కోటి సోమవారం ఎప్పుడు..ఈ రోజు ఏం చేస్తే మంచిదంటే!
హిందూ క్యాలెండర్ లో ఉన్న మాసాలలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్కో మాసంలో ఒక్కో రోజును శ్రేష్టంగా పేర్కొంటారు. శ్రావణ మాసంలో శుక్రవారాన్ని, శనివారాన్ని, కార్తీక మాసంలో సోమవారాన్ని అలాగే పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుండటంతో కార్తీక మాస పద్దతులకు, కార్తీక సోమవారాలకు సంబంధించి చాలా విషయాలను అందరూ తెలుసుకుని వాటిని ఆచరిస్తున్నారు. ఈ క్రమం లోనే కోటి సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. దీని గురించి పలు చోట్ల పలు విధాలుగా చర్చలు నడుస్తున్నాయి. అసలు కోటి సోమవారం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి? కోటి సోమవారం రోజు చేయాల్సిన పని ఏమిటి? తెలుసుకుంటే..
కోటి సోమవారం..
కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజునే కోటి సోమవారం అంటారని. అది ఏ రోజు అవుతుందో అని చాలామంది తికమక పడుతూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చిన అన్ని సోమవారాల గురించి ఆరా తీస్తుంటారు. అయితే కోటి సోమవారం అనేది కార్తీక సోమవారం రోజు రాదు.. దానికంటూ ప్రత్యేక తిథి ఉంది.
కోటి సోమవారం విశిష్టత..
కోటి సోమవారం పరమ శివుడికి ప్రత్యేకమైన రోజు. కోటి సోమవారం రోజు పూజ చేస్తే కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్ర పండితులు అంటున్నారు. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారం అంటారు. ఈ ఏడాది 2024లో కార్తీక మాసంలో కోటి సోమవారం నవంబర్ 9వ తేదీ శనివారం వచ్చింది.
సమయం..
కోటి సోమవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తుంది. శ్రవణా నక్షత్రం నవంబర్ 8వ తేదీ ఉదయం 9గంటల 18 నిమిషాలకు ప్రారంభమై.. నవంబర్ 9వ తేదీ ఉదయం 8.42 నిమిషాలకు ముగుస్తుంది. శ్రవణా నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉండే రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు. అంటే నవంబర్ 9 వ తేదీ శనివారమే కోటి సోమవారం.
ఏం చేయాలి..
కోటి సోమవారం రోజు చేసే ఏ పని అయినా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున కోటి సోమవారం పేరుతో వత్తి కూడా వెలిగిస్తారు. దీన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. అలాగే కోటి సోమవారం రోజు చేసే దానం, ఆ రోజు చేసే స్నానం, ఆ రోజు ఉండే ఉపవాసం వల్ల కలిగే ఫలితాలు కూడా కోటి రెట్లు అధికంగా ఉంటాయని అంటున్నారు.
*రూపశ్రీ.