చేతులతో తినడం అనాగరికమా?

 

 

భారతీయులు ఆహారం తినే విధానం చూసి పాశ్చాత్యులకి ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఫోర్కులూ, స్పూన్లూ లేకుండా వీళ్లు ఒట్టి చేతులతో ఎలా తింటారబ్బా అనుకుంటారు. అలా చేతులతో ఆహారం తీసుకోవడాన్ని అనాగరికంగా పరిగణించేవాళ్లు కూడా లేకపోలేదు. ఆహారాన్ని వేళ్లతో తినడం అనాగరికత కాదు సరికదా ఆరోగ్యమేనని చెప్పేందుకు ఒకటి కాదు వంద కారణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని…

 

- భారతీయుల ఆహారం చప్పిడిగా ఉండదు. ఉప్పు, పులుపు, కారాలతోపాటు మసాలాలు దండిగా ఉంటాయి. వీటికి లోహం తగలగానే రుచిలో తప్పకుండా మార్పు వచ్చేస్తుంది. అంతేకాదు! ఆహారపదార్థాలలో ఉన్న నూనె, ఉప్పు లోహంతో చేసిన స్పూన్లతో కలిసినప్పుడు ప్రతిచర్య ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేనా! నోట్లోకి రుచికరమైన ఆహారంతో పాటు స్పూను కూడా ప్రవేశించినప్పుడు కమ్మటి రుచి కాస్తా కటువుగా మారిపోతుంది.

 

 

- ఆయుర్వేదం ప్రకారం మన శరీరం పంచభూతాల సమూహం. మన చేతికి ఉండే అయిదు వేళ్లలో ప్రతి ఒక్క వేలిలో ఒకో తత్వం ప్రస్ఫుటంగా ఉంటుంది. బొటనవేలిలో అగ్నితత్వం, చూపుడు వేలులో వాయుతత్వం, మధ్యవేలిలో ఆకాశం, ఉంగరం వేలిన పృథ్వి, చిటికెన వేలిన జలతత్వం ఉంటాయట. ఈ అయిదు వేళ్ల స్పర్శా తగిలినప్పుడు ఆహారంలోని జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

 

- స్పూన్లు, ఫోర్కులని ఎంతగా కడిగినా అవి శుభ్రంగా ఉన్నాయని చెప్పలేము. వేడివేడి నీళ్లలో నిరంతరం ఉంచితే తప్ప అవి క్రిముల నుంచి దూరంగా ఉన్నాయన్న నమ్మకం కలగదు. కానీ శుభ్రంగా కడుక్కున్న చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. వాటితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సూక్ష్మక్రిములూ మన జీర్ణాశయంలోకి చేరకుండా చూడగలం.

 

- వేళ్లతో తినడంలో కనిపించని వ్యాయామం ఇమిడి ఉంటుంది. అన్నాన్ని దగ్గరకి తీసుకోవడం, వేర్వేరు పదార్థాలను కలుపుకోవడం, ముద్దలుగా చేసుకోవడం మొదలుకొని ముద్దని నోట్లోకి చేర్చడం వరకూ ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. దీని వల్ల అరచేతిలోనూ, వేళ్లలోనూ రక్తప్రసరణ మెరుగవుతుంది.

 

- చేతి వేళ్లకి ఉండే స్పర్శజ్ఞానం వల్ల ఆహారం ఎంత ఉష్ణోగ్రతలో ఉందో తెలియడమే కాదు… దానికి మరింత రుచిని, తినడంలోని తృప్తిని అందిస్తుంది. ఆహారాన్ని తీసుకున్న చేతివేళ్లు పెదాలకి తగలగానే, ఆ స్పర్శకి నోట్లో లాలాజలం త్వరగా ఊరుతుందట.

 

 

- భారతీయుల ఆహారం అంటే బ్రెడ్డూ, సాండ్‌విచ్‌లు మాత్రమే కాదు. రోజుకో వంటకం చేసుకున్నా జీవితాంతం తరిగిపోని పాకశాస్త్రం మన సొంతం. వీటిలో ఎక్కువ శాతం వంటకాలు వేళ్లతో తినడానికి మాత్రమే సౌకర్యంగా ఉంటాయి. అందుకే ఎన్ని పరికరాలను వాడినా, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా… చేతి వేలుని మించిన ప్రత్యామ్నాయం దొరకదు. పరికరాలతో తినే ఆహారం యాంత్రికంగానే ఉంటుంది!

 

- భారతీయులు వంటలను యాంత్రికంగా చేసుకోరు. ఏదో ఆకలి తీరడానికన్నట్లుగా కాకుండా తమ వంటకాలు రుచిగా, వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటారు. అవి పంచేంద్రియాలనూ తృప్తి పరచాలనుకుంటారు. అందుకే మన వంటకాలు కమ్మటి వాసనతో, కంటికి ఇంపుగా ఉంటాయి. వాటికి స్పర్శ కూడా తోడైతేనే పరిపూర్ణత! చేతులతో తినడం ద్వారా ఆ పరిపూర్ణతని సాధిస్తాం.

- నిర్జర


 


More Enduku-Emiti