మాఘగౌరీ వ్రతం

(Magha Gouree Vratam)

 

విధానం

ఈ నోము అయిదు సంవత్సరాలు నోచుకోవాలి. మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన తరువాత పాడ్యమినాడు మొదలు పెట్టి మళ్ళీ అమావాస్య తరువాతి పాడ్యమి వరకూ 30 రోజులు చేయాలి. ప్రతిరోజూ ఉదయం నదిలో స్నానం చేసి, రేవులో పసుపుతో అయిదు పద్మాలు, కుంకుమతో అయిదు పద్మాలు, పిండితో అయిదు పద్మాలు పెట్టి పసుపు గౌరీదేవిని వుంచి పూజించాలి.

నెలరోజులు కాగానే, మొదటి సంవత్సరం శేరుంబావు (1250 గ్రాములు) పసుపు, రెండో సంవత్సరం శేరుంబావు కుంకుమ, మూడవ సంవత్సరం శేరుంబావు కొబ్బరి, నాలుగవ సంవత్సరం శేరుంబావు బెల్లం, అయిదవ సంవత్సరం శేరుంబావు జీలకర్ర చొప్పున ముత్తైదువలకు వాయినమివ్వాలి.అయిదేళ్ళ తరువాత ఉద్యాపన.

ఉద్యాపన

అయిదుగురు ముత్తైదువలకు తలంట్లు పోయించి, భోజనాలు పెట్టించి, ఏటేటా ఇచ్చిన వస్తువులను అయిదుగురికీ అదే పరిమాణంలో వాయినమిచ్చి పసుపు గౌరీదేవిని నీటిలో నిమజ్జనం చేయాలి.

కథ

ఒక బ్రాహ్మణ దంపతులకు లేకలేక ఒక కూతురు పుట్టింది.ఎంతో గారాబంగా ఆమెను పెంచారు. యుక్తవయసు రాగానే ఆమెకు వివాహం చేశారు.వివాహమయిన కొద్దిరోజులకే దురదృష్టవశాత్తూ ఆమె భర్త మరణించాడు. కూతురు పడే వేదన చూడలేక ఆమె తల్లితండ్రులు , ఒక మునికి తమ కూతురి గాథ చెప్పారు. ఆయన ఓదార్చి "మీరు మీ కూమార్తెతో కలిసి తీర్థయాత్రలు చేయండి. మీ యాత్రలలో కాశీనగరం సమీపాన మీకొక చెరువు కనిపిస్తుంది. అది మహిమాన్వితమైనది.

అది అందరికి కనబడదు. అక్కడ పండు ముత్తైదువ ఆధ్వర్యంలో స్త్రీలు పూజలు చేస్తుంటారు. ఆమె సాక్షాత్తూ గౌరీ దేవే. ఆ చెరువు మీకు కనపడితే మీరు కూడా ఆమె చెప్పిన పూజలు చేయండి. కనిపించకపోతే కనీసం యాత్రాఫలం అయినా దక్కుతుంది” అని చెబుతారు. దీనితో ఆ దంపతులు తమ కూమార్తెతో తీర్థయాత్రలకు బయల్దేరతారు.

ముని చెప్పినట్టే వారికి చెరువు కనిపిస్తుంది. బ్రాహ్మణ దంపతులు అక్కడ పూజలు చేయిస్తున్న పండు ముత్తయిదువ వద్దకు వెళ్లి, ఆమె చేయిస్తున్న పూజ వివరాలు తెలుపమని కోరగా, ఆమె వారి చరిత్ర తెలుసుకుని, వారి కూమార్తె చేత చెరువులో స్నానం చేయిస్తుంది. చెరువులో నుంచి అయిదుసార్లు దోసెడు ఇసుక తీయమని ఆ ముత్తైదువ చెప్పగా, ఆమె ఆ విధంగా చేస్తుంది. మొదటిసారి తీసిన ఇసుక పసుపుగా, రెండవసారి తీసింది కుంకుమగా, మూడవసారి తీసింది కొబ్బరిగా, నాల్గవసారి తీసింది బెల్లముగా, అయిదవసారి తీసింది జీలకర్రగా మారుతుంది. అప్పుడు ఆ ముత్తదువ , మంగళగౌరీ నోము విధానం గురించి చెప్పి, ఆ నోము పూర్తి చేసి ఉద్యాపన చేయమని" సూచిస్తుంది.

ఆ యువతి ముత్తయిదువ సూచన పాటించగా, అద్భుతమే జరుగుతుంది. ఆమె భర్త పునరుజ్జీవితుడవుతాడు.


More Vratalu