ఆసక్తికరమైన  పిప్పలాదుని వృత్తాంతం!

పూర్వకాలంలో విద్యాధరులకు రాజు చిత్రకేతువు. అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలని, కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుడు పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని, గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు. మహర్షులు, రుద్రగణాలు అన్నీ వారిచుట్టూ చేరి నమస్కరిస్తూ నిలుచున్నాయి. ఆ దృశ్యం చూసిన చిత్రకేతువు "భార్యాబిడ్డల సంసారం బంధనాలలో కూరుకుపోయిన పామరుడులాగా ఈశ్వరుడు ఇలా చెయ్యటం బాగాలేదు. శివుడంతటివాడే ఈ రకంగా చేస్తే, రేపు మునులు, ఋషులు ఏం చేస్తారు?" అని పెద్దగానే అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు కాని, పార్వతి మాత్రం కోపంతో "నువ్వు రాక్షసుడుగా జన్మించు" అన్నది.

"త్వష్ట అనేవాడు ఒక ప్రజాపతి. ఒకసారి ఇంద్రుని మీద అతడికి చాలా కోపం వచ్చింది. అందుకని ఇంద్రుడుని సంహరించటానికి తన తప్పశ్శక్తితో విశ్వరూపుడు అనే కుమారుడిని సృష్టించాడు. ఇంద్రుడు వాణ్ణి చంపేశాడు. విశ్వరూపుని మరణవార్త విన్న త్వష్ట హోమం చేశాడు. హోమగుండం నుంచి అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు, సూర్యుడంత ప్రతాపం కలవాడు, దివ్యకాంతులతో విరాజిల్లేవాడు, అయిన కుమారుడు ఉదయించాడు. పుత్రుడు పుట్టగానే పెరిగి ఆకాశమంత అయినాడు. అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి. కనులు నిప్పులు చెరుగుతున్నాయి. చేతిలో భయంకరమైన త్రిశూలమున్నది. నోరు కొండ గుహలా ఉంది. నాలుక సాచితే నక్షత్రమండలాన్ని తాకేటట్లున్నది. అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు. అందుచేత వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్టప్రజాపతి. 

వృత్రుడు ఇంద్రుని మీదికి దండెత్తి ఇంద్రుని ఓడించాడు. దేవతల దివ్యాస్త్రాలు వాడి ముందు పనిచెయ్యలేదు. అప్పుడు దేవతలంతా శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. హరి వారి మొర ఆలకించి  ప్రత్యక్షమై "వృత్రుడు మహాబలశాలి. మహిమోపేతుడు. మీ దగ్గర ఉన్న ఆయుధాల వల్ల చావడు. చ్యవనుని కుమారుడు దధీచి. పూర్వకాలంలో దేవతలు తమ అస్త్రాలను దధీచి మహర్షికి ఇచ్చి దాయమన్నారు. ఎంత కాలానికీ దేవతలు తిరిగి మహర్షి వద్దకు పోలేదు. అందుచేత ఆయన వాటిని పానం చేసేశాడు. అవి ఆయన ఎముకలకు పట్టినాయి. కాబట్టి, ఇప్పుడు దధీచి ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా చేసి ప్రయోగిస్తే వృత్రుడు నశిస్తాడు అన్నాడు శ్రీహరి.

దేవతలంతా దదీచి మహర్షి దగ్గరకు వెళ్ళారు. ఆయన తపోనిష్టలో ఉన్నాడు. దేవతలు మహర్షిని ప్రార్ధించారు. "మీకు ఏం కావాలి?" అని అడిగాడు కనులు తెరిచిన మహర్షి. 

'మహర్షీ! వృత్రాసురుని బాధలు పడలేకుండా ఉన్నాము. అతడు తమ ఎముకలతో చేసిన ఆయుధాల వలన గాని చావడు. అందుచేత మీ వద్దకు వచ్చాము' అన్నారు. విషయం అర్థమైంది మహర్షికి. పుట్టిన ప్రతి ప్రాణీ మరణించక తప్పదు. మరణానంతరము శరీరము క్రిమికీటకాలకు ఆహారమవుతుంది. దానికన్నా ఈ రకంగా దేవ కార్యార్థం ఉపయోగించబడటం శ్రేయస్కరం కదా? అని ఆలోచించి సరే అన్నాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చుని కన్ను మూశాడు. అతని ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు. 

అతడి వెన్నెముకతో వజ్రాయుధం తయారుచేశాడు విశ్వకర్మ. విష్ణుమూర్తి తన శక్తిని అందులో నింపాడు. వృత్రునితో యుద్ధం చేసి వజ్రాయుధంతో అతణ్ణి సంహరించాడు ఇంద్రుడు.

దధీచి భార్య లోపాముద్ర. ఈమెనే 'సువర్చ' అని కూడా అంటారు. తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి, సహగమనానికి ఏర్పాటు చేసుకుంది. అప్పుడు అశరీరవాణి, 'అమ్మా! నువ్వు గర్భవతివి. ఇలా మరణించరాదు" అన్నది. దాంతో ఆమె తన గర్భాన్ని చీల్చుకుని, లోపల ఉన్న బాలుణ్ణి తీసి, ఆశ్రమ ప్రాంగణంలోని రావిచెట్టు క్రింద పడుకోబెట్టి, తాను సహగమనం చేసింది.

దేవతలు ఆ బాలుని దగ్గరకు పోయి అతడికి 'పిప్పలాదుడు' అని నామకరణం చేశారు. అతడు రుద్రావతారము. తరువాత కాలంలో పిప్పలాదుడు అనరణ్య మహారాజు కుమార్తెను వివాహమాడి స్వస్వరూప జ్ఞానం పొంది 'బ్రహ్మజ్ఞాని' అని పేరు పొందాడు. ఇదీ పిప్పలాదుని వృత్తాంతం.

                                        ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories