కార్తీక మాసంలో 30 రోజులూ పూజ చేయలేని వారు ఇలా చేస్తే మంచిది..!
కార్తీక మాసం శివ భక్తులకు ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో చేసే పూజలు, దీపారాధన, దానం, జపం వంటివి సాధారణ సమయాల్లో కంటే చాలా రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తాయి. ఈ కారణంగా కార్తీక మాసంలో వీటికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతిరోజూ దీపాలు వెలిగించడం, శివాలయం, విష్టువాలయ దర్శనం వంటివి కూడా తప్పనిసరిగా చేస్తారు. మరికొందరు ఉపవాసం కూడా ఉంటారు. ఇంకొందరు కార్తీక మాసం వ్రతం, దీక్ష కూడా చేపడతారు. అయితే కార్తీక మాసం 30 రోజులు దీపారాధన చేయలేని వారు ఉంటారు. కుటుంబ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పరిస్థితులు అనుకూలించక కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన చేసే పరిస్థితి లేనివారికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇవన్నీ భాగవతంలో పేర్కౌన్నారు.
ఏదైనా కారణం వల్ల కార్తీక మాసంలో దీపాలు పెట్టలేని వారు ఉంటారు. ఇలాంటి వారు 30 రోజులు కాకపోయినా కనీసం శుద్ద ద్వాదశి, చతుర్థశి, పౌర్ణమి రోజులలో అయినా దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఈ మూడు రోజులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మూడు రోజులలో దీపం వెలిగించినా ఎంతో పుణ్యం. ఇంకా చెప్పాలంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా శని త్రయోదశి రోజు దీపారాధన, పూజ, దానం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, జాతక దోషాలు, కుటుంబ సమస్యలు, జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయని అంటారు. అయితే ఈ శని త్రయోదశి కన్నా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు దీపారాధన చెయ్యడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి.
కార్తీక మాసంలో వచ్చే సోమవారాల రోజు దీపారాధన చెయ్యడం, శివ పూజ, రుద్రాభిషేకాలు వంటివి చెయ్యడం చాలామంది అలవాటు. అయితే కార్తీక మాసంలో సోమవారం రోజు దీపాలు వెలిగించడం కంటే కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం వల్ల వంద రెట్ల ఫలితం కలుగుతుంది.
కార్తీక పౌర్ణమి రోజు చాలామంది శివాలయం, వైష్ణవాలయం లో దీపాలు వెలిగించడం చేస్తారు. అలాగే కొందరు నదులలోనూ, పారుతున్న నీటిలోనూ దీపాలను దీపాలను వదులుతారు. అయితే ఇలా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపాల కంటే బహుళ ఏకాదశి రోజు దీపాలు వెలిగించడం కోటి రెట్ల పుణ్య ఫలితాలు ఇస్తుందట.
కార్తీక మాసంలో మరొక విశిష్టమైన తిథి క్షీరాబ్ది ద్వాదశి. బహుళ ఏకాదశి రోజు దీపాలు వెలిగిస్తే కలిగే కోటి రెట్ల పుణ్య ఫలం కంటే.. క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించడం వల్ల కలిగే పుణ్య ఫలం అనంతమైనది, అతి విస్తారమైనది కూడా. కాబట్టి 30రోజులు దీపాలు వెలిగించలేని వారు.. కనీసం పై మూడు రోజులు.. అవి కుదరని పక్షంలో ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు అయినా దీపాలను వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
*రూపశ్రీ.