మార్గశిర పూర్ణిమ.. ఈ రోజు ఇలా చేస్తే ఎంత పుణ్యమో..!

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, పూర్ణిమ తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ మాత్రమే కాకుండా మార్గశిర పూర్ణిమ కూడా చాలా ప్రత్యేకం. పూర్ణిమ రోజు చేసే పూజ, జపం, దానం మొదలైనవి సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఈ సందర్భంగా మార్గశిర పూర్ణిమ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా వెలకట్టలేని పుణ్యాన్ని పోగు చేసుకోవచ్చు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంతకూ మార్గశిర పూర్ణిమ ఎప్పుడు? మార్గశిర పూర్ణిమ రోజు ఏం చేయాలి? తెలుసుకుంటే..
మార్గశిర మాసంలో పూర్ణిమ డిసెంబర్ 4వ తేదీన వచ్చింది.. 4వ తేదీ రాత్రి మొత్తం పూర్ణిమ తిథి ఉంటుంది.
మార్గశిర పూర్ణిమ రోజు పరమేశ్వరుడు, విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పరమేశ్వరుడిని ఆరాధించడం, పరమేశ్వరుడికి చేసే కొన్ని ఉపచారాలు వెలకట్టలేని పుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా జీవితంలో సానుకూల శక్తిని ఇస్తుంది.
శివలింగ ఆరాధన..
మార్గశిర పూర్ణిమ రోజు శివలింగానికి ప్రత్యేక వస్తువలను సమర్పించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. ఇంతకీ శివుడికి ఏమేమి సమర్పించాలంటే..
పచ్చి పాలు ..
పరమేశ్వరుడికి స్వచ్ఛమైన ఆవు పాలు నైవేద్యం పెట్టడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మార్గశిర పూర్ణిమ నాడు ఆవుపాలు నైవేద్యానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది.
పెరుగు..
శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
తేనె..
శివలింగానికి తేనెను సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అప్పులు లేదా అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుంది.
బిల్వ ఆకులు..
శివుడికి బిల్వ పత్రి అంటే చాలా ఇష్టం. మూడు దళాల బిల్వ ఆకులను తలక్రిందులుగా అర్పించాలి. ఇలా చేయడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.
చెరకు రసం..
శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేస్తే , ఐశ్వర్యం సిద్దిస్తుంది. అంతేకాదు.. ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. కులుంబంలో కలహాలు, కలతలు తొలగిపోతాయి.
నల్ల నువ్వులు..
నల్ల నువ్వులను నైవేద్యం పెట్టడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. ఎవరికైనా ఇచ్చి వెనక్కు తిరిగిరాని డబ్బును తిరిగి పొందడం సాధ్యమవుతుంది.
అక్షింతలు..
అక్షింతలు శుబానికి, సానుకూల శక్తికి సూచిక. అక్షింతలను శివలింగానికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. సంపదలు నిలిచి ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
ఈ నియమాలు మరవకండి..
లక్ష్మీ దేవి శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. కాబట్టి ఇల్లు లేదా ఆలయం, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరించకూడదు. అలాగే ఎవరితోనూ వాదించడం, పోట్లాడటం చేయకూడదు. అదేవిధంగా ఇతరుల గురించి నెగిటివ్ గా లేదా మాట్లాడటం, తప్పు ఆలోచనలు చేయడం వంటివి చేయకూడదు.
పూజ, దానధర్మాలు, ఇతర ఆచారాలను భక్తితో నిర్వహించాలి. మొక్కుబడిగా చేసే పూజలు, ఇతరుల మెప్పు కోసం చేసే దానాలు వ్యర్థం.
*రూపశ్రీ.


