ఏడు మహా నరకాలు - ఘోర శిక్షలు
Karthika Puranam – 29
నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ''ప్రేతపతి'' అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. దూత , ధనేశ్వరుని తనతో తీసుకు వెళ్తూ మార్గమధ్యం లోని నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు.
తప్తవాలుకం
''ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాలిన శరీరాలతో దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీన్నే ''తప్త వాలుక నరకం'' అంటారు. అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేదవిదులను, యజమానిని, కాళ్ళతో తన్నినవారి పాదాలను యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు..
అంధతామిత్రం
ఈ నరకంలో సూది మొనల్లాంటి భయకర ముఖాలు కలిగిన పురుగులు, పాపాత్ముల శరీరాలను తొలచివేస్తుంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని బయటపెట్టే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు.
క్రకచం
ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు.
అసిపత్రవనం
నరకాలలో నాలుగోది అసిపత్రవనం. భార్యాభర్తలను విడగొట్టే లేదా తల్లిదండ్రుల నుండి వారి సంతానాన్ని ఎడబాటు కలిగించే పాపులు ఈ నరకం చేరి నిలువెల్లా బాణాలతో, అసిపత్రాలతో హింసించబడతారు. రక్తం కారుతుండగా, వెంబడిస్తున్న తోడేళ్ళకు భయపడి శోకాలు తీస్తూ, పరుగులు తీస్తూ ఉంటారు. విపరీతమైన హింస తో కూడిన ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.
కూటశాల్మలి
పర స్త్రీలను, పరుల ద్రవ్యాన్ని హరించిన వాళ్ళు, ఇతరత్రా అపకారాలు చేసిన వాళ్ళు ''కూటశాల్మలి'' నరకం చేరతారు. ఇక్కడ 16 రకాలుగా దండిస్తారు.
రక్తపూయం
ఇది ఆరవ నరకం. ఇక్కడ దుర్మార్గులు తలకిందులుగా వేళ్ళాడుతూ యమకింకరులచేత హింసించబడుతుంటారు. తినకూడనివి తిన్నవారు, ఇతరులను నిందించినవారు, చాడీలు చెప్పినవారు ఈ నరకం చేరతారు.
కుంభీపాకం
మొట్టమొదట నీకు విధించబడినది, ఘోరాతిఘోరమైనది, నరకాలన్నిటిలోకీ నికృష్టమైనది కుంభీపాక నరకం. అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది.
రౌరవం
నరకాలలో ఎనిమిదవది అయిన ఈ రౌరవం దీర్ఘకాలికం. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు.
ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి. 1. అపకీర్ణం, 2. పాంక్తేయం, 3. మలినీకరణం, 4. జాతిభ్రంశం, 5. ఉపవీతకం, 6. అతిపాతకం, 7. మహాపాతకం
పైన చెప్పిన ఏడు రకాల నరకాల్లో ఆయా పాపాలు చేసినవారు శిక్షలు అనుభవిస్తూ, మగ్గుతున్నారు. కానీ, నువ్వు కార్తీక వ్రతస్తులైన వారి సాంగత్యం ద్వారా అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వల్ల ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు.
ఇలా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు.
అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై, ధన యక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమా. అందువల్ల శ్రీకృష్ణుడు ''సత్యభామా! పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు'' అని సత్యభామకు చెప్పి సాయంసంధ్యానుష్టానార్ధమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.
సూత ఉవాచ
ఈ కార్తీకమాసం పాపనాశని, విష్ణువుకు ప్రియకరి. వ్రతస్తులకు భుక్తి ముక్తిదాయనిగా ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణం, ప్రాతః స్నానం, తులసీ సేవ, ఉద్యాపన, దీపదానం - వీటిని కార్తీకమాసంలో ఆచరించినవారు ఇహంలో భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా దుఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసమూ ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టాల్లో ఉన్నవాడు, దుర్గారణ్య గతుడు, రోగి - ఎవరైనా సరే ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి.
ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే ఈ వ్రతాన్ని మానకుండా శివాలయంలోనో, విష్ణు ఆలయంలోనో హరి జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టు వద్ద గానీ, తులసీవనంలో గానీ వ్రతం చేసుకోవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదానఫలాన్ని, వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాలని, నర్తకులు సర్వతీర్ధాల స్నానఫలాన్ని పొందుతారు. ఆపదల్లో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు - వీళ్ళు కేశవనామాలతో లాంచన మార్జనం ఆచరిస్తే చాలు. వ్రత ఉద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.
శ్రీ మహా విష్ణువు రూపమే బ్రాహ్మణుడు. కనుక కార్తీకమాసంలో బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు శక్తి లేనివాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తి అయినా లేనివాళ్ళు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రంచేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగల్గుతారు.
దీపదానం చేసే స్తోమతు లేనివారు, దీపారాధనకు కూడా తాహతు లేనివారు, ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వల్ల అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి.
రావి - మర్రి
సూతుడు చెప్పింది విని ఇతర వృక్షాలు అన్నిటికంటే కూడా రావి,మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు.
పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురత భోగంలో ఉండగా కార్యాంతరం వల్ల దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి ''సృష్టిలోని క్రిమికీటకాదులు సహితం సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని కలిగించిన మీరు చెట్లయి పడి ఉండండి'' అని శపించింది.
తత్కారణంగా దేవతలు అంతా వృక్షాలుగా పరిణమించవలసివచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పలాసవృక్షంగా, విష్ణువు అశ్వత్థంగా, శివుడు వటముగా మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావిచెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారంనాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాల్లో రావిచెట్టును తాకరాదు...'' అంటూ చెప్పడం ఆపాడు సూతుడు.
Karthika Puranam is the largest of all 18 Puranas, Karthika Puranam and 7 Parts, Karthika Puranam and 30 Chapters, Holy Epic Karthika Puranam, Karthika Puran explains Karthika Vratam