రథ సప్తమీ వ్రతం

(Ratha Saptamee Vratam)

 

కథ

కాంభోజ దేశాన్నిఏలే రాజుకి వృద్దాప్యం వచ్చేసింది. అతనికి కొడుకులున్నారు గాని, వాళ్ళందరూ కూడా తలో రకమైన వ్యాధితో బాధ పడుతున్నందు వల్ల, వారిలో తన తర్వాత రాజయ్యేవారెవరో నిర్ణయించలేక సతమతమవుతూండేవాడు. అలా వుండగా, ఒకరోజు తన రాజ్యానికి వచ్చిన ఒక బ్రాహ్మణుని సత్కరించి, కుశల ప్రశ్నలయ్యాక తన కుమారుల గురించి చెప్పి, తనకేదైనా పరిష్కారం సూచించమని ప్రాధేయపడ్డాడు.

దాంతో బ్రాహ్మణుడు "మహారాజా! నువ్వు దు:ఖించకు. సర్వ పాపాల్నీ నాశనం చేసేది, అన్ని రోగాలనూ హరించేది, ఇష్ట కామ్యాలను తీర్చేదీ, అష్టయిశ్వర్యములనూ యిచ్చేదీ అయిన ఒక దివ్య వ్రతం ఉంది. అదే రథ సప్తమీ వ్రతం. దీన్ని స్ర్తీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు. ఇప్పుడు, నీ కుమారుల్లో యోగ్యుడైన వాడెవడో చూసి, అతనితో రథ సప్తమీ వ్రతం చేయిస్తే సరి. వెంటనే, వ్యాధి నుంచి విమోచనం పొంది, రాచకార్యాలలోపాల్గొంటాడు. అతనికే రాజ్యాభిషేకం చెయ్యి. తర్వాత తక్కిన పుత్రులతోనూ వ్రతం చేయిస్తే, వాళ్ళు కూడా ఆరోగ్యవంతులవుతారు. రాజభ్రాతలుగా, యువరాజులుగా అతనికి తోడ్పడతారు...'' అంటూ వివరంగా చెప్పాడు.

రాజుగారు సంతోషించి, అలాగే చేశాడు. రథ సప్తమీవ్రతాన్ని ఆచరించి రాజపుత్రులు ఆరోగ్యాన్ని పొందారు.

విధానం

మాఘ శుద్ధ సప్తమినాడు ఉదయమే తలలపై జిల్లేడాకులూ, రేగిపళ్ళు వుంచుకుని నదీ స్నానం చేసి, దగ్గరలో ఉన్న సూర్యదేవాలయానికి వెళ్లి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్నీ చేయించి ఇంటి వద్దనే ఆరాధించుకోవచ్చును. దీనికి ఉద్యాపనమంటూ లేదు. నిత్య జీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.


More Vratalu