చదువులతల్లి నెలకొన్న శ్రీ సరస్వతీ క్షేత్రము, అనంతసాగర్
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిధ్దిర్భవతు మే సదా
ఈ శ్లోకం తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. చదువుల తల్లి, జ్ఞాన ప్రదాత అయిన సరస్వతీ దేవి పుట్టిన రోజు మాఘ శుధ్ధ పంచమినాడు. ఈ సంవత్సరం జనవరి 25న అయింది. మరి ఈ చల్లని తల్లి దీవెనలు పొందటానికి మనం ఆవిడ పూజ చేయటమేగాక, అనంతసాగర్ లో నెలకొన్న శ్రీ సరస్వతీ క్షేత్ర దర్శనంకూడా చేసొద్దాం పదండి.
దైవ దర్శనమేకాక దీనివల్ల ఇంకొక ఉపయోగంకూడా. పట్నంలోని రణగొణ ధ్వనులనుంచీ, హడావిడి నిత్యకృత్యాలనుంచీ దూరంగా వెళ్ళి ఒక రోజు కొంచెం సేద తీరి రావచ్చు. అనంత సాగర్ హైదరాబాదునుంచి 120 కి.మీ. ల దూరంలో మెదక్ జిల్లా, సిధ్ధిపేట డివిజన్ లో వున్నది. ఇక్కడ చెట్లు చేమలు, కొండలు దొనెలుతోకూడిన సుందర ప్రకృతిలో హాయిగా గడపచ్చు.
ఈ అనంతసాగర్ గ్రామశివార్లో ఒక చిన్న కొండమీద నిర్మింపబడింది శ్రీ సరస్వతీ క్షేత్రం. ఇక్కడ సరస్వతీదేవి నుంచునివుండి, వీణా, పుస్తక, జపమాల ధరించివుంటుంది. దేవికి కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణాకాళి కొలువుతీరి వున్నారు.
ఈ దేవాలయ నిర్మాణ వెనుక ఒక చిన్న కధ వున్నది. ఈ నిర్మాణానికి ప్రధాన కారకులు శ్రీ అష్టకాల నరసింహరామశర్మ. ఈయన తన 16వ ఏట ఒక మండలంపాటు బాసరలో శ్రీ సరస్వతీ దేవిని ధ్యానిస్తూగడిపారుట. అప్పుడు ధ్యానంలో ఆ దేవి దర్శనమై తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించిందట. ఏ ఆసరాలేని శర్మగారా విషయం గురించి అప్పుడెక్కువ ఆలోచించలేదు. కానీ కొంతకాలం తర్వాత జీవనోపాధి సంపాదించుకోవటం మొదలు పెట్టాక ఆలయ నిర్మాణంకోసం స్ధల నిర్ణయంగావించుకుని 1980లో నిర్మాణం మొదలుపెట్టి పది సంవత్సరములు శ్రమించి తన స్వార్జితంతో ఆలయ నిర్మాణం కావించారు. ప్రస్తుతం ఈ క్షేత్రం కుర్తాళం శ్రీ సిధ్ధేశ్వరీ పీఠంవారికి అనుసంధింపబడింది.
తర్వాత కాలంలో సర్వతోముఖాభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయంలో భక్తుల వసతికి ధర్మశాల, నీటి వసతి, పూజా కార్యక్రమాలకి యాగశాల వగైరాలు నిర్మిపబడ్డాయి. నూతనంగా ఎ.సి. గదులతో కళ్యాణమంటపం నిర్మాణంలో వున్నది.
ఇక్కడ భక్తులు వంటలు చేసుకొనవచ్చును. ముందు తెలియజేస్తే ఆర్యవైశ్య సత్రంవారు భోజన, ఫలహార సదుపాయం చేయగలరు.
విశేషాలు
ఆలయానికి సమీపంలో రాగి దొనె, పాల దొనె, చీకటి దొనె పేర్లతో మూడు చిన్న చిన్న గుహలలాంటివాటిలో జలాశయాలున్నాయి. ఇదివరకు ఇవి 8 వుండేవిట..కానీ ప్రస్తుతం మూడే వున్నాయి. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సుచేసుకున్నారుట. 60 గజముల పైన లోతు వున్న ఈ దొనెలలో నీరు పేరుకు తగ్గ రుచిలోనే వుంటాయి. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. రైతులు ఈ నీటిని తీసుకువెళ్ళి పంటలపై జల్లితే పంటలకు పట్టిన చీడలుపోయి చక్కని పంటలు పండుతాయని విశ్వాసంతో అలా చేస్తారు.
ఉత్సవములు
ప్రతి సంవత్సరం వసంత పంచమినాడు వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంనుంచి మూడు రోజులపాటు దేవి త్రిరాత్రోత్సవములు జరుగుతాయి. విజయదశమినాడు జరిగే దేవీ విజయోత్సవం, శమీపూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
మార్గము
మెదక్ జిల్లా, సిధ్ధిపేట డివిజన్ లో వున్న ఈ క్షేత్రం హైదరాబాదునుంచి 120 కి.మీ.లు, సిద్దిపేట నుంచి 20 కి.మీ. లు, కరీంనగర్ నుంచి 40 కి.మీ.ల దూరంలో వున్నది. కరీంనగర్ వయా శనిగారం వెళ్ళే బస్సులో వెళ్ళి శనిగారంలో దిగాలి. అక్కడనుండి 2 కి.మీ.లదూరంలో వున్న ఈ క్షేత్రానికి ఆటోలో వెళ్ళవచ్చు. మెదక్, సిధ్ధిపేట ఎటునుంచి వచ్చినా ఈ క్షేత్రానికి శనిగారంనుంచే వెళ్ళాలి.
మీరు వెళ్ళేసరికి ఆలయం మూసివున్నా, శ్రీ నరసింహారావుగారి కుటుంబం అక్కడే వుంటారు. పిలిస్తే అన్నివిధాలా సహాయం చేస్తారు.
ఫోన్ నెంబర్లు
శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ 9440008863
శ్రీ బి. నరసింహారావు, శ్రీమతి ప్రమోద 9951952928
ఆర్య వైశ్య సత్రం, అనంత సాగర్
శ్రీ అంజయ్య .. 9848090421
శ్రీ ప్రసాద్ .. 9505256742
సమీప దర్శనీయ ప్రదేశాలు
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, బెజ్జంకి ,, 10 కి.మీ.
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం, .. 25 కి.మీ.
వేములవాడ
- పి.యస్.యమ్. లక్ష్మి
