కాళ్ళకి పారాణి ఎందుకంటే
పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేది పారాణి. పసుపు సున్నం నీరు కలిపితే వస్తుంది చక్కని ఎర్రని పారాణి. బాగా పల్చగా ఉంటే దీనిని వసంతం అంటారు. పూర్వం వసంతం అడటానికి పిచికారి గొట్టంలో ఈ ఎర్రని ద్రవాన్నే పోసే వారు. ఈ రంగులు సహజమైనవి కనుక ప్రమాదకారులు కావు. ప్రమోదకారులు మాత్రమే. ఆహ్లాద కరంగా ఉండటమే కాదు త్వరగా పోతాయి కూడాను. దిష్టి తియ్యటానికి, ముఖ్యంగా శుభ సందర్భాలలో పారాణి నీటిని [ఎర్ర నీళ్ళు అంటారు] ఉపయోగిస్తారు. ఆడవారు కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం పారాణి ముద్దని మింగటం కాని, పారాణి నీటిని తాగటం కాని చేస్తారు. ఇది ఆరోగ్యం చెడకుండా ,ప్రమాదాలు రాకుండా ఉండే సురక్షిత మార్గం.
పసుపులో సున్నం కలపటం వల్ల ఇది పసుపు కన్నా తీవ్రమైన క్రిమి సంహారకం. ఘాటుగా ఉంటుంది. అందుకనే గోరు చుట్టు వస్తే పారాణి ముద్దని గోరింటాకు లాగా పెట్టి కట్టు కడతారు. పిప్పి గోళ్ళకి, పుచ్చు గోళ్ళకి ఇది దివ్యమైన ఔషధం. ఈ ఆరోగ్య రహస్యాలు తెలిసినా, తెలియక పోయినా , అన్నీ శుభకార్యాలలో కాళ్ళకి పారాణి పెట్టే సంప్రదాయం ఈ నాటికీ కొనసాగుతోంది. ఇది ఆడవారికి సంబంధించింది అనుకుంటాం. కాని ఇది అందరికి వర్తించే సంప్రదాయం. కనుకనే పెళ్లిళ్లు, వడుగులు మొదలైన సందర్భాలలో పెళ్లి కొడుకుకి పసుపు రాసి, పారాణి పెడతారు. పసుపు పారాణి మంగళ ద్రవ్యాలు. ఐదోతనానికి చిహ్నాలు.
ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు పూజ చేసే వారూ, వారి చేత ముత్తైదువలుగా పూజింప బడే వారూ పాదాలకి పసుపు పారాణి విధిగా అలంకరించుకోవలసి ఉంటుంది. నూతన వధువు అని చెప్పటానికి కాళ్ల పారాణి తడి ఆరలేదు అని ఆలంకారికంగా చెప్పటం వివాహానికి పారాణికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించటానికే. పచ్చని పసుపు మీద ఎర్రని పారాణి గీతలు పాదానికి ఎంతటి అందాన్ని కలిగిస్తాయో కదా! అందంతో పాటు ఆరోగ్యం. అప్పుడప్పుడు పారాణి పెట్టుకోటం కాలి గోళ్ళ ఆరోగ్యానికి మంచిది.
...Dr Anantha Lakshmi