కార్తీకమాసంలో ముప్పై రోజుల ప్రణాళిక!!
కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో చాలామంది వారికి చేతనైనట్టు ఉపవాసాలు, దానాలు, మంత్ర జపాలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీకమాసం ముప్పై రోజులూ శివుడిని పూజించినా ప్రత్యేకంగా ఒక అధిదేవత ఉంటారు. ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి, ఏ ఆహరం తీసుకోవాలి, ఏ మంత్రాన్ని చెప్పుకోవాలి అనేది తెలుసుకుని పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. .
మొదటి రోజు
తినకూడదని పదార్థాలు: ఉల్లిపాయ,ఉసిరి, రాత్రిమిగిలిన పదార్థాలు, ఒకరు తినగా మిగిలినవి. చల్లని పదార్థాలు తినకూడదు.
మొదటిరోజు నెయ్యి, లేదా బంగారం దానం చేస్తే మంచిది. (ఆర్థిక స్థోమతను బట్టి నిర్ణయించుకోవచ్చు)
స్వథా అగ్నిని పూజించాలి, అలాగే "ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా" అనే మంత్రాన్ని చెప్పుకోవాలి.
రెండవ రోజు
తరగినవి ఏమీ తినకూడదు. సాదారణంగా వంటకు కూరగాయలు కత్తితో తిరుగుతారు. ఇలాంటివి రెండవరోజు నిషిద్ధం.
కలువపూలు, నూనె, ఉప్పు మొదలైనవి రెండవరోజు దానం చేయవచ్చు.
బ్రహ్మను పూజించాలి. "ఓం గీష్పతయే - విరించియే స్వాహా" అనే మంత్రాన్ని చెప్పుకోవాలి.
మూడవ రోజు
ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు. అలాగే ఉసిరికాయ కూడా తినకూడదు. ఉప్పును దానంగా ఇవ్వాలి.
పార్వతి దేవిని పూజించాలి. "ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
నాలుగవ రోజు
వంకాయ, ఉసిరికాయ మొదలైనవి తినకూడదు.
నూనె, పెసరపప్పు దానంగా ఇవ్వాలి.
వినాయకుడిని పూజించాలి. "ఓం గం గణపతయే స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
అయిదవ రోజు
పులుపుతో కూడిన ఆహారపదార్థాలు తినకూడదు. ఒక మనిషి భోజనం వండుకోవడానికి తగిన ఉప్పు, పప్పు, కూరగాయలు వంటివన్నీ దానంగా ఇవ్వాలి. దీన్నే స్వయం పాకం అంటారు. అలాగే విసనకర్ర దానం చేయాలి.
ఆదిశేషుడిని పూజించాలి. ఈయనకు ప్రేత్యేకంగా మంత్రం అంటూ ఉండదు. అదిశేషుడి శ్వాశనే మంత్రంగా ఆయన్ను మనసులో నిముపుకుని ప్రాణాయామాన్ని చేయాలి. ఇంకా ఆ శ్రీహరికి ఎంతో ప్రియమైనవాడు కాబట్టి ఆయన్ను స్మరించాలి.
ఆరవ రోజు
ఇష్టమైన పదార్థాలను తినకూడదు. అలాగే ఉసిరి కూడా తినకూడదు.
నువ్వులు, బెల్లంతో తయారుచేసిన చిమ్మిలిని దానంగా ఇవ్వాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. "ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఏడవ రోజు
పండ్లతో నమిలి తినే వస్తువులు ఈరోజు వదిలేయాలి. అంటే ద్రవపదార్థాలు తీసుకోవచ్చు. అలాగే ఉసిరికాయను తినకూడదు.
పట్టుబట్టలు, గోధుమలు, బంగారం మొదలైనవి ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలి. సూర్యుడిని పూజించాలి. "ఓం. భాం. భానవే స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఎనిమిదవ రోజు
ఉల్లిపాయ ఉసిరికాయ తినకూడదు.
ఆర్థికశక్తి కొద్దీ తోచినవి ఏవైనా దానం చేయచ్చు.
దుర్గా దేవిని పూజించాలి. "ఓం - చాముండాయై విచ్చే - స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
తొమ్మిదవ రోజు
నూనెతో తయారుచేసిన పదార్థాలను తినకూడదు. అలాగే ఉసిరికాయ తినకూడదు.
ఇష్టమైనవి ఏవైనా దానం చేయవచ్చు. అలాగే పితృ తర్పణలు చేయడం మంచిది.
అష్టవసువులను పూజించాలి. అలాగే చనిపోయిన పెద్దలను, తల్లిదండ్రులను పూజించాలి. (పితృదేవతలను) "ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః" అనే మంత్రాన్ని జపించాలి.
పదవ రోజు
గుమ్మడికాయ, నూనె, ఉసిరికాయ తినకూడదు,
గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె దానం ఇవ్వాలి.
దిగ్గజాలను పూజించాలి. "ఓం మహామదేభాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పదకొండవ రోజు
పులుపు, ఉసిరి పదార్థాలు తినకూడదు. వీభూదిపండ్లు, దక్షిణ(డబ్బులు ఎంతైనా) దానం ఇవ్వాలి.
శివుడిని పూజించాలి. "ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ" అనే మంత్రం జపించాలి.
పన్నెండవ రోజు
ఉప్పు, పులుపు, కారం, ఉసిరి తినకూడదు.
పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ దానం ఇవ్వాలి.
భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడిని పూజించాలి. "ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పదమూడవ రోజు
రాత్రి భోజనం చేయకూడదు. ఉసిరికాయ తినకూడదు.
మల్లె, జాజి వంటి పువ్వులు దానం ఇవ్వాలి. వనభోజనం చేయాలి.
మన్మధుడుని పూజించాలి. "ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పదునాలుగవ రోజు
ఇష్టమైన వస్తువులు తినకూడదు, ఉసిరికాయ కూడా.
నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె ఆర్థికస్థితిని బట్టి దానం చేయాలి.
యముడిని పూజించాలి. "ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పధహైదవ రోజు
తరగబడిన వస్తువులు తినకూడదు, కలువపూలు, నూనె, ఉప్పు దానం ఇవ్వాలి.
దామోదరుడిని పూజించాలి. "'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః" అనే మంత్రం జపించాలి.
పదహరవ రోజు
ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల(మజ్జిగ) తినకూడదు.
నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం దానం చేయాలి.
స్వాహా అగ్నిని పూజించాలి. "ఓం స్వాహాపతయే జాతవేదసే నమః" అనే మంత్రం జపించాలి.
పదిహేడవ రోజు
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు తినకూడదు, ఔషధాలు, ధనం దానం ఇవ్వాలి.
అశ్వినీ దేవతలను పూజించాలి. "ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా" అనే మంత్రం జపించాలి.
పద్దెనిమిధవ రోజు
ఉసిరికాయ తినకూడదు.
పులిహార, అట్లు, బెల్లం దానం చేయాలి.
గౌరి దేవిని పూజించాలి. "ఓం గగగగ గౌర్త్యె స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పంతొమ్మిదవ రోజు
నెయ్యి, నూనె, మైధునం, ఉసిరి తినకూడదు.
నువ్వులు, కుడుములు దానం ఇవ్వాలి.
వినాయకుడిని పూజించాలి. "ఓం గం గణపతయే స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవయ్యవ రోజు
పాలు తప్ప మిగిలినవి ఏవీ తీసుకోకూడదు. గోదానం,భూదానం సువర్ణ దానాలు ఇవ్వాలి(ఆర్థికస్థితిని బట్టి)
నాగేంద్రుడిని పూజించాలి. "ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం" అనే మంత్రం జపించాలి.
ఇరవై ఒకటవరోజు
ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం తినకూడదు. శక్తికొద్దీ ఏ దానం అయినా చేయచ్చు. కుమారస్వామిని పూజించాలి. "ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై రెండవరోజు
నమిలితినే పదార్ధాలు, ఉసిరి తినకూడదు.
బంగారం, గోధుమలు, పట్టుబట్టలు దానం చేయవచ్చు
సూర్యుడిని పూజించాలి. "ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై మూడవరోజు
ఉసిరి, తులసి తీసుకోకూడదు.
మంగళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి.
అష్టమాతృకలను పూజించాలి. "ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై నాలుగవ రోజు
మైధునం ఉసిరి తీసుకోకూడదు.
ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు దానం ఇవ్వాలి.
శ్రీ దుర్గను పూజించాలి. "ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై అయిదవరోజు
పులుపు, చారు మొదలైన ద్రవపదార్ధాలు తినకూడదు.
శక్తికొద్ది దానం చేయాలి.
దిక్పాలకులను పూజించాలి. "ఓం ఈశావాస్యాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై ఆరవరోజు
ఏమితినకూడదు. సంపూర్ణ ఉపవాసం ఉండాలి.
నిలవవుండే సరుకులు ఏవైనా దానం చేయాలి.
కుబేరుడిని పూజించాలి. "ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై ఎడవరోజు
ఉల్లి, ఉసిరి, వంకాయ తినకూడదు.
ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు దానం చేయాలి.
కార్తీక దామోదరుడిని పూజించాలి. "ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా" ఆమె మంత్రాన్ని జపించాలి.
ఇరవై ఎనిమిధవరోజు
ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ తినకూడదు. నువ్వులు, ఉసిరి దానం చేయాలి.
ధర్ముడిని పూజించాలి. " ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
ఇరవై తొమ్మిదవరోజు
పగటిపూట ఏమి తినకూడదు. ఉసిరి అసలు తినకూడదు.
శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం దానం ఇవ్వాలి.
శివుడు (మృత్యుంజయుడు)డిని పూజించాలి. "ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్" అనే మృత్యుంజయ మంత్రం జపించాలి.
ముప్పయ్యవ రోజు
పగటిపూట ఏమి తినకూడదు.
నువ్వులు, తర్పణలు, ఉసిరి దానం ఇవ్వాలి.
దేవతలను అందరినీ పూజించాలి., పితృ దేవతలును కూడా. "ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః" అనే మంత్రాన్ని జపించాలి.
ముఖ్యంగా కార్తీకమాసంలో అబద్ధాలు చెప్పడం, ఒకరిని తిట్టడం, చెడు పనులు చేయడం మానుకోవాలి. మాంసాహారం, మద్యం సేవించడం వదిలిపెట్టాలి.
◆ వెంకటేష్ పువ్వాడ