శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా..


శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం అని పేరు. దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.

 


ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.

 


ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి  కూడా రావట. వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు. ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.


అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట. ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ  తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం.

శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని  షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది . శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.

...కళ్యాణి  


More Enduku-Emiti