సతీదేవి ఆత్మాహుతి ఎందుకు చేసుకుంది?

Sati Devi Story

దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. యుక్తవయసులో ఆమె శంకరునిపట్ల మక్కువను పెంచుకుంది. తన ప్రేమను ఫలింపచేసుకుంది. మహాశివుడు సతిని మెచ్చి వరించాడు. తండ్రికి సతీదేవి, పరమేశ్వరుని పెళ్ళి చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అయినా ఆమె లక్ష్యపెట్టకుండా చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, స్మశానంలో తిరుగుతాడని, శరీరంమీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు.

ప్రయాగలో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేకమందితోబాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. కానీ, మహాశివుడు మౌనముద్రలో ఉండిదక్షుని పట్టించుకోలేదు. అది దక్షునుకి తీరని అవమానంగా తోచింది. బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఏమిటని ఆగ్రహించాడు. కోపావేశంతో విపరీతంగా నిందించాడు. దాంతో నందీశ్వరునికి కోపం ముంచుకొచ్చి దక్షుని శపించాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు. అయినప్పటికీ దక్షుడి కోపం తీరలేదు. శివుని అవమానించేందుకు పనిమాలా మహా యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి అందర్నీ ఆహ్వానించాడు కానీ కూతురు సతీదేవిని, అల్లుడిని పిలవలేదు.

తండ్రి యజ్ఞం తలపెట్టిందే శివుని పరాభావించేందుకు అని సతీదేవికి తెలీదు కదా! తమను యజ్ఞానికి పిలవనందుకు బాధపడింది. కానీ పుట్టింటివాళ్ళు పిలిచేదేమిటిలెమ్మని తనకు తానే సర్దిచెప్పుకుంది. పరమేశ్వరుడు ''సతీ, నీ తండ్రి నన్ను కాదుగదా కనీసం కూతురివైన నిన్ను కూడా పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు'' - అంటూ వారించినా, వినకుండా, నచ్చజెప్పి వెళ్ళింది. తీరా సతీదేవిని ఎవరూ ఆదరించలేదు. కనీసం పలకరించనైనా లేదు. పైగా మహాశివుడు చెప్పినట్లుగానే ''పిలవని పేరంటానికి తగుదునంటూ వచ్చావా?" - అంటూ అపహాస్యం చేశాడు. అంతకుమించి శివుని తూలనాడి, నలుగురిముందూ ఘోరంగా హేళన చేశాడు. సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. యజ్ఞగుండంలో దూకింది.

సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నట్లు తెలిసి మహాశివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన జటాజూటం నుంచి ఒక జటను తీసి విసిరి కొట్టాడు. అందులోంచి వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవించి, దక్షుని సంహరించారు.

సతీదేవి మరుజన్మలో హిమవంతుని కూతురిగా పుట్టింది. పర్వతుని కుమార్తె కనుక పార్వతి అయింది. పార్వతీదేవి తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని అర్థాంగి అయింది.

 

sati devi, sati devi story, sati devi and lord shiva, sati devi in hindu epics, sati devi hindu mythology, sati devi mythological story, Sati devi Devi Aatmahuti


More Enduku-Emiti