నిద్ర  లేవటం (మేలుకొనటం)

 

 

నిద్ర లేచిన తీరుని బట్టి ఆ రోజు ఎలా గడుస్తుందో స్థూలంగా చెప్పవచ్చునట. ఇది మానసిక స్థితికి సంబంధించినది. మనస్సు ఆహ్లాదంగా ఉంటే ఆ నాటి పనులన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నది అందరికి అనుభవంలో ఉన్నదే . పని తీరు మానసిక స్థితి మీద ఆధార పడి ఉంటుంది. తీరుని బట్టి ఫలితం ఉంటుంది.

 

ఒక మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి పనిలోనూ పాటించ వలసిన పద్ధతులని మన పెద్దలు అనుభవంతో చెప్పారు. అవి శాస్త్రీయమైనవి మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనవి. కాలం పెట్టిన పరీక్షలకి నిలిచినవి. అయితే కాల క్రమంలో కొన్నింటి వెనుక ఉన్న శాస్త్రీయతను నిరూపించ లేక పోవచ్చు. దానికి కారణం కాలక్రమంలో ఒక పద్ధతిని పాటిస్తూ పోవటం అలవాటయ్యి, ప్రశ్నించటం మరచి పోయి, అడగటం తప్పు అనే భ్రమలో పడిపోవటం. దాని వల్ల కొన్ని ఆచారాలు పాటించటం వెనుక ఉన్న శాస్త్రీయత మరుగున పడిపోయింది. వాటిని వెలికి తీయ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉపయోగం తెలిస్తే యువతరం శ్రద్ధగా పాటిస్తుంది. అటువంటి వాటిలో ప్రథమమైనది నిద్ర లేవటం.

 

నిద్ర లేవటానికి కూడా ఎప్పుడు? ఎలా? అని నిర్దేశించే ఒక పద్ధతి ఉన్నది, దానికొక సహేతుకమైన కారణం కూడా ఉంది అంటే ఆశ్చర్యం కలగ వచ్చు. కానీ ఉన్నది అని పెద్దలు దర్శించారు.

 

ఒక మనిషికి మంచి ఆరోగ్యం కావాలంటే  సుర్యోదయానికన్న కనీసం ఒక జాము ముందుగా లేవాలి. దానినే బ్రాహ్మీ ముహూర్తమని అంటారు. అంటే సూర్యోదయ సమయానికి కాలకృత్యాదికాలు పూర్తి అయి ప్రార్థనకి సిద్ధంగా ఉండటం జరుగుతుంది. తూర్పున సూర్యుడు ఉదయించే సమయానికి మనిషిలోని జీవ ప్రజ్ఞ చైతన్యవంతమౌతుంది. ఆ సమయంలో పడుకొని ఉంటే జీవ ప్రజ్ఞ వికసనం ఎలా జరుగుతుంది? కనుక అంతకు ముందుగానే లేచి, సిద్ధంగా ఉండటం సంప్రదాయం. అప్పుడు బుద్ధి పూర్తిగా వికసిస్తుంది. కనుక మంచి తెలివి తేటలు, బుద్ధి వికాసం, మేథా సంపద కావాలనుకునే వారికి ఎప్పుడు నిద్ర లేవాలో అర్థమయినట్టే కదా!

 

నిద్ర లేవటం కూడ ఒక పద్ధతిలో ఉండాలట! గాఢంగా నిద్రిస్తున్నవారు కంగారుగా లేచినట్లైతే అయోమయంగా ఉంటుంది. తనెవరో కూడా గుర్తు ఉండకపోవచ్చు కొన్ని సార్లు. అందుకే నెమ్మదిగా నిద్ర లేపాలని చెపుతారు. తనెవరో గుర్తు చెయ్యటం కూడా అవసరమనిపిస్తుంది. యాగ సంరక్షణ కోసం తన వెంట తీసుకొని వెడుతున్న శ్రీ రామ చంద్ర మూర్తిని విశ్వామిత్రుడు

 

“ కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే!

ఉత్తిష్ఠ నర శార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!!”

 

అని ఎంత చక్కగా నిద్ర మేల్కొలిపాడో అందరెరిగినదే! అంత నెమ్మదిగా, అంత మృదువుగా ఉండాలి నిద్ర లేపటం, లేవటం. అది ఆరోగ్యానికి మంచిది.

 

సాధారణంగా మానవులు పడుకుని నిద్ర పోతారు. అప్పుడు రక్త నాళాలు, నాడులు భూమికి సమాంతరంగా ఉంటాయి. రక్త ప్రసరణ చాలా తేలికగా జరిగి పోతూ ఉంటుంది. నిద్ర లేవగానే మనిషి కూర్చున్నా, నిలుచున్నా భూమికి లంబ కోణంలో ఉంటాడు. రక్త ప్రసరణ దిశ మారుతుంది గనుక గుండే పని తీరులో మార్పు ఉంటుంది. మార్పు సహజమే అయినా హఠాత్తుగా జరగటం వల్ల కంగారు, అయోమయం వంటివి కలగవచ్చు. వీలైతే వాటిని తప్పించి, గుండే పని సామర్థ్యాన్ని పెంచ వచ్చు కదా! అందుకే నిద్ర నుండి మెలకువ రాగానే వెంటనే మంచం మీద నుండి లేవ వద్దు అంటారు. ఒక ప్రక్కకి తిరిగి కొన్ని క్షణాలుండి, అటు ప్రక్కగా లేవాలట. ఆ తరువాత కొద్ది సేపు మంచం మీద కాళ్ళు క్రిందికి పెట్టి, పాదాలు నేలకి ఆనించి కళ్ళు మూసుకుని కూర్చోవాలట. నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి నిలబడాలట. ఎందుకంటే ఈ వ్యవధానంలో గుండే రక్తాన్ని సమాంతర దిశలో కాక  పైకి క్రిందికి ప్రసరించటానికి తగినట్టు పని చేయటం మొదలు పెడుతుంది. గుండేపై వత్తిడి తగ్గుతుంది. ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనలు చేసిన సర్వేక్షణ ఒక దానిలో తేలిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిద్ర నుండి హఠాత్తుగా లేచే అలవాటున్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువట! కనుక  నిద్ర లేచిన వెంటనే మంచం దిగి నిలబడ వద్దని వారి సూచన.

 

ఇలా చెపితే వినాలనిపించదు. అందుకే మన పెద్దలు నిద్ర లేచే పద్ధతిని ఒక సంప్రదాయంగా, ఒక ఆచారంగా అలవాటు చేశారు. మెలకువ రాగానే ప్రక్క మీదనే లేచి కూర్చోవాలి. రెండు అర చేతులను ఒక దానితో మరొక దానిని రుద్ది, గోర్వెచ్చగా అయిన పిమ్మట కళ్ల మీద ఉంచుకొని, కొద్ది సేపటి తర్వాత
           

“కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ                            
కర మూలేతు గోవిందః ప్రాభాతే కర దర్శనం”

అంటూ కళ్ళు తెరచి అర చేతులని చూడాలి. అప్పుడు

 “ సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే
విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శమ్ క్షమస్వ మే”

 

అంటూ భూదేవికి నమస్కరించి నెమ్మదిగా కాళ్ళు క్రింద పెట్టాలి.  ఆరోగ్య సూత్రంతో పాటు ప్రకృతి పట్ల భక్తిని కూడా జోడించటం ఉంది ఈ సంప్రదాయంలో.

 

అర చేతులకు స్వస్థత నిచ్చే గుణం ఉంది.  కళ్ళు మామూలుగా మూసుకున్న దానికన్న అర చేతులతో మూసుకుంటే ఎంతో హాయిగా ఉండటం అందరికి అనుభవంలో ఉన్నదే . కనుకనే కంటికి సుఖం కలగటం కోసం అర చేతులతో కప్పు కుని సమస్త ప్రపంచం మన చేతులలో అంటే  చేతలలో ఉందని ప్రతి ఉదయం గుర్తు చేసుకోవటమే ఇది. అంతే కాదు ఒక్క సారిగా కళ్ళు తెరిచి వెలుగుని చూడటం కూడా కంటి చూపుకి అంత మంచిది కాదు. ఈ పద్ధతి అలవాటయితే  ఒక వేళ ఎప్పుడైనా సూర్య కాంతి బాగా వచ్చినాక నిద్ర లేచినా ఇబ్బంది ఉండదు. 

 

....Dr Anantha Lakshmi 


More Enduku-Emiti