కన్యా రాశి - ఉత్తర ఫల్గుణి 2,3,4( టో, పా, పీ)
హస్తా 1,2,3,4 ( పూ, ష, ణా, రా) - చిత్త 1, 2 ( పె,పో)
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 5 అవమానం: 2
ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ|| సప్తమి. మంగళవారం వరకు 1వ స్థానములో తామ్రమూర్తిగా ఉండను, తదుపరి వత్సరాంతము 2 వస్థానమున రజిత మూర్తిగా ఉండును. శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశి మంగళవారము వరకు 4వ స్థానమున తదుపరి 26-10-2017 కార్తీక శు|| షష్ఠ గురువారం వరకు 3వ స్థానమున తదనంతరము వత్సరాంతము 4వ స్థానమున లోహమూర్తిగా ఉండును రాహుకేతువులు వత్సరాది 17-08-2017 వరకు రాహువు 12వ స్థానమున కేతువు 6వ స్థానమున సువర్ణ మూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతం రాహువు 11వ స్థానమున కేతువు 5వ స్థానమున తామ్రమూర్తులుగా ఉండును.
ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ఉత్తరార్థము గురువుద్వితీయ స్థాన స్థితిచే గత సంవత్సరము కంటే పరిస్థితులు అనుకూలించును. వివాహాది శుభకార్యాచరణ కనపడుచున్నది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. దూరప్రాంత ప్రయాణాలు చేయునపు తగు జాగ్రత్తలు అవసరము. విలువైన వస్తువులు భద్రపరుచుకొనవలయును. పనులు కాస్త ప్రయాసచే పూర్తి చేయుదురు. కొన్ని సందర్భములలో మీ అతి మంచితనం మీ బంధువులలో ఒక రకమైన తేలిక భావము ఏర్పడవచ్చును. కాస్త గాంభీర్యం అవసరము. శత్రువులపై చేయిసాధించుటకు తెలివిగా ప్రవర్తించవలెను అతి సాహసము, అతి ఆవేశము పనికిరాదు. తన సొమ్ము అయినా దాచుకొని తనవలెననే న్యాయాన్ని పాటించండి. ప్రముఖులు ముఖ్యంగా రాజకీయములందు ఉన్నవారు అన్ని తామె చూసుకొనవలయును. నూతన విద్యలలో ప్రవేశము కొరకై ఆశక్తి ఏర్పడుతుంది. ఉద్యోగములో ఉన్నత స్థితిగాని, స్థిరత్వము గాని ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికైనా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి రావచ్చును. కళాకారులకు అనుకూలం. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును ఊహిస్తూ వర్తమానాన్ని శూన్యం చేసుకోవద్దు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆత్మ విశ్వాసం తగ్గకుండా ముందుకు సాగండి.
విజయం వరిస్తుంది. జీవిత భాగస్వామితో అర్థంగాని చికాకులు ఏర్పడవచ్చును. వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కేవలం ఊహల్లో విహరిస్తూ వాస్తవాన్ని విస్మరించే అవకాశము గలదు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభము అడ్డ దారులలో పొందాలనే ఆలోచనకు స్వస్తి పలకండి. ఋణములు చేయవలసిన పరిస్థితులు రావచ్చు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రలోభాలకు లొంగరాదు. ఎన్ని అనంతరాలు అవస్థలు ఎదురైనా ఎదుటి వారిపై ఆదిపత్యము చూపిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులు ఎన్ని కుంతంత్రాలు రచించినా మీరు సరియైన సమయంలో తగు విధంగా స్పందించి మీరు ఏమిటో నిరూపించుకుంటారు. నూతన వ్యాపారానికి మార్గాలను అన్వేషిస్తారు. సంప్రదాయ విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రవేశము లభించవచ్చును. నిజ నిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని మోసపోకుండా ఉద్యోగములో పేరు ప్రతిష్ఠ వస్తుంది. కాని శ్రమ అధికము. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా ఏదో విధంగా మీకు అనుకూలంగా చేసుకుంటారు. కుటుంబం పరువు ప్రతిష్ట కొరకు నిర్మాణాత్మకమైన పనులు చేస్తారు. సోదర సౌఖ్యం పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనే కోరిక అనుకోకుండా సిద్ధమైంది.
సంవత్సరం 2వ భాగంలో సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభించును. ఈ సంవత్సరం ప్రతి పని, ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. అతి ఆవేశం, క్రోధం తగ్గించుకొనిన మేలు జరుగును. అనాలోచిత నిర్ణయాల వలన సమస్యలు మీకై మీరే సృష్టించుకొనిన వారగుదురు. ప్రతి విషయాన్ని ప్రతి వారిని సంశయాత్మకముగా చూడటం మానుకొనిన మేలు జరుగును. పనులన్నియు నెరవేరుటలో ఆలస్యం జరుగవచ్చును. కొందరికి స్థానచలనం జరుగు సూచనలు. ధనము మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం గలదు. ప్రతి పనీ సాధించేవరకు పూర్తి ఓపిక, సహనం అవసరం. కొంతవరకు మీలోని భావాలను హద్దులో ఉంచుకోవలసివచ్చును. ఆర్థికంగా చికాకులు ఏర్పడే అవకాశములు గలవు. ధనవ్యయము జరిగిననూ అది ఉపయోగ కరముగా, ప్రయోజన కరమైన వ్యయము కాగలదు. వృధా భ్రమణం చేసే పరిస్థితులు రావచ్చును. సహవాస దోషములు ఏర్పడే అవకాశములు గలవు. నీచ జన సహవాసం కలదు. ఎవరినైతే అతిగా విశ్వసిస్తున్నారో, వారి విషయంలోనే మీ మనస్సుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యామోహాలకు గురి అయ్యే అవకాశము గలదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం అశ్రద్ధ చేయరాదు. పంతాలకు, పట్టింపులతో ఏమీ సాధించలేరని గ్రహించండి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం యొక్క విద్యా విషయంలో కొంత నిరాశ చెందే పరిస్థితి రావచ్చును. అవివాహితులకు వివాహ సంబధాలు నిశ్చయమవుతాయి. సామాజిక పరపతి, ప్రతిష్ట పెరుగుతుంది. కాని దానికి సమాంతరం తీవ్రవత్తిడి, ధన వ్యయం కాగలదు. స్నేహితులతో, ఆత్మీయులతో కుటుంబంలో స్పర్థలు పెరిగే సూచన. వ్యాపార భాగస్వామియొక్క ప్రవర్తన ఆశ్యర్యానికి గురి చేస్తుంది. నమ్మకద్రోహం వల్ల మానసిక నిరాశ చెందుతారు.
పాత్రత నెరుగక కొందరిని అతిగా విశ్వసించడం వలన కొంత నష్టపోతారు. రాజకీయ పరంగా సంఘంలో ఉన్నత పదవి పొందే అవకావము గలదు. దూర ప్రాంతాల ప్రయాణం కొంతవరకు లాభించవచ్చు. వ్యాపారంలో పోటీతత్వము పెరుగుతుంది. తమ వారు పరాయివారు ప్రతి వారూ విమర్శిస్తుండటం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. మీ స్వవిషయంలో ఇతరుల జోక్యం సహించరు. నష్టమైనా, లాభమైనా నిర్ణయాలు తామే తీసుకోవాలని నిర్ణయిస్తారు. కాని ఈ నిర్ణయం కొన్ని సందర్భాలలో వికటించే అవకాశం కలదు. తమ శ్రేయస్సు కోరే వారి సలహా పాటించండి. మేలు చేస్తుంది. సహవాసదోషాలు విపరీతంగా బాధిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతువుల ప్రభౄవం వలన ఆరోగ్యవిషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. జీవిథ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. మొత్తం మీద ఈ రాశివారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శని, గురు, కేతు జపాలు ధ్యానము చేసిన మేలు జరుగును. గోపూజ చేయండి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ రామరక్షా స్తోత్రము చేసిన మేలు జరుగును.
గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారికోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి. అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి.
తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటివారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాదించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. లోకం దృష్టిలో ధనవంతులు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. నరఘోష విపరీతంగా ఉన్నది. శతృవులపై ఆధిపత్యానికై వారిని అదుపు చేయడానికై అనేక విధాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. స్థిరాస్థి అమ్మకానికి పెడతారు. అయితే అప్రయత్నం కొంత వాయిదా పడవచ్చు. స్థిరాస్థిని తప్పని పరిస్థితులలో అయిష్టముగా అమ్మకానికి పెట్టవలసిన పరిస్థితులు రావచ్చును. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువస్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా తీరకపోవుట.
చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమగును. తమపై తమకు ఆత్మ విశ్వాసము, ధైర్యము పెరుగును. గతంలో నిరాదరించినవారు ఆదరించుట, వారే మీ సహాయానికై అర్థించుట జరుగవచ్చును. అది మీకు గర్వంగా పరిణమించవచ్చును. గతంలో మీరు వహించిన సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి తనానికి అలస్యంగానైనా గుర్తింపు సత్పలితం ఉంటుందని సంతోషపడతారు. కళాకారులకు రెండవ ప్రయత్నంగా ఫలితము దక్కవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కాని లభించిన ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవచ్చును. అయినా కొద్ది రోజులు ఓపికతో ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో వృత్తిలో పోటీ మాత్రము పెరుగుతుంది. నిలబడటానికి చేసే ప్రయత్నము ఫలిస్తుంది. సామాజిక, రాజకీయ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మికంగా ప్రముఖస్థానంలో ఉన్న గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉదర, కటి క్రింది భాగపు అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. కొన్ని సందర్భాలలో మిమ్ములను ఇష్టపడే వ్యక్తులను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడతారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీరు శ్రమిస్తున్న కృషికి ఫలితందక్కుతుంది. ఎక్కువగా రహస్యాలను అవలంభిస్తారు. గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి.