సృష్టికర్త అయిన బ్రహ్మ తొమ్మిది రూపాలు !

ప్రళయం సంభవించి భూలోకమంతా జలమయమయినప్పుడు, బ్రహ్మదేవుడు ఉద్భవించి, ఆ తరువాత ఎన్నో లోకాలను, దేవగణాలను, వివిధరకాల జలసమూహాలను, స్థలచరాలను సృష్టించాడు. అందుకే బ్రహ్మని జగత్స్రష్ట అంటారు. విశ్వకర్మన్, బ్రహ్మణస్పతి, హిరణ్యగర్భ అనే పేర్లతోనూ మొదటగా ఉద్భవించినవాడు కాబట్టి పరబ్రహ్మ, పరమాత్మగానూ చెప్తారు. సమస్తమయిన మంగళప్రద కార్యాలలో బ్రహ్మను స్మరించటం, పూజించటం ఉండేది. సర్వతోభద్ర, లింగతోభద్ర, వాస్తుమండల మొదలైన వాటిలో వారికి ప్రాధాన్యం ఇచ్చేవారు.

బ్రహ్మ, నారాయణ, పురుషుడు, మహానుభావుడు అనే పేర్లతో శాస్త్రాలలో కనిపిస్తాడు. దేవదానవ, యక్ష, కిన్నెర, రాక్షసులందరికీ బ్రహ్మదేవుడు తాతగారే. సృష్టి రచానాకారుడు అవ్వడంచేత ఇతడు ధర్మపక్షపాతి. దేవదానవ  మానవులు ఎవరైనా సరే సమస్యలలో చిక్కుకుంటే ముందు బ్రహ్మ దగ్గరకే వెళతారు.

సృష్టి ఆరంభములో హిరణ్యగర్భం నుంచి స్వయంభువుగా బ్రహ్మ ఉద్భవించాడని చెబుతారు. విష్ణువు నాభి నుండి వెలువడిన కమలమే బ్రహ్మ ఆసనం. ఆ కమలంలోని బొడ్డుని సుమేరు పర్వత స్వరూపంగా భావిస్తారు. వేదాలు, పురాణాలు, స్మృతులు అన్నీ బ్రహ్మని సృష్టికర్తగా చెప్తారు.

బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను అనుగ్రహిస్తాడు.

బ్రహ్మ తొమ్మిది రూపాలు:-
1. కుమారబ్రహ్మ
2. అర్కబ్రహ్మ
3. వీరబ్రహ్మ
4. బాలబ్రహ్మ
5. స్వర్గబ్రహ్మ
6. గరుడబ్రహ్మ
7. విశ్వబ్రహ్మ
8. పద్మబ్రహ్మ
9. తారకబ్రహ్మ

ఇలా తొమ్మిది రూపాలతో తొమ్మిది శివలింగాలను ప్రతిష్ఠించి బ్రహ్మదేవుడు పూజించిన పుణ్యప్రదేశమే మనరాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రం. ఇటువంటి అరుదైన క్షేత్రం మనదేశంలో ఇదే. 

 


More Venkateswara Swamy