శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి హిరణ్యాక్షుని సంహరించి భూదేవికి ఆనందం కలిగించాడు. వరాహమూర్తి వీర, విక్రమాలకు మురిసి భూదేవి శ్రీహరిని మోహించి తన కోర్కెను తీర్చమని అర్థించింది. శ్రీహరి భూదేవి కోర్కెను తీర్చాడు. అప్పుడు వారికి కలిగినవాడే ‘నరకాసురుడు’. ‘నేను హిరణ్యాక్ష సంహార సమయంలో తామసగుణంతో ఉన్న సమయంలో నీవు నన్ను కలిసిన కారణంగా.. నీకు రాక్షస ప్రవృత్తి గల కుమారుడు జన్మిస్తాడు’ అన్నాడు శ్రీహరి. భూదేవి తన కుమారుడైన నరకాసురుని సదా రక్షించమని శ్రీహరిని కోరింది. ‘ధర్మం’ తప్పనంతవరకూ నావల్ల నీ కుమారుకు ఎటువంటి హానీ జరుగదు. ‘ధర్మం తప్పి చరిస్తే మాత్రం నీ కుమారుడు నా చేతిలోనే మరణిస్తాడు’ అన్నాడు శ్రీహరి. ఆ తర్వాత భూదేవి కోరిక మేరకు నరకాసురునకు వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రగర్వంతో నరకుడు దేవలోకాలన్నీ ఆక్రమించాడు. దేవమాత అదితి కర్ణకుండలాలు, వరుణఛత్రాన్ని అపహరించాడు. తర్వాత ప్రాగ్జ్యోతిషనగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అయితే అధర్మవర్తనుడై, లోకకంటకుడై,రాజ్యపాలన చేస్తున్నాడు. పదహారువేలమంది క్షత్రియకన్నెలను అపహరించి, బంధించి, వారిని కాళికాదేవికి బలిచ్చి త్రిలోకాధిపతి కావాలని కలలు కంటున్నాడు.నరకాసురుని దారుణాలు సహించలేని దేవతలు కాపాడమని శ్రీహరికి మొర పెట్టుకున్నారు. అప్పటికే శ్రీహరి కృష్ణావతారం దాల్చి ఉన్నాడు. నరకాసుర సంహారానికి శ్రీకృష్ణుడు వెడుతూంటే., నేనుకూడా యద్దరంగానికి వస్తాను అని సత్యభామ పట్టుపట్టింది.

‘సుందరీ! యుద్ధరంగమంటే ఏమనుకున్నావు..అక్కడ తుమ్మెదల ఝుంకారాలుండవు. అరివీర మత్తేభ ఘీంకారాలుంటాయి. దానవుల భీషణ గర్జనలుంటాయి. వికసితకుసుమ పరాగరేణువులు కాదు మీద పడేవి..గుర్రాల కాలి గిట్టలచే వెదజల్లబడే ఇసుక రేణువులు పడతాయి.శత్రుధనుర్విముక్త శర పరంపరలు మీద పడతాయి.యుద్ధరంగానికి రావద్దు.. నామాట విను.’ అని బుజ్జగించాడు శ్రీకృష్ణుడు. వినలేదు సత్యభామ.‘దానవులైతేనేమి.. రాక్షస సమూహాలైతే నాకేమి భయం? నీ కౌగిలి చాటన ఉండే నాకు ఏ భయం లేదు.. రాదు. మీతో యుద్ధరంగానికి వస్తాను..అంతే’ అని సత్యభమ మొండికేసింది. ఇక తప్పలేదు శ్రీకృష్ణునకు. ఇద్దరూ కలిసి గరుత్మంతుని మీద యుద్ధరంగానికి బయలుదేరారు.

ముందుగా శ్రీకృష్ణుడు నరకుని రాజథాని అయిన ప్రాగ్జ్యోతిష నగరద్వారం చేరి ఒక్కసారి తన పాంచజన్యాన్ని పూరించాడు. ప్రళయకాల మేఘగర్జన లాంటి ఆ శంఖధ్వని విన్న నగర రక్షకుడైన మురాసురుడు నిద్ర చాలించి, లేచి, నీటిలోనుంచి బయటకు వచ్చి.. బద్దకంగా ఒళ్లు విరుచుకుని.. శ్రీకృష్ణుని చూసి కోపంతో తన చేతిలోని గదను విసిరాడు.శ్రీకృష్ణుడు ఆ గదను తుత్తునియలు చేసి తన చక్రాయుధంతో ఆ మురాసురుని
తలను ఖండించాడు. అది తెలిసి మురాసురుని ఏడుగురు కుమారులు ఒక్కసారిగా శ్రీకృష్ణుని మీదకు దండెత్తారు. క్షణమాత్ర కాలంలో శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించాడు.

తన ఆత్మీయుల మరణవార్త విన్న నరకుడు రోష తామ్రాక్షుడై తానే స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు. గరుత్మంతునిమీద మేఘం చాటున విద్యుల్లతలా మెరిసిపోతున్న పత్యభామను చూసి ఆశ్చర్యపోయాడు.నరకుని చూస్తూనే సత్యభామ చీరకొంగు నడుము చుట్టూ చుట్టి.. ధనుస్సు చేతబట్టి ధనుష్టంకారం చేసింది. ఆ వింటి
నారిధ్వని విన్న రాక్షసవీరులు మూర్ఛబోయారు. ఒక ఆడుది..అబల.. ఒంటరిగా తనను యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతూంటే సహించలేని నరకుడు యుద్ధానికి దిగాడు. ఇద్దరిమధ్య భీషణ సంగ్రామం మొదలైంది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారి యుద్ధాన్ని తిలకిస్తున్నాడు. సత్యభామ సంగ్రామకళానైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నరకుడు. ‘ఏమది.. బంగారు ఊయలలు ఎక్కడానికి భయపడే ఈ భీరువు నిర్భయంగా గరుడుని వీపునెలా ఎక్కగలిగింది.? చిలుకలకు పలుకులు నేర్పుతూ అలిసిపోయే ఈ లలామ ఇన్ని అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చింది.?’ అని మనసులోనే అబ్బురపడి శ్రీకృష్ణుని చూస్తూ ‘ఒక ఆడుది మగరాయుడిలా పగవాడితో పోరుసల్పుతూంటే వినోదం చూస్తూ
కూర్చోవడానికి నీకు సిగ్గుగా లేదా?’ అని రెచ్చగొట్టాడు. వేంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ చక్రం అగ్నిశిఖలు విరజిమ్ముతూ వేగంగా వచ్చి నరకుని శిరస్సు ఖండించింది. నరకుని శిరస్సు నేలమీద పడింది. భూదేవి కన్నీళ్లతో అక్కడ ప్రత్యక్షమై నరకుడు అపహరించిన అదితి కర్ణకుండలాలు, వరుణఛత్రం శ్రీకృష్ణునకు సమర్పించింది. ‘భూదేవీ..నీ కుమారుని మరణానికి చింతించకు. ధర్మరక్షణ విషయంలో నేను స్వ పర భేదం పాటించను’ అన్నాడు. అనంతరం ఇంద్రాదిదేవతలు సంతోషంతో శ్రీకృష్ణుని ప్రస్తుతించారు.

నరకాసురుడు మరణించిన రోజే ‘ఆశ్వయుజ బహుళ చతుర్దశి’.
పురాణపురుషుల జన్మదినం సకల లోకాలకూ ఓ పండుగ దినం.
లోకకంటకుల మరణం కూడా సకల లోకాలకూ ఓ పండుగ దినమే.
అందుకే ‘ఆశ్వయుజ బహుళ చతుర్దశి’ని మనవారు ‘నరక చతుర్దశి’గా గుర్తించారు. ఓ
పండుగలా  జరుపుకున్నారు.
      
                                               

- యం.వి.యస్. సుబ్రహ్మణ్యం          
  

 


More Deepavali