నరకచతుర్దశి నిజమైన అంతరార్థం ఏమిటి?
అయిదు రోజుల దీపావళి పండుగలో మొదటిది ధన త్రయోదశి కాగా రెండవది చతుర్దశి. దీన్నే నరకచతుర్దశి అని అంటారు. నరకుడు అనే రాక్షసుడిని సత్యభామ నరకచతుర్దశి రోజే వధించిందని, ఆ సంబరాన్నే దీపాలు వెలిగించి పండుగగా జరుపుకుంటారని. చీకటిని పారద్రోలే ఈ వేడుక వెనుక గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం ఉందని చెబుతారు.
అయితే నరక చతుర్దశిలో మరొక భావం కూడా చెబుతారు. మరణించినవారికి నరకబాధ ఉండకూడదనే భావమూ ఇందులో ఉంది. ఈ విశ్వాసం వెనుక కారణం గురించి మన పెద్దలు ఒక విషయం చెబుతారు. అదేమిటంటే మన పూర్వీకుల పట్ల ఆత్మీయత, భక్తిభావాలు ఉందులో వ్యక్తమవుతాయి. మరణించిన మన పెద్దలు లేదా చిన్నవారు ఎవరైనా సరే….. వారు మన నుండి దూరమయ్యాక కూడా నరక బాధ లేకుండా బాగుండాలని కోరుకోవడం పరిపాటి. అది వారి పట్ల మనకున్న ప్రేమ, భక్తి, ఆత్మీయత మొదలైన వాటికి ప్రతీక.
ఇకపోతే నరక చతుర్దశికి "నరకభయాన్ని పోగొట్టే చతుర్దశి" అనే అర్థం కూడా ఉందని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దుఃఖమయమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టమవుతోంది.
పెద్దలు చెప్పే దాని ప్రకారం చెడుకు ఫలితంగా లభించే దుఃఖస్థితి 'నరకం'. వాస్తవంగా ఆలోచిస్తే కూడా మనిషి చేసే తప్పుల వల్ల ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సరైన రీతిలో అధిగమించేవారు కొందరైతే, వాటిని కప్పిపుచ్చుకుంటూ ఒకదాని వెనుక మరొక సమస్యను సృష్టించుకుని సమస్యలను పెద్దవి చేసుకునేవారు మరికొందరు.
“నరులను (జీవులను) ఆక్రందింప (దుఃఖింప) జేసే స్థితిని నరకం అంటార"ని నిర్వచనం. వారు చేసిన దుష్కర్మలకు ఫలంగా వేదన కలుగుతుంది. ఈ శిక్షా వ్యవస్థ ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉంది. అలా కలిగే చెడు పరిస్థితిని, దానిలో కలిగే ప్రభావాన్ని, దాని వల్ల కలిగే బాధను తొలగింపజేయవలసిందిగా కాలస్వరూపమైన భగవంతుడి శక్తిని ఆరాధించడమే నరకచతుర్దశి, దీపావళి అమావాస్యల ఆచారం.
ఇంకా వివరంగా చెప్పాలంటే మనిషి తాను చేసిన తప్పులను మన్నించి, దాని వల్ల తనకు కలిగే బాధలను తొలగించమని మనసా, వాచా కర్మణా ఆ భగవంతుడిని, ఆ భగవంతుడి స్వరూపమైన కాలాన్ని కూడా వేడుకోవడం, ఇక మీదట ఎలాంటి తప్పులు చేయను అని ఆ భగవంతుడి ముందు నిర్ణయం తీసుకోవడం. తనలో తాను ఒక గట్టి సంకల్పాన్ని తీసుకోవడం నరకచతుర్దశి, దీపావళి అమావాస్య పండుగలలో ఉన్న అంతరార్థం.
చీకటి మీద వెలుగు విజయం సాధించడం అనే మాటను వినే ఉంటారు. అయితే వెలుగును కూడా చీకటి ఉంటేనే విలువ అన్నట్టు మనిషిలో కూడా కష్టాలు వస్తుంటేనే వాటిని దాటుకుని సుఖాలను చేరుకుని వాటి పట్ల సంతోషపడతారు. ఇదే నరకచతుర్దశి వెనుక దాగున్న అంతరార్థం.x
◆నిశ్శబ్ద