వరాల వరలక్ష్మికి శతకోటి వందనాలు
శ్రావణమాసానికే వన్నెతెచ్చే వ్రతం ‘ శ్రీ వరలక్ష్మి వ్రతం’. శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం మనందరి ఆచారం. వరాలలక్ష్మి ‘వరలక్ష్మి’ శ్రీమహావిష్ణువు భార్య అయిన శ్రీమహాలక్ష్మి అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఆనందామృతాశీస్సులు వర్షిస్తుంది.
- క్షీరసాగర కన్యగా ఉద్భవించి, శ్రీమహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ‘ఆదిలక్ష్మి’.
ఈమె సకల సంపదలకు అధినాయకి.
- సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ఈ ‘ధాన్యలక్ష్మి’. ఈమె సస్యసంపదకు
అధినాయకి.
- జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ‘ధైర్యలక్ష్మి’.
ఈమె ధైర్యానికి ప్రతీక.
- రాజలాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ వుంటే
అక్కడ సర్వసంపదలు వుంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి ‘గజలక్ష్మి. ఈమె
సకల ఐశ్వర్యాలకు ప్రతీక.
- ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్ని నిలిపే
సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘సంతానలక్ష్మి’.
- జీవనగమనంలో ఎదురయ్యే సమస్యలతో చేసే పోరాటంలో విజయమే ప్రధాన గమ్యం.
అట్టి అంతిమ విజయాన్ని అమిత ప్రమతో అందించే లక్ష్మి ‘విజయలక్ష్మి’.
- ఎన్ని సంపదలున్నా, విద్య లేనివాడు వింతపశువే. అఙ్ఞానాంధకారాన్ని తొలగించి,
ఙ్ఞానమార్గాన్ని చూపించే విద్యను ప్రసాదించే లక్ష్మి ‘విద్యాలక్ష్మి’.
- ‘ధనం మూలమిదం సర్వం’ అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా.
అట్టి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘ధనలక్ష్మి’.
మానవుని కోరికలన్నీ ఈ అష్టవిధ రూపాల్లోనే వుంటాయి. ఈ శ్రావణమాసంలో పౌర్ణమికి
ముందువచ్చే శుక్రవారంనాడు శ్రీమహాలక్ష్మి ఏకరూపంలో వరలక్ష్మిగా విలసిల్లుతూ, భక్తుల పూజలందుకుంటూ వారి కోరికలు తీరుస్తూంటుంది. అందుకే ‘వరలక్ష్మీవ్రతానికి’ అంత ప్రాధాన్యత.
మన భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా
జరుపుకుంటారు. వరలక్ష్మీదేవిని సేవించే విధానాలు పలురకాలుగావున్నా, చేసే
పూజ ఒక్కటే, పూజలందుకునే దేవత ఒక్కరే.
వ్రత విధానం
ఈ శుభదినాన ఆడవారు వేకువనే లేచి, ఇంటిని శుభ్రపరచి, మామిడాకుల తోరణాలుకట్టి
స్నానాదులు పూర్తిచేసి, వరలక్ష్మీదేవి పూజకు సంసిద్ధులవుతారు. వరలక్ష్మీదేవి పూజను
చేసే ఈశాన్య ప్రదేశంలో వరిపిండితో నేలపై అష్టదళపద్మాన్ని వేసి, దానిపై ఒక నూతన
వస్త్రాన్ని పరచి, దానిపై బియ్యంపోసి, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించిన ఒక
కలశాన్ని అక్కడ స్ధాపిస్తారు. ఆ తర్వాత ఆ కలశంలో గంధ,పుష్పాక్షతలు వేసి, మామిడాకులు
వుంచి, వాటిపైన కొబ్బరికాయనుంచి, దానిపైన ఒక రవికెలగుడ్డను ఉంచి, వరలక్ష్మీదేవిని
ఆవాహనచేసి పూజిస్తారు. మరికొందరు కొబ్బరికాయకు పసుపురాసి, ముక్కు, చెవులు చేసి,
కాటుకతో కళ్ళు దిద్ది, కుంకుమబట్టు పెట్టి, బంగారునగలు అలంకరించి వరలక్ష్మీదేవిని
ఆవాహనచేసి పూజిస్తారు. ఇంకొందరు బంగారం లేదా వెండితో చేసిన లక్ష్మీదేవి ముఖాన్ని
అమర్చి, రంగురంగుల పూలతో, ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు.
ముందుగా పసుపు గణపతికి పూజచేసి, ఆ తర్వాత వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో
అర్చించాలి. ఆ తర్వాత దారంతో తొమ్మిది పోసలువేసిన సూత్రాన్ని తొమ్మిది గ్రంధులతో
కూడిన తోరంగా చేసి, ఆ తోరాన్ని దేవికి సమర్పించి, దాన్ని ఆ దేవి రక్షాబంధనంగా
కుడిచేతికి కట్టుకోవాలి. వరలక్షీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి, తొమ్మిది రకాల
పిండివంటలతో మహానైవేద్యాన్ని సమర్పించాలి. ముత్తయిదువులకు వాయిన,తాంబూలాదులు
సమర్పించి వారి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత మంగళహారతి గీతాలు పాడి తరించాలి.
పురాణ కథనం
ఒకసారి పార్వతీదేవి, శివునితో ‘స్వామీ! ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలోని స్త్రీలు అష్టైశ్వర్యాలతో,
పుత్రపౌత్రాదులతో ఆనందంగా వుంటారు’ అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ వరలక్ష్మీ
వ్రతాన్ని పార్వతికి చెప్పినట్లు స్కాందపురాణంలో చెప్పబడిరది. ఈ సందర్భంలో సదాశివుడు
భక్తురాలయిన చారుమతి కథను కూడా వివరించాడు. చారుమతి పతివ్రతాధర్మానుసారం
భర్తను, అత్తమామలనూ సర్వోపచారాలతో సేవించేది. ఆ మహాపతివ్రత యందు వరలక్షీదేవికి
అనుగ్రహం కలిగి, కలలో ఆమెకు కనబడి, శ్రావణ పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారంనాడు
తనను పూజిస్తే కోరిన వరాలు అనుగ్రహిస్తానని చెప్పి మాయమైంది. చారుమతి ఆ విధంగానే
ఆచరించి సకలైశ్వర్యాలు పొందినట్లు ఆ వ్రతకథ వివరిస్తుంది.
కనుక సర్వమానవులూ ఈ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి తరిస్తారని ఆశిద్దాం.
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
వరలక్ష్మీ వ్రతవిధానము
-స్వస్తి-