కార్తీకమాసంలో గోవును ఎందుకు పూజించాలో తెలుసా...

హిందూ సనాతన  ధర్మం గోవును గోమాత అని పేర్కొంటుంది.  గోవును పూజించడం,  గోవుకు ఆహారం అందించడం, గోదానం చేయడం మొదలైనవి హిందూ ధర్మంలో చాలా పుణ్యప్రదమైన కార్యాలుగా పరిగణించబడతాయి.  అయితే కార్తీకమాసంలో గోవును తప్పనిసరిగా పూజించాలని చెబుతారు.  కార్తీక మాసంలో గోవును తప్పనిసరిగా పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

కార్తీక మాసంలో గోవును పూజించడం చాలా శుభప్రదం అని పురాణ పండితులు చెబుతున్నారు. శివకేశవ భేధం లేదని తెలిపేది కార్తీక మాసం.  అలాంటి కార్తీక మాసంలో గోవును ఆరాధిస్తే శివుడు, విష్ణువు ఇద్దరూ ప్రసన్నం అవుతారట.

గోమాతకు సేవ అనగా గోవును, గోవు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం,  గోవుకు ఆహారం ఇవ్వడం,  గోవు ఆరోగ్యాన్ని సంరక్షించడం వంటి పనులు చేయడం.  ఇలా గోమాతకు సేవ చేయడం వల్ల పాప విమోచనం కలిగి ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రాప్తిస్తాయట.

కార్తీక మాసంలో గోమాతకు ఆహారం పెట్టడం,  నీళ్ళు పెట్టడం వంటివి చేస్తే.. కార్తీక మాసంలో దీప దానం చేసిన ఫలితంతో సమానమైన పుణ్యం లభిస్తుంది.

మనిషి పాపాలను కరిగించి కర్మ బంధాలను తొలగించే శక్తి గోవులో ఉంది. అందుకే గోవును పూజించడం,  గోవుకు సేవ చేయడంను హిందూ ధర్మ ఆచరణలో ఒక భాగంగా పెట్టారు.

గోవును పూజించడం వల్ల ఇంట్లో దారిద్ర్యం,  దుఃఖం క్రమంగా తొలగుతాయని పండితుల మాట.  గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను  పూజించినట్టేనని,  గోవు కోరిన కోర్కెలు తీర్చే కామధేనువని చెబుతారు. అందుకే కార్తీక మాసంలో గోవును పూజించడం,  గో సేవ చేయడం ఎంతో మంచిది.

                                             *రూపశ్రీ.


More Karthikamasa Vaibhavam