కార్తీకదీపం విశిష్టత, దానివెనుక రహస్యం!!

 

కార్తీకమాసం వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు దీపాల సందడి మాములే. అయితే సాధారణ సమయాల్లో ఇంట్లో దేవుడి గది లేదా దేవుడి పటాల ముందు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపం తప్పనిసరిగా పెడతారు అందరూ. ఏదైనా కారణం చేత అలా దీపం పెట్టలేకపోతే అది ఎంతో అరిష్టంగా భావిస్తారు. గృహప్రవేశం లేదా ఇంట్లో పాలు పొంగించి చేరినతరువాత ఆ ఇంటికి సకలదేవతలను ఆహ్వానించినట్టే. ఇంట్లో ఉదయ, సాయంకాలాల్లో పెట్టె దీపం ఆ దేవతలకు ఆహ్వానమని దీపం వెలిగే ఇంటిని ఆ దేవతలు సందర్శిస్తారని పురాణ కథనాలు ఉన్నాయి. 

అయితే ఏదైనా కారణం చేత ఇంట్లో దీపం పెట్టలేకపోయినా, ఎక్కడికైనా వేరే ఊర్లకు  వెళ్లాలన్నా అలా చేసేముందు నమ్మకం ఉన్న ఎవరో ఒకరికి చెప్పి ఇంట్లో దీపం పెట్టమని అడగాలి. ఒకవేళ అలా చేయకపోతే ఆ ఇంటికి  దేవతల దర్శనం క్రమంగా తగ్గిపోతుంది. ఆ ఇంట్లో దారిద్య్రం మొదలవుతుంది.

అలాంటి సమస్యలకు అన్నిటికి పరిష్కారమే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం. ఏదైనా కారణం చేత ఇంట్లో దీపాలు పెట్టలేకపోయినవాళ్ళు 365 వత్తులు గుత్తిగా చేసి దాన్ని పెద్ద ప్రమిధలో వేసి దీపం పెడతారు. దీని వల్ల ఆ సంవత్సర కాలంలో ఇంట్లో దీపం పెట్టలేకపోయిన సందర్భాలు ఏవైనా ఉంటే ఆ రోజుల అపరాధం మొత్తం కార్తీక దీపం వల్ల సమసిపోతుంది. 

అంతేకాదు దీపం వెలగని ఇల్లు దయ్యాల కొంపతో సమానం. అక్కడ నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. చేసిన తప్పులు గురించి మనకు మళ్ళీ మళ్ళీ లెక్కబెట్టుకొనవసరం లేకుండా ప్రాయాశ్చిత్తంగా 365 వత్తులు వెలిగిస్తారు. ఇది కేవలం శివాలయంలో కాకుండా ఇంటిలో కూడా దేవుడి గదిలో  వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. అలాగే తులసి చెట్టు ఉన్న ఇంట్లో తులసి ముందు దీపం వెలగకపోవడం కూడా ఎంతో దరిద్రానికి దారి తీస్తుంది. ఈ పాపాలను అన్నిటినీ పోగొట్టేదే కార్తీకదీపం.

ఇక్కడ ఇంకొక విషయం. ప్రతి ఇంటికి ఇంటి పెద్ద ఉంటారు. ఈ కార్తీకదీపాన్ని ఇంటి పెద్ద వెలిగిస్తేనే దానికి సంపూర్ణ పలితం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు వెలిగిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు టీవీ లు చూసుకుంటూ, మొబైల్స్ లో మునిగిపోయి ముఖ్యంగా ఇంటి యజమాని తనపని తాను చేసుకుంటూ ఉండటం సరికాదు. ఇంటి యజమాని డీఎం వెలిగిస్తే దేవతలకు ఆహ్వానం పలికినట్టు, సమస్త భూతాలకు సమాధానం చెప్పినట్టు, దిక్కులకు మొక్కులు తీర్చుకున్నట్టు. చాలామంది మగవాళ్ళు దీపం పెట్టడానికి మొహమాట పడటం లేదా ఆసక్తి చూపించకపోవడం చేస్తారు. ఇది చాలా తప్పు. దేవుడి గదిలో దీపం వెలిగించడానికి మహా అయితే అయిదు నిమిషాల సమయం పడుతుంది అంతే. కానీ ఆ పని జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. దీపం పెట్టేటప్పుడు కలిగే స్పందనలు, వైబ్రేషన్స్ మనిషిని మానసికంగా దృఢంగా చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపుపొందించి ఏకాగ్రత పెంచుతుంది. అలాంటి దీపారాధన పలితాన్ని మరెన్నో రెట్లు పొందడానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశమే కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించడం.

కాబట్టి ఎంత దీపాలు పెడతారో అంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుని దీపం పెట్టాలి.. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదు. మొత్తం జనంతో నిండిపోతుంటారుం కొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. దాని అర్థం తాను జ్యోతి అయినా తనను వెలిగించే జ్యోతి ఆ పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నదని భావన కావచ్చు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి.

అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.

అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాకుండా, మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని(చీకటిని) పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులను ఉద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు. 

◆ వెంకటేష్ పువ్వాడ


More Karthikamasa Vaibhavam