మీనరాశి - పూ.భా 4 (దీ)

ఉ.భా 1,2,3,4 (దూ, షం, ఝా, ధా) - రేవతి 1,2,3,4 (దే,దో,చా.చి)

ఆదాయం: 11      వ్యయం: 5     రాజపూజ్యం: 2   అవమానం: 4

    ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ||  సప్తమి మంగళవారము వరకు 7వ స్థానమున రజితమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 8వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. శని వత్సరాది 20-06-2017 వరకు 10వ స్థానమున తామ్రమూర్తిగాను తదుపరి 26-10-2017 వరకు 9వ స్థానమున రజిత మూర్తిగాను తదుపరి వత్సరాంతము 10వ స్థానమున తామ్రమూర్తిగా ఉండును. రాహుకేతువులు వత్సరాది 17-08-2017 వరకు రాహువు 6వ స్థానమున కేతువు 12వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతం రాహువు 5వ స్థానమున కేతువు 11వ స్థానమున ఉండును. ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలు లభిస్తాయి. కాని సం||ము పూర్వార్థము వివాహ నిశ్చయము జరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత పెరుగుతుంది.

    అత్యుత్సాహము పనికిరాదు. ఆరోగ్యము జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యసనాలకు, దురలవాట్లు, దుర్జన సహవాసం దరికి రానీయకండి. తోబుట్టువులతో కలహాలు మనఃస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక నిరాశ ఏర్పడవచ్చును. పాప కార్యాలపై ఆసక్తి పెరుగవచ్చును. తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుట, ప్రేమ విఫలము, భార్య లేదా భర్తకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. గర్భధారణ కల్గిన స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజద్రోహులు పరిచయమయ్యే అవకాశం గలదు. వారిపట్ల జాగ్రత్త అవసరం. స్నేహితులు ప్రస్తుతం అధికంగా వాడుచున్న ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల వాడకంలో జాగ్రత్త అవసరం. స్థాన చలనము, నష్టాన్ని కలిగించు వ్యాపారం వైపు అనగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందాలని, తక్కువ సమయంలో కోటీశ్వరులవాలనే ఆలోచనల పట్ల అప్రమత్తత అవసరము. దైనందిన జీవితము మరియు నిత్య విధులపై సోమరితనము, వాయిదా తత్త్వము పెరుగుట. ధూమపాన, మద్యపానాలకి దూరంగా ఉండండి నోటి సమస్యలు బాధించవచ్చును. మీ యొక్క ఆత్మస్థైర్యము చేత విచక్షణా జ్ఞానము చేత అధిగమిస్తారు. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించవచ్చు. కుల విద్యపై ఆసక్తి పెరుగుతుంది.  నూతన విద్యలపై ఆసక్తి, ప్రవేశము కలుగవచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. ప్రతిక్షణమును ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం సం||ర పూర్వార్థంలో సఫలం కావచ్చును. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాసయోగ్యత లభించగలదు. తాము కోరుకున్న ప్రదేశానికి స్థానచలనము కలుగవచ్చును. విద్యార్థులు నిత్యం శ్రీహయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి. చక్కని అమోఘమైన మేధాసంపత్తి సమయస్పూర్తి చురుకుదనము పెరుగుతుంది.

    తొందరపాటు ఏ మాత్రము పనికిరాదు. వ్యాపారంలో పోటీదారులపై తెలివిగా ప్రవర్తించవలసిన సమయము. తమవారు ఎవరో, పరాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార రహస్యాలను తెలివిగా, ఇతరులకు చేరకుండా ప్రవర్తించండి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా కష్టపడి కృషి చేయవలసిన సమయము, అనూహ్యముగా అనాలోచితముగా ధనవ్యయము కనపడుచున్నది. నూతన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు పనికిరాదు. ముహూర్త నిర్ణయము మరియు గోచారము కొంతవరకు అనుకూలముగా  ఉన్ననూ మితిమీరిన ఆత్మస్థైర్యము ఎదుటివారిని తక్కువగా అంచనా వేయడము, దురహంకారము మొదలైన విషయాలు దరికి రానీయకండి. ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు. ఆరోగ్య సమస్యలు ఎదురయినా ఉపశమనము నివారణ మార్గాలు లభిస్తాయి. తద్వారా కొంత మానసిక, శారీరక బాధ ఏర్పడినా వాటిని అధిగమిస్తారు. వ్యాధులకు సరియైన సమయంలో రోగ నిర్ధారణ జరిగి ఉపశమనము పొందుతారు. స్త్రీలు గర్భసంబంధమైన సమస్యలపై వైద్యుని సలహా పాటించాలి. ఒంటరితనమును అనుభవించడము, విపరీతమైన ఆలోచనలు రావడం జరుగవచ్చును. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, దుర్జన సహవాసాలకు దూరంగా ఉండండి. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు భంగము కలుగకుండా జాగ్రత్త పడవలయును. కనపడని శతృబాధ సూచన కలదు. వ్యాపారంలో ఒకింత జాగ్రత్తలు అవసరం. నూతనంగా పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులు అత్యుత్సాహంతో తమలోని రహస్యాలను తమ వృత్తిపరమైన నైపుణ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టడము వలన ఒకింత ఇబ్బందికర వాతావరణము ఏర్పడవచ్చును. శ్రమమీది ఫలితము మరొకరిది కావచ్చును. విష జంతువుల వల్ల ఒకింత భయము ఏర్పడవచ్చును. అర్థంకాని అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు చికాకు కలిగించే అవకాశం గలదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన గలదు. దాంపత్యములో అపోహలు, అనవసరమైన వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడవలయును. ఈ క్షణము ప్రశాంతత, మరుక్షణంలో ప్రళయము వంటి పరిస్థితులు ఎదురుకావచ్చును. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అకారణంగా అకస్మాత్తుగా కలహాలు సంభవించే అవకాశము గలదు. స్త్రీ, పురుష స్నేహాల విషయంలో ఇబ్బందికరమైన సంఘటనలు సంభవించే అవకాశము గలదు. స్థిరాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. మూత్ర సంబంధమైన లేదా కటినుండి జానువుల మధ్యన అనారోగ్య సూచనలు. కొందరికి వివాహ సంబంధాలు తప్ప పోవటమో లేదా వివాహవయస్సుకు పూర్వమే వివాహ ప్రయత్నాలు జరుగుట సంభవించవచ్చును. కొన్ని సందర్భములలో తనవారినే అనగా జీవిత భాగస్వామితోగాని, తమ సంతానముతోగాని తరచుగా అసత్యము పలుకుట, ముఖ కవళికలో మార్పు, మధ్యస్థమైన వివాదాలకు,మద్యవర్తిత్వాలకు జమావతులకు కాస్త దూరంగా ఉండండి. తనకోపమే తనశతృవని తెలుసుకొండి. మీ మనస్సు ఎంత నిర్మలమైనా ఎంత ప్రేమమయమైనా ఉన్నా దానిని మీరు సరియైన విధంగా బహిర్గతము చేయకపోవడం వల్ల మీరు అహంకారిగా ముద్రపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి.

    పూర్వార్థము అనుకూలంగా ఉన్నది అయిననూ మూర్తి నిర్ణయము ద్వారా విచారించిన తెలియనటువంటి ఆవేదన, ఆరాటము, నైరాశ్యము చోటు చేసుకునే అవకాశము గలదు. కాలయాపన, జాఢ్యము మీకు ప్రధాన శతృవులుగా మారకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలియకుండానే ఊహలలో విహరించడము వలన సమయము వృధా అయ్యే అవకాశము గలదు. విదేశీ ప్రయత్నాలు సంవత్సరము చివర భాగంలో అనుకూలించవచ్చును. విద్యలో ముందడుగు వేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. శుభ కార్యాచరణచేత ధనవ్యయము, అంచనాలకు మించి ధనము ఖర్చు అయ్యే సూచన గలదు. చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. అపరిష్కృతముగా ఉన్న  సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కాని ప్రయాసచేత పనులు పూర్తి చేసే అవకాశము గలదు. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. వత్సరారంభములో ముఖ్యంగా బృహస్పతి పంచమస్థాన స్థితిచేత, గతములో జరిగిన అన్ని సంఘటనలలో నిజానిజాలు తెలుసుకుంటారు. స్థిరాస్థులు వృద్ధి చేసుకుంటారు. సంతానప్రాప్తి కలదు. అవివాహితులకు వివాహ ప్రాప్తి కలదు. సమాజంలో స్థాయి మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ పరంగా రావలసిన బకాయిలు కాని ఇతరమైన ప్రయోజనాలు కాని పొందుతారు. జీవిత భాగాస్వమియొక్క ఆరోగ్యము కొంత కలత చెందించవచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లుగాని, తమ ఆధీనములో పనిచేయువారి సహకారాలు కాని లభించవచ్చును. ఇష్ట కన్యా ప్రాప్తి, నూతన వస్త్ర భూషణాదులు లభించుట, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. ఉన్నత విద్యా ప్రాప్తి. విదేశీయాన ప్రయత్నాలు సఫలము కావచ్చును. చక్కని విశ్వ విద్యాలయంలో ప్రవేశము లభించవచ్చును. పుత్ర సంతానప్రాప్తి, గతంలో తాము పెట్టిన పెట్టుబడులకు చక్కని లాభాలు రావచ్చును. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారియొక్క పరిచయము, సాంగత్యము లభించవచ్చును. తీర్థయాత్ర సందర్శనము ఆదాయము యొక్క వనరులు పెరుగుట. నీతి, నిజాయితీగల వారియొక్క సహచర్యము లభించవచ్చును. తాము శ్రమించిన కార్యానికి తగిన ప్రశంసలు అందుకుంటారు. పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది. తాము చేస్తున్న వృత్తిపట్ల పరిపూర్ణమైన సంతృప్తి కల్గియుంటారు. శతృవులపై విజయాన్ని సాధిస్తారు.

    మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము కలుగుతున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు మహా సుదర్శన హోమం, రామరక్షా స్తోత్రం, గోసేవ, పేద కన్యకి వివాహ విషయంలో సహాయం చేసిన మేలు జరుగును.    విదేశీ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించవచ్చును. విదేశాలలో ఉన్న మీ స్నేహితులు శ్రేయోభిలాషుల వల్ల ధనసహాయము లభించవచ్చును. అతి ప్రయాసపైన స్థిరాస్థిని వృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తారు. ఈ సం||ము మీలో  ప్రధాన లోపము ప్రతి పనిని వాయిదా వేయటము, భక్తి మార్గ పయనము. బంగారు ఆభరణములలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు రావడము. షేర్‌ మార్కెట్‌ రంగములో ప్రయాణించుట, మీలో కార్యసామర్థ్యము ఉన్న దానిని గుర్తించి ఉపయోగించుకోలేకపోవుట ఒక సమస్యగా మారుతుంది. అనాలోచితంగా కొంత ధనాన్ని సద్వినియోగించలేకపోవడం, ప్రభుత్వ పరంగా అందవలసిన ప్రయోజనాలు వాయిదాల రూపంలో అందుట, నిర్ణయం తీసుకోవడంలో ఒకరి సహాయం అవసరము, వృత్తి ఉద్యోగములో ఉన్నతి. సంవత్సర పూర్వార్ధంలో లభించును. విదేశీ అవకాశాలు లభించును. సంతానప్రాప్తి, వివాహ ప్రాప్తి,.ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గురు,శని, రాహు, కేతు, జప దానాదులు చేసిన మంచిది. శ్రీ సుదర్శనస్తోత్రము, శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రము, గణపతి స్తోత్రం దుర్వార్చన మొదలగునవి తమ తమ వంశాచార అనుసారముగా చేసిన మేలు జరుగును.


More Rasi Phalalu 2017 - 2018