శివుడి కృపకు గొప్ప మార్గం కార్తీకపౌర్ణమి!!
ప్రతి నెలలోనూ పౌర్ణమి అమావాస్య రెండూ వస్తాయి. ఏ నెలలో వచ్చినా అమావాస్యను కాస్త చెడు దృష్టితో చూస్తారు. కానీ దీపావళి నాటి అమావాస్య మాత్రం సంబరమే సంబరం. ఇక గురు పౌర్ణమి, మాఘ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ఇలా ప్రతి మాసంలో పౌర్ణమికి ప్రాధాన్యత ఉన్నా కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఆ నిండు చంద్రుడితో పోటీ పడుతూ శివాలయాలు, దేవాలయాలలో, ఇంటింటి ముంగిట్లో వెలిగే దీపాలు క్రొత్తదనాన్ని తీసుకొస్తాయి.
అయితే చాలామంది శివాలయం కు వెళ్లి దీపాలు వెలిగించి శివుడి దర్శనం చేసుకోవడంతో ఎంతో తృప్తి పడిపోతారు. కానీ ఆ దీపారాధన కూడా ఇంకా గొప్పగా ఉండటానికి, ఇంకా ఎన్నో రెట్లు మంచి పలితాన్ని ఇచ్చేలా చేసుకోవచ్చు.
శివుడు జ్ఞానానికి ప్రతీక, ఆత్మ స్వరూపాన్ని తెలిపేవాడు. ఆయన సమక్షంలో దీపం వెలిగించడం అంటే మనిషి తనలో ఉన్న జ్ఞానాన్ని ఆ దేవుడి ముందు అర్పించడం. అలా అర్పించినపుడు ఆ జ్ఞానదీపానికి శక్తిని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. సాధారణ వత్తులకన్నా రకరకాలుగా అంటే 11 వత్తులు, 41 వత్తులు, 108 వత్తులు, 365 వత్తులు ఇలా రకరకాలుగా వత్తులు సమకూర్చుకుని ఆ శివుడి సన్నిధిలో దీపాలు వెలిగిస్తారు చాలామంది.
దీపారాధనకు ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టం. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఆవు నెయ్యి మండటం వల్ల వెలువడే పొగ వాతావరణ కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది. వత్తులు కూడా పత్తిని సన్నని పోరలుగా తీసి, వాటిని చుడుతూ దాదాపు పొగులుపోగులుగా అనేక సంఖ్యలో వత్తులు తయారుచేసుకుని దీపాలు పెట్టేవాళ్లు ఉన్నారు.
ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె శ్రేష్టం. నువ్వులు ఎంతో పవిత్రమైనవి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ప్రమిదలకు బదులుగా రసం తీసేసిన నిమ్మచెక్కల్లోనూ, బియ్యం పిండితో ప్రమిధలు తయారుచేసి వాటిలోనూ, ఉసిరికాయలలోనూ వత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. పౌర్ణమి రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలసి శివాలయంలోనే ఉంటాడని ఆరోజు వెలిగించే దీపాల వెనుక పుణ్యఫలానికి అదే ప్రత్యేకత అని పండితుల మాట.
సాగరమధనంలో ఉద్భవించిన ఉసిరికాయలో దీపం, ఉసిరిచెట్టు భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం, శివుడి అనుగ్రహం లభిస్తాయి. మనిషి శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ గుణాలను సమతుల్యంలో ఉంచేది ఉసిరి. అలాంటి ఉసిరి దీపం వల్ల వాతావరణం కూడా ఎంతో శుద్ధి అవుతుంది.
శివ అష్టోత్తరం, శివుని ప్రణవ పంచాక్షరీ, దీపారాధన, ఇంకా ఆరోజు శక్తికొద్ది బీదవాళ్లకు, బ్రాహ్మణులకు అన్న, వస్త్రాలు, స్వయంపాకం, ఉసిరికాయలు దానం ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు కార్తీక పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం వల్ల అటు పరమేశ్వరుడిని, ఇటు ఆ శ్రీమన్నారాయణుడిని, మరోవైపు శక్తి స్వరూపిణీ అని లలితాదేవి కృపను ఇలా మూడింటిని మాత్రమే కాకుండా ముక్కోటి దేవతలు సంతోషపెట్టిన భాగ్యం దక్కుతుంది.
నదీ దీపాల విశిష్టత కూడా ఎంతో గొప్పది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు అరటి దొన్నెలో కానీ విస్తరాకుల దొప్పలో కానీ దీపాలు వెలిగించి వాటిని నీటిలో అంటే దగ్గరలో ఉన్న నదులు, చెరువులు నీటి పాయలు వంటి వాటిలో వదలడం వల్ల చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది.
ఇంకా అనువుగా ఉన్న వారు పౌర్ణమి నాడు ఉదయం నదీ స్నానం, సముద్ర స్నానం చేసిన తరువాత ఆ శివుడి పూజ దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు నశిస్తాయి.
కార్తీక మాసంలో రోజూ దీపారాధన చేసే అవకాశం దొరకనివాళ్ళు పౌర్ణమినాడు చేసే దీపారాధన, మంత్రం జపం, దానం, పూజ మొదలైన వాటి మాసం మొత్తం పూజ చేసినంత ఫలం కలుగుతుంది.
◆ వెంకటేష్ పువ్వాడ