కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని ఎలా అణిచాడు!

ఒకసారి నందుడూ ఆయన మిత్రులూ ఇంద్రయాగం తలపెట్టారు. కృష్ణయ్యకు ఆ సంగతి తెలిసి తండ్రి దగ్గరకు వెళ్ళి 'నాయనా! ఈ యాగానికి పెద్ద ఎవరు? ఆయనను మెప్పించడం వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి? అసలీ యాగం చెయ్యాలని ఎవరు చెప్పారు?" అని ఏమీ తెలియనట్టు అడిగాడు.

'కృష్ణా! ఈ యాగానికి మహేంద్రుడు అధిపతి. ఆయనను పూజిస్తే వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. వర్షాల వల్ల భూమినిండా పచ్చిక పెరుగుతుంది. పచ్చిక తిని పశువులు వర్ధిల్లుతాయి. పశువులపాడి ద్వారా మనమూ, దేవతలూ కూడా సంతుష్టితో బతుకుతాం' అని నందుడు చెప్పాడు.

శ్రీకృష్ణుడికి ఆ సంగతి తెలియక కాదు. అయినా, మహేంద్రుడు మితిమీరిన గర్వంతో విర్రవీగుతున్నందువల్ల అతని గర్వాన్ని అణచటం అవసరమని గోపాలకృష్ణుడు భావించాడు. అందుకని ఏ విధంగానైనా సరే ఇంద్రోత్సవం జరగకుండా అడ్డుపడాలనుకున్నాడు.

'ఇంద్రుడు భగవంతుడేం కాదు. సృష్టి క్రమంలో జరిగే ఒక పనిని ఆయన నిర్వహిస్తాడు. అంటే సూర్యుడు ఉదయించటం, చంద్రుడు చల్లగా వుండటం, వానా వరదా రావడం - అన్నీ ప్రకృతి ధర్మాలు. ప్రపంచంలో కర్మకు లోబడని ప్రాణి అంటూ ఏదీ లేదు. ప్రతి ప్రాణీ కర్మ కారణంగానే జీవించటం, వృద్ధి పొందటం, నశించటం జరుగుతోంది. మనం అనుభవించే కష్టసుఖాలూ, ఆనంద విషాదాలూ అన్నీ కర్మననుసరించే జరుగుతాయి. ఒకరి దయతోనూ, అనుగ్రహంతోనూ ప్రకృతి బతకడం లేదు. మేఘాలు వర్షించడానికీ ఇంద్రుడికీ సంబంధం లేదు. ఆ గోవర్ధనగిరి, ఈ పాడినిచ్చే పశువులు, పంటనిచ్చే నేలతల్లి, గలగలపారే యమునానది - ఇవి మన ప్రత్యక్ష దైవాలు. వీటిని పూజించండి. మనకు ఉపకారి అని భ్రమపడి ఆ ఇంద్రుడ్ని నెత్తిన పెట్టుకోవడం అజ్ఞానం' అన్నాడు.

 కృష్ణయ్య అలా చెప్పేసరికి గోపకులందరూ మహేంద్ర పూజ విరమించి గోవర్ధనగిరినీ, గోవులనీ పూజించారు. నదీమతల్లిని కొలిచారు. నేలతల్లిని అర్చించారు. ఇంద్రుడికీ సంగతి తెలిసింది. తన పూజను నివారించిన కృష్ణునిపట్లా, అతని ఆదేశానుసారం వ్యవహరించిన యాదవుల పట్లా ఆయన ఆగ్రహించాడు. ఇంద్రుడు కళ్ళెర్ర చేయగానే మేఘాలు బృందావనంవైపు కదిలి వెళ్ళాయి. ఉన్నట్టుండి పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి. చూస్తుండగానే పెనుగాలి చెలరేగింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ వర్షానికి బృందావనవాసులంతా కలవరపడ్డారు. ఆ సమయంలో తమను రక్షింపగలవాడు నల్లనయ్య ఒక్కడే అనుకుని యాదవులందరూ ఆయనను ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారికి అభయమిచ్చి గోవర్ధనగిరి దగ్గరకు వెళ్ళి గిరిని కదిలిరమ్మని ఆదేశించాడు. పర్వతం కదిలి పైకి లేచింది. నల్లనయ్య దానిని తన చిటికెన వేలిపై నిలిపాడు. యాదవులందరూ ఆలమందలతో, పిల్లా పాపలతో ఆ కొండ కిందకు వచ్చి తలదాచుకున్నారు. కాని, వాళ్ళకు అదంతా చిత్రంగా తోచింది. కలో నిజమో తెలియడం లేదు. దిగ్భ్రాంతులై చూస్తున్నారు. 'పర్వతం విరిగి మీ నెత్తిమీద పడదు. భయపడకండి. అందరూ ఈ కొండకిందే వుండండి' అని కృష్ణుడు వాళ్ళకు ధైర్యం చెప్పాడు.

ఆ విధంగా ఏడు రోజులు గడిచాయి. ఆ ఏడు రోజులూ ప్రళయ వర్షం కురుస్తూనే వుంది. అయినా కృష్ణయ్య ఒక్క అడుగైనా కదలలేదు. కృష్ణయ్య చిటికెన వేలున వున్న గోవర్ధనగిరీ చెక్కుచెదరలేదు.

ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పటికే నింగినున్న వర్షమంతా నేల చేరింది. చేసేదిలేక మేఘాలను మరలించుకుపోయాడు. వర్షం ఆగింది. చీకటి పోయి వెలుగు వచ్చింది.

గోకులమంతా కొండగొడుగు కిందినుంచి ఇవతలకు వచ్చింది. కృష్ణయ్య గోవర్ధనగిరిని యధాస్థానంలో వుంచాడు. వెలుగొచ్చిందనీ, ఎండొచ్చిందనీ యాదవులందరూ సంబరపడ్డారు. కృష్ణయ్య నవ్వి 'వర్షం కురవడం ప్రకృతి ధర్మమెలాగో, ఎండ రావడమూ అంతే' అన్నాడు.

ఇంతలో ఇంద్రుడు ఐరావతమెక్కి వచ్చాడు. వస్తూనే కృష్ణుడికి పాదాభివందనం చేశాడు. 'కృష్ణా! ప్రపంచానికంతటికీ నువ్వే అధిపతివి. నీ శక్తిని గ్రహించక నా ఇంద్రపదవినీ, అధికారాన్నీ, ఐశ్వర్యాన్నీ చూసుకుని మదోన్మత్తుడనై ప్రవర్తించాను. నాకు తగిన శాస్తి చేశావు. నన్ను శిక్షించడం వల్ల నాలాంటి అహంకారులు తప్పుతెలుసుకుని సన్మార్గంలో నడిచేందుకు వీలు కలిగింది' అన్నాడు. కృష్ణుడు సంతోషించి మహేంద్రుడ్ని మన్నించాడు. దేవతలు కృష్ణుడిమీద పూలవాన కురిపించారు.

                                     ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories