మోచేటి పద్మం మౌన వ్రతం
(Mocheti Padmam Mouna Vratam)
దీపావళి అమావాస్య మొదలు కార్తీక పౌర్ణమి దాకా చేసే నోము యిది. కొందరు కార్తీక మాసం ముప్ఫై రోజులూ కూడా ఆచరిస్తారు. ఈ నోము మూడు సంవత్సరాలు నోచి - ఆ సంవత్సరమే ఉద్యాపన చేసుకోవాలి.
మొదటి సంవత్సరం సాయంత్రం కంఠస్నానం చేసి, తులసి కోట వద్ద మౌనంగా నాలుగు ముగ్గులుంచి, నాలుగు వత్తులతో దీపాలుంచి, నాలుగు ప్రదక్షిణలు చేసి, నలుగురు ముత్తయిదులకు బొట్లు పెట్టి, ఆకాశం వంక చూసి నాలుగు నక్షత్రాలను మనసులో లెక్క పెట్టుకుని ఒక్కొక్కరికీ నాలుగేసి అట్లు, ఒక నల్ల పూసల కోవ, లక్క జోళ్ళు, దక్షిణ తాంబూలాల చొప్పున వాయనమియ్యాలి.
పిదప నోచినవారికి రెండు చేతులమీదా రెండు అట్లు, కొంత డబ్బు ఉంచాలి. అలాగే రెండు కాళ్ళ మీదా రెండు అట్లు, కొంత డబ్బు వుంచి అన్నగారు తలుపు వెనక నుండగా - ఆమె "తిని కుడిచే కాలానికి రాకె పెడసరగండా " అంటుంది.
సోదరుడు "ఇప్పుడురానా - ముప్పునరానా" అంటాడు.
అప్పుడు సోదరి “ఇప్పుడే రా" అంటుంది.
వెంటనే సోదరుడు వచ్చి పుస్తకంతో సోదరిని నాలుగు దెబ్బలు కొట్టి, ఆమె చేతుల మీద, కాళ్ళ మీద వున్నా అట్లనూ, డబ్బునూ తీసుకుంటాడు.
తర్వాత సోదరి తులసిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి.
అలాగే, రెండవ సంవత్సరం 8 పద్మాలు వేసి, 8 వత్తుల దీపాలు పెట్టి, 8 ప్రదక్షిణలు చేసి, 8 మంది పేరంటాళ్లకు బొట్లు పెట్టి, 8 నక్షత్రాలను స్మరించుకుని, 8 అట్లూ వగయిరాల వాయనమివ్వాలి.
చేతికి రెండేసి అట్లు చొప్పున రెండు చేతుల మీదా 4 అట్లూ డబ్బు, అలాగే కాళ్ళ మీద వుంచుకుని అన్నగారిని పిలవాలి.
మూడవ ఏట 12 పద్మాలు, 12 వత్తుల దీపాలు పెట్టి, 12 ప్రదక్షిణలు చేసి 12 మంది ముత్తయిదులకు బొట్లుంచి, 12 నక్షత్రాలు లెక్క పెట్టుకుని, 12 అట్లు చొప్పున వాయనాలిచ్చి, చేతుల మీద 8 అట్లు, డబ్బు, కాళ్ళమీద 8 అట్లూ, డబ్బు పెట్టుకుని అన్నగారిని పిలవాలి. అదే - ఉద్యాపన.