజులు అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగిస్తారు. అఖండ దీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి.  అఖండ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. దీపం వెలిగించిన తరువాత దేవీ నవరాత్రులు ముగిసేవరకు ఈ దీపం శాంతం కాకూడదు.  అయితే ఇలా అఖండ దీపం వెలిగించినప్పుడు ఏ కారణం చేతనైనా ఆ దీపం శాంతం అయితే(ఆరిపోతే) అపచారం అని అంటుంటారు.  పొరపాటున అఖండ దీపం శాంతం అయితే ఏం చేయాలి?

దేవీ నవరాత్రులు లేదా దసరా పండుగను 10 రోజులు ఉత్సాహంగా జరుపుకుంటారు. మొదటి 9రోజులు అమ్మవారు 9 అలంకారాలతో  దర్శనమిస్తుంది.  10వ రోజు అమ్మవారి విజయాన్ని దసరా పండుగలాగా జరుపుకుంటారు.

అఖండ జ్యోతి..

దేవీ నవరాత్రుల సమయంలో అఖండ జ్యోతిని వెలిగించడం వల్ల జీవితంలోనూ,  కుటుంబంలోనూ ఉన్న సమస్యలు,  ఇబ్బందులు, కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.  అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి పటాన్ని ఇంట్లో ఉంచి అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించాలి.  ఈ అఖండ దీపం తొమ్మిది రోజులూ వెలుగుతూనే ఉండాలి.  ఇది కేవలం కష్టాలను ఇబ్బందులు తొలగించేదే కాదు.. అదృష్టాన్ని, సంపదలను, సౌభాగ్యాన్ని కూడా చేకూర్చుతుంది.

నియమాలు..

దేవీ నవరాత్రులలో మొదటి రోజు శుభ ముహూర్త సమయంలో కలశాన్ని స్థాపిస్తారు.  మొదటిరోజు పూజ మొదలుపెట్టే ముందు  అఖండ జ్యోతిని వెలిగిస్తారు.

నెయ్యి,  అవనూనె,  నువ్వుల నూనెతో మాత్రమే అఖండ జ్యోతిని వెలిగించాలి.

నూనెతో దీపం వెలిగించాలంటే దుర్గా మాతకు కుడివైపున దీపాన్ని ఉంచి దీపాన్ని వెలిగించాలి.  నువ్వుల నూనె లేదా ఆవునెయ్యి లేదా ఆవనూనెతో దీపం వెలిగించేవారు అమ్మవారికి ఎడమ వైపున దీపాన్ని ఉంచి వెలిగించాలి.  నల్ల మినపగుండ్లు,  బియ్యం లేదా నల్ల నువ్వుల పైన దీపం ఉంచాలి.  దీపం వెలిగించినప్పుడు ఆ దీపం కాంతి జ్వాల ఉత్తరం లేదా పడమర వైపు మళ్లించాలి.  దీపాన్ని దక్షిణ దిశలో మాత్రం ఉంచకూడదు.

అఖండ దీపం 9రోజులు  వెలుగుతూనే ఉండాలి.  అందుకే దీపం  కుందెనలో నెయ్యి లేదా నూనె ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. దీపం నిండుగా నూనె లేదా నెయ్యి ఉండేలా చూసుకోవాలి.

ఒకవేళ 9రోజులలో ఎప్పుడైనా దీపం శాంతమైతే..(ఆరిపోతే) అమ్మవారిని క్షమాపణ అడిగి,  పొరపాటున జరిగిపోయిందని లెంపలు వేసుకుని తిరిగి దీపాన్ని వెలిగించవచ్చు. అయితే అఖండ దీపాన్ని వెలిగించి దానిపట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీపం ఆరిపోయిన తరువాత లెంపలు వేసుకోవడం వంటివి చేయకూడదు.  భక్తిశ్రద్ధలతో మాత్రమే అమ్మవారి ముందు అఖండ జ్యోతిని వెలిగించాలి.

9రోజుల తరువాత కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటే దాన్ని నోటితో ఊదడం,  లేదా ఇతర పద్దతులలో ఆర్పడం వంటివి చేయకూడదు.  దీపం దానంతట అదే శాంతం అయ్యే వరకు అలాగే వదిలేయాలి.


                                               *రూపశ్రీ.


More Dasara - Navaratrulu