పూర్వకాలంలో ప్లాస్టిక్ సర్జరీ

Plastic Surgery in Olden Days

 

ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇప్పుడు మనందరికీ తెలుసు. శరీరంలోని ఏదయినా అవయవం ప్రమాదవశాత్తూ దెబ్బ తింటే దాన్ని చికిత్స ద్వారా యధాస్థితికి తీసుకొచ్చే విధానం. జరిగిన నష్టాన్ని పూడ్చే ఈ రకమైన సర్జరీకి తోడు, సౌందర్య సాధనంగానూ ప్లాస్టిక్ సర్జరీ తోడ్పడుతోంది. మశూచికం, విపరీతమైన మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గుర్తులు లేకుండా చేయడంలో ప్లాస్టిక్ సర్జరీ పాత్ర గొప్పది. అందాన్ని ఇనుమడింప చేసుకునేందుకు ముక్కు, పెదాలు, స్తనాలు లాంటి శరీర భాగాలను పెంచడం, తగ్గించడం కూడా అమల్లో ఉంది. ప్లాస్టిక్ సర్జరీలో ఇది మరో మెట్టు. ముక్కు మోహము చితికిపోయిన లేదా కాలిపోయిన వారికి సైతం శస్త్ర చికిత్స చేసి తిరిగి ఆకృతిని తేవడం ఎన్నోసార్లు చూస్తున్నాం. అలాగే ముక్కు, పెదాలు దళసరిగా ఉంటే ఆపరేషన్ ద్వారా సన్నగా మార్పించుకోవడం కూడా పరిపాటి అయింది. ఈ రకమైన శస్త్ర చికిత్సలు ఈమధ్య కాలంలో ఎంతో వ్యాప్తి చెందిన మాట నిజం. కొంత ఖరీదైనదే అయినప్పటికీ మధ్య తరగతి వారు కూడా ఎందరో చేయించుకోవడం మనకు తెలుసు.

ఇంతకీ ఈ ప్లాస్టిక్ సర్జరీ ఈమధ్య కాలంలోనే అభివృద్ధి చెందింది అనుకుంటే పొరపాటు. మనదేశంలో ఎప్పుడో క్రీస్తుకుపూర్వం ఏడవ శతాబ్దంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు అనేక గ్రంధాల్లో లిఖితమై ఉంది. ఆ వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం.

భారత వైద్య విధానాన్ని అక్షరబద్ధం చేసిన మహోద్గ్రంధం శుశ్రుత సంహిత. ఈ శుశ్రుత సంహిత క్రీస్తుకుపూర్వం ఏడవ శతాబ్దం నాటిది. ఈ గ్రంధంలో ముక్కు, చెవులు మొదలైన భాగాలు కోసుకుని లేదా దెబ్బ తగిలి ఆకృతి దెబ్బ తిన్నప్పుడు వాటిని చికిత్సటో సరిచేసి పునర్నిర్మించే విధానం ఉన్నట్లు లిఖితమై ఉంది. ఈ అంశాన్ని ప్రముఖ ఆధునిక శస్త్ర వైద్యులు హిపోక్రాట్, జాన్ మార్క్ ట్విన్ కన్వర్స్ లు కూడా ప్రస్తావించారు, ప్రశంసించారు.

మన దేశంలో పూర్వం తీవ్ర నేరాలకు పాల్పడిన నేరస్తులకు ముక్కు లేదా చెవిని కోసి శిక్షించేవారట. (లక్ష్మణుడు, శూర్పణఖ ముక్కు చెవులు కోసిన వైనం గురించి చదివాం కదా!) శిక్ష అనుభవించి ముక్కు, చెవులు కోల్పోయిన నేరస్తులకు ''కూము'' అనే తెగవారు శస్త్ర చికిత్స చేసి ఆయా భాగాలను యధాస్థితికి తెచ్చినట్లు చెప్పే కధనాలు ఉన్నాయి. ఈ అంశాన్ని న్యూయార్క్ కు చెందిన యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు డాక్టర్ జాన్ మార్క్ ట్విన్ కన్వర్స్ తన ''Reconstructive Plastic Surgery'' అనే పుస్తకంలో రాశారు. గాయపడిన శరీర భాగాలను శస్త్ర చికిత్సతో సరిచేసిన అనంతరం సెప్టిక్ కాకుండా వనమూలికలు, పసర్లు వేసి కట్టు కట్టేవారట.

మొదట మన దేశంలో ప్రారంభమైన శస్త్ర చికిత్సా పునర్నిర్మాణ వైద్య విధానం ఇరాన్, ఇరాక్ తదితర అరబ్ దేశాలకు పాకి, అక్కణ్ణించి మరిన్ని దేశాలకు విస్తరించింది. అటు తర్వాత ఈశాయి జాతులు, యహుదీ విద్వాంసుల ద్వారా రొమ్ నగరానికి వ్యాపించింది. ఆ పిమ్మట మరెన్నో దేశాలకు ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలిసివచ్చింది.

1816వ సంవత్సరంలో కార్ప్యూ అనే శస్త్ర చికిత్సా నిపుణుడు నాశిక దెబ్బతిన్న ఇద్దరు వ్యక్తులకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి వాటిని పునర్నిర్మించాడు. అలా చేసి ఊరుకోకుండా తాను చేసిన చికిత్సా విధానాన్ని సవివరంగా రాసి, అచ్చు వేశాడు. అప్పటిదాకా ఒకరి ద్వారా ఒకరు విని చికిత్స చేసేవారు. కానీ ఆ పుస్తకం విడుదలైన తర్వాత ఎందరెందరికో అవగాహన కలిగినట్లయింది. ప్లాస్టిక్ సర్జరీకి విస్తృత ప్రచారం లభించింది. కనుకనే 1816 తర్వాత ఫ్రాన్స్ మొదలైన అనేక దేశాల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దెబ్బతిన్న అవయవాలను బాగుచేసి యధాస్థితికి తేవడం జరిగింది.

సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే మనదేశంలో సర్వ రోగాలనూ నివారించే ఆయుర్వేదం, శస్త్ర చికిత్సా విధానం, దెబ్బతిన్న శరీర భాగాలను సరిచేసి యధాస్థితికి తెచ్చే ప్లాస్టిక్ సర్జరీ విధానం ఉండటం గర్వ కారణం కాదూ?!

 

plastic surgery india, sushruta samhita sasthra chikitsa, plastic surgery nose and ears, plastic surgery for glamour


More Enduku-Emiti