దేవీ నవ రాత్రులలో అమ్మవారిని ఈ పువ్వులతో పూజిస్తే ఎంత పుణ్యమో..!

 

 


భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు దేవీ నవ రాత్రులు పెట్టింది పేరు. తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజిస్తూ చేసే పండుగ హడావిడి విజయదశమి  రోజున  పతాక స్థాయికి చేరుతుంది.  ఈ రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎన్నో విధాలుగా అమ్మవారిని పూజిస్తారు.  అమ్మవారికి ఇష్టమైనవన్నీ ప్రసాదాలు,  రంగుల దుస్తులు,  పువ్వులు సమర్పిస్తారు.  ముఖ్యంగా దేవీ నవ రాత్రులలో అమ్మవారిని కొన్ని రకాల పువ్వులతో పూజించడం వల్ల అమ్మవారి కరుణకు పాత్రులు కావచ్చట.  అమ్మవారిని ఏ రంగు పువ్వులతో పూజిస్తే మంచిదంటే..

బంతి పువ్వులు..

భారతీయ వేడుకలలో ఎక్కువగా వినియోగించే పువ్వులలో బంతి పువ్వులు ప్రథమ స్థానంలో ఉంటాయి. దుర్గాదేవికి బంతి పువ్వులను సమర్పించడం వల్ల  ఆర్థిక విషయాలలో లాభాలు చేకూరతాయట.  ఎవరికైనా ఏ విషయాలలో అయినా ప్రతికూల సమస్యలు ఉంటే బంతి పువ్వులతో అమ్మవారిని  పూజిస్తే సమస్యల నుండి ఉపశమనం ఉంటుందట.  కుటుంబంలో సమస్యలు కూడా తొలగిపోతాయట.

మందారం..

దేవీ నవ రాత్రులలో ఏదైనా ఒక రోజు మందారం పూలతో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిదట.  మందార పువ్వులతో పూజించి ఆ అమ్మవారిని కోరికలు తప్పకుండా నెరవేరతాయట. కుటంబంలో సుఖ సంతోషాలు నెలకుంటాయట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం,  ఆదాయం పెరగడం,  ఐశ్వర్య ప్రాప్తి మొదలైనవన్నీ మందార పువ్వులతో పూజించడం వల్ల చేకూరతాయట. అన్నింటి కంటే ముఖ్యంగా దుర్గాదేవికి మందార పువ్వులతో పూజ చేస్తే ధైర్యం,  సమస్యలను ఎదుర్కునే తెలివి లభిస్తాయట.

గులాబీలు..

గులాబీ పువ్వులతో నవ రాత్రులలో దుర్గా దేవిని పూజిస్తే అమ్మవారి నుండి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.  దుర్గా మాతకు గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమట.  గులాబీలతో పూజ జీవితాన్ని సంతోషమయం చేస్తుందట. ఇవి మాత్రమే కాకుండా సానుకూల వాతావరణం ఇంట్లో నెలకొంటుందట.  

తామరలు..

అమ్మవారికి తామర పువ్వులంటే చాలా ఇష్టం.  చాలామంది ఇళ్లలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు తాజా తామర పువ్వులు అందుబాటులో లేకపోయినా బంగారం, వెండితో తామర పువ్వులను కొనుగోలు చేసి వాటితో పూజ చేసుకుంటూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా ఈ దేవీ నవ రాత్రులలో తాజా తామర పువ్వులతో ఏదో ఒకరోజు అమ్మవారికి  పూజ చేసుకుంటూ ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి.  ముఖ్యంగా అనుకున్న పనులన్నింటిలో విజయం సాధిస్తారు.


                                                   *రూపశ్రీ.


More Dasara - Navaratrulu