ఇదీ ఉగాది ప్రత్యేకత!

హిందువుల పండుగల్లో… ఓ ప్రత్యేకమైన దైవాన్ని తలుచుకునే పండుగలు కొన్నయితే, కాలానికి అనుగుణంగా జరుపుకొనే పండుగలు మరికొన్ని. ఇలాంటివాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఉగాదినే. ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడుతూ, ప్రకృతిని గమనించుకుంటూ సాగిన మన పెద్దలకు, ఉగాది పెద్ద పండుగే! ఎందుకంటే ఆకురాలు కాలం ముగిసి… వసంతరుతువు మొదలయ్యే సమయం ఇది.

ఉగాది అన్న పదాన్ని యుగాదిగా చెప్పుకోవడం ఉంది. ఉగ అన్న మాటకు నక్షత్ర గమనం అన్న అర్థం కూడా ఉంది కాబట్టి… అలా చూసినా సరికొత్త కాలం మొదలయ్యే సమయంగానూ చెప్పుకోవచ్చు. వ్యవసాయపరంగా… పొలం పనులను ఆరంభించే సమయం ఇది. కోతలు పూర్తయి ఎండిన పొలాన్ని తిరిగి తొలకరికి అనువుగా సిద్ధం చేసుకునేవాళ్లు. అందుకే ఈ రోజు నాగలి పూజ, గాడి పూజ చేసి అరకు కట్టే ఆచారం ఉంది.

ఉగాది పచ్చడిలో కనిపించే షడ్రుచులూ… జీవితంలో కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి అనే సూచనతో పాటుగా… ప్రకృతి పరంగా ఆ కాలంలో వేప చిగుళ్లు, మామిడి ముక్కలను ప్రసాదంగా మార్చడం కనిపిస్తుంది. సాధారణంగా మనకు లభించినదాన్ని భగవదార్పితం చేసి స్వీకరిస్తాం. అలా ఈ సరికొత్త సృష్టి సైతం ఆయన దయ అన్న కృతజ్ఞత ఇందులో స్పష్టం అవుతుంది.

ఉగాది నుంచి వేసవి మొదలవుతుంది. సంక్రాంతికి అందిన డబ్బు నిదానం వ్యవసాయం మీద పెట్టుబడికి మళ్లుతుంది. అందుకే ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు… మరుసటి ఉగాదికల్లా పెళ్లికూతురికి కావల్సిన సారె పంపించేయాలని పెద్దలు చెప్పేవాళ్లు. తన కొత్త కాపురానికి అవసరమయ్యే పాత్రలు, వస్తువులు ఇలా ఉగాదిలోగా పంపడాన్ని ఉగాదిసారెగా పేర్కొంటారు.

మొత్తానికి ఉగాది తెలుగువారికి ఓ కొత్త సంవత్సరం. ఆ మాటకు వస్తే కన్నడిగులు, మరాఠీలకు కూడా ఈ రోజే నూతన సంవత్సరం. తమిళనాడు నుంచి మణిపూర్‌ వరకు కొంచెం అటూఇటూగా ఇదే మాసంలో ఉగాది వస్తుంది. ఉగాది రోజున సృష్టి ఆరంభం జరిగిందన్న మాట ఓ నమ్మకమే అయినా… ఆ రోజు నుంచి ప్రకృతి సరికొత్త జీవంతో తొణికిసలాడుతుందన్నది మాత్రం వాస్తవమే! అందుకే ఉగాదిని ఓ వ్యవసాయ ఆధారిత పండుగగానే కాకుండా… సరికొత్త జీవితాన్ని ఆరంభించే శుభ సమయంగానూ భావిస్తారు.

- నిర్జర.


More Ugadi