లాల్‌బాగ్చా- ఈ వినాయకుడికి ట్రైలర్ ఇస్తారు

 


వినాయకచవితి వస్తోందనగానే ఎక్కడెక్కడి ఊళ్లన్నీ సందడిగా మారిపోతాయి. ప్రతి ఊరి కూడలిలోనూ గణేశుడి పందిళ్లు వెలుస్తాయి. కానీ వినాయక చవితి అత్యంత ఆర్భాటంగా జరిగే ప్రాంతం ఏది అంటే మాత్రం మహారాష్ట్ర, అందులోనూ ముంబై ప్రాంతమే గుర్తుకువస్తుంది. అందులోనూ ‘లాల్‌బాగ్చా’ వినాయకుడి హడావుడి అంతాఇంతా కాదు.

 

82 ఏళ్ల దేవుడు

ముంబైలోని దాదరుకు దగ్గరగా ఉన్న ప్రాంతమే లాల్‌బాగ్. 1932లో ఈ ప్రాంతంలో ఉండే మార్కెట్టు అకస్మాత్తుగా మూతబడిపోయింది. దాంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే పేదలంతా, తాము శాశ్వతంగా వ్యాపారం చేసుకునేందుకు స్థలం దక్కితే వినాయకుడని ప్రతిష్టిస్తామంటూ మొక్కుకున్నారు. స్థానిక పెద్దల చొరవతో, తయ్యబలీ అనే ఒక భూస్వామి వ్యాపారస్తుల కోసం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అప్పటి నుంచి చిన్నాచితకా వ్యాపారస్తులకి ఈ ప్రాంతం ఒక ఆసరాగా నిలిచింది. తాము మొక్కుకున్నట్లుగానే 1934లో మొదటిసారిగా వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజించుకున్నారు. అదే సంప్రదాయం దశాబ్దాల తరబడి సాగుతోంది.

 

నవ్‌సాచా గణపతి

ఇక్కడి వినాయకుడిని ముంబైవాసులు నవ్‌సాచా గణపతి అని పిలుచుకుంటారు. అంటే కోరిన కోరికలు తీర్చేవాడు అని అర్థమట. ఈ గణపతిని ముద్దుగా ‘లాల్‌బాగ్చా రాజా’ అని కూడా పిలుచుకుంటారు. గణపతి నవరాత్రులలో ప్రతిష్టించే ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి రోజుకి సుమారు 15 లక్షల మంది వస్తారని అంచనా. ఇంతమందీ విగ్రహం దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లకు మొక్కాలంటే చాలా సమయం పడుతుంది కదా! అందుకని విగ్రహం దగ్గరవరకూ వెళ్లాలనుకునే వారికి ఒక లైను, గణపతి కేవలం దర్శించుకోవాలనుకునేవారికి ఒక లైనూ ఉంటుంది. ఇంత చేసినా కూడా విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు 40 గంటల వరకూ పడుతుందట!

 

సాయమూ చేస్తారు

‘లాల్‌బాగ్చా రాజా సార్వజనిక్‌ గణేషోత్సవ్‌ మండల్’ అనే కమిటీ ఏటా ఈ వినాయకచవితి వేడుకలను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు దాదాపు 400 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఈ నవరాత్రుల సందర్భంగా వచ్చిన నిధులను అవసరమైనప్పుడు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రాష్ట్రాలకు అందిస్తూ ఉంటారు.

 

పండుగ ట్రైలర్‌

లాల్‌బాగ్చాలో ప్రతిష్టించే వినాయకుడు దాదాపు 12 అడుగుల ఎత్తు ఉంటాడు. ఏటా ఏదో ఒక వైవిధ్యంతో ఈ వినాయకుడిని రూపొందిస్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ప్రతిసారీ ఒకే కుటుంబానికి చెందిన శిల్పులతో రూపొందించడం మరో విశేషం. ఏటా, ఈసారి విగ్రహం ఎలా ఉంటుందా అని ముంబైవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అందుకనే పండుగకు ఓ నాలుగు రోజులు ముందుగానే ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కార సభను స్థానిక ఛానెల్స్‌ లైవ్‌లో ప్రసారం చేస్తాయంటేనే అర్థం చేసుకోవచ్చు... లాల్‌బాగ్చా రాజాకి ఉన్న ఆదరణ ఏపాటిదో! గుడ్లగూబ ఆకారంలో ఉన్న ఆసనం మీద ఆశీనుడై ఉన్న ఈ ఏటి గణపతిని, సెప్టెంబరు 1 సాయంత్రం 6:30 నిమిషాలను ఆవిష్కరించారు. ఇక పండుగ హడావుడి మొదలయిపోయినట్లే!

 

- నిర్జర.

 


More Vinayaka Chaviti