మరణించిన తరువాత మృతదేహం నోట్లో తులసి తీర్థం లేదా గంగాజలం పోస్తారు ఎందుకంటే..!
.webp)
భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచి పెట్టి వెళ్ళాలి. ఇది మరణం ద్వారా జరుగుతుంది. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక అనివార్యమైన విషయం. అన్ని మతాలలో మరణం తర్వాత కూడా అనేక సంప్రదాయాలు పాటిస్తారు. హిందూ మతంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి అతని మరణం వరకు అనేక ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఈ ఆచారాలలో దేని కారణం దానికి ఉంది. మరణం తర్వాత కొన్ని ఆచారాలు తప్పనిసరిగా పాటిస్తారు. వాటిలో ఒకటి మరణించిన వ్యక్తి లేదగా అవసాన దశలో ఉన్న వ్యక్తి నోటిలో తులసి తీర్థం లేదా గంగా జలం వేయడం. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటే..
గంగా జలం పవిత్రతకు చిహ్నం.
ఏదైనా పూజ సమయంలో పూజా వస్తువులపై, భక్తులపై నీటిని చల్లి వాటిని శుద్ధి చేస్తారు. హిందూ మతంలో ఇలా పూజలు జరిగేటప్పుడు ఆ నీటిలోకి గంగా దేవిని ఆవాహన చేస్తారు. ఈ గంగా జలాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇది అమృతంతో సమానమని కూడా చెబుతారు. గంగా నదిని "స్వర్గ నది" అని కూడా పిలుస్తారు. అంటే గంగానది స్వర్గం నుండి ఈ భూమి మీదకు వచ్చిందని అర్థం. దీనిలో స్నానం చేయడం వల్ల వ్యక్తి అన్ని పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఇది విష్ణువు పాదాల నుండి ఉద్భవించి శివుని జటాజూటంలో నివాసం ఉంటుంది. భగీరధుడు తన పూర్వీకుల పాపాలను కడగడానికి గంగను భూమికి తీసుకువచ్చాడు. పాపాలను కడిగే సామర్థ్యం ఉన్నందున, మరణ సమయంలో గంగా జలాన్ని నోటిలో పోస్తారు. ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళినప్పుడు చాలా బాధపడవలసి ఉంటుంది. చనిపోయిన వ్యక్తి నోటిలో గంగా జలాన్ని పోయడం ద్వారా, ఆ వ్యక్తి మరణం తర్వాత ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకపోవచ్చని చెబుతారు. ఇది ఆత్మ తదుపరి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
మోక్షాన్ని ఇచ్చే తులసి ఆకులు..
తులసి విష్ణువుతో సంబంధం కలిగి ఉంది. అందుకే ఆత్మకు శాంతిని, మోక్షాన్ని ఇవ్వడానికి మరణించిన వ్యక్తి నోటిలో తులసి ఆకును, తులసి తీర్థాన్ని పోస్తారు. మరణించిన వ్యక్తి నోటిలో తులసి ఆకులను ఉంచడం ద్వారా యమ ధర్మరాజు ఎటువంటి హాని కలిగించడు అని చెబుతారు. మరణం తరువాత ఆ వ్యక్తి యముడి శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కూడా చెబుతారు. ఈ కారణంగా తులసి ఆకులను , తులసి తీర్థాన్ని మరణించిన వ్యక్తి నోటిలో ఉంచుతారు. ఇది మోక్షాన్ని ఇస్తుంది. మరణించిన వ్యక్తి నోటిలో తులసి, గంగా జలాన్ని ఉంచడం ద్వారా, యముడు వారిని నేరుగా స్వరానికి తీసుకెళ్తాడని చెబుతారు. విష్ణువు తన నుదిటిపై తులసి ఆకులను ధరించేవాడట. అలా చేయడం ద్వారా, మరణించిన వ్యక్తి విష్ణువుకు ప్రియమైనవాడు అవుతాడట. తులసి ఆకులను మరణించిన వ్యక్తిపై ఉంచితే వారి ఆత్మ శాంతిని పొందుతుంది. అందుకే తులసి ఆకులు, గంగా జలాన్ని మరణించిన వ్యక్తి నోటిలో ఉంచుతారు.
*రూపశ్రీ.



