వీధి వీధినా వినాయకుడే...
సాధారణంగా ఏ పండుగ వచ్చినా.., ఆ పండుగ వాతావరణం ఆ రోజుకే పరిమితమై ఉండుంది. కానీ.., కొన్ని పండుగల సందడి వారం రోజుల ముందునుంచే మొదలై, పండుగ వెళ్లిన పది రోజులదాకా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి పండుగల్లో మొదటిది వినాయకచవితి, రెండవది విజయదశమి (దసరా) మూడవది శ్రీరామనవమి.ఆబాల గోపాలం కలిసి, చందాలు వసూలు చేసి, సామూహికంగా జరుపుకునే పండుగలు ఈ మూడే. అయితే, ఈ మూడు పండుగల్లో మరింత ప్రత్యేకత గల పండుగ ‘వినాయకచవితి’. ఎందుకంటే..వారంరోజుల ముందునుంచే వివిధ రూపాల్లో, వివిధ పరిమాణాల్లో, వీధివీధినా కొలువుతీరి వుంటాడు వినాయకుడు.
పత్రికై పిల్లల పరుగులు
‘ఒరేయ్...ఇంకా పడుక్కునే ఉన్నార్రా..తెల్లారితే వినాయకచవితి పండుగరా...వెళ్ళి పత్రి తీసుకురార్రా’ అని తాతయ్యలు అరుస్తూంటే.., మంచాలమీంచి దుమికి, ఉరుకులు పరుగులుగా వీధుల్లోకి పరుగులెత్తే మనుమల సందడి మాటల్లో వర్ణించలేము. (ఇప్పుడా సందడి లేదు లెండి. అవన్నీ నా చిన్నతనంలోనే. కంప్యూటర్ కాలం కదా.. అంతా మారిపోయింది.) అయితే.., పందిర్లు వేయడంలోనూ, వినాయకుని బొమ్మలు తీసుకుని రావడంలోనూ ఇంకా ఆ సందడి కనిపిస్తున్నందుకు సంతోషించాల్సిందే.
‘గరికె’ అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం?
గరికెను.., సంస్కృతంలో ‘దూర్వాయుగ్మం’అంటారు. గరికె.., ‘దర్భల’ జాతికి చెందిన మొక్క. ‘దర్భలు’ శ్రీ మహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయి. పైగా అమృత స్పర్శకు నోచుకోబడ్డాయి. అందుకే అవి అతి పవిత్రాలు. ఆ జాతికి చెందిన ‘గరికె’ కూడా దర్భలవలె పవిత్రమైనవి. అంతేకాక, గడ్డిపూలు ఉన్నాయి గానీ...‘గరికె’ పూవులు పూయదు. ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ‘గరికె’కు లేదు. అవి స్వయంభువాలు. కనుక., సంపర్క దోషం లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడుగా జన్మించిన వినాయకునికి ‘గరికె’ అంత ఇష్టం. అందుకే ఆయన ‘దూర్వాయుగ్మ’ పూజను పరమ ప్రీతిగా స్వీకరిస్తాడు.
‘తెల్ల జిల్లేడు’కు ఎందుకంత పవిత్రత?
‘మారేడుచెట్టు’..........శివుని
‘రావిచెట్టు’..............శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం.
‘తులసిమొక్క’..........శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం.
‘వేపచెట్టు’...............మహాశక్తికి ప్రతిరూపం. అలాగే -
‘తెల్లజిల్లేడుమొక్క’.......సాక్షాత్తు వినాయకునికి ప్రతిరూపం. ఎందుకంటే -
వంద సంవత్సరాలు బ్రతికిన తెల్లజిల్లేడుమొక్క.., వినాయకుని ఆకృతిని సంతరించుకుంటుంది. అలాంటి మొక్కలో.., వినాయకుడు శాశ్వతంగా నివసిస్తాడు.
అట్టి వినాయకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధస్తాయి. అందుకే తెల్లజిల్లేడుమొక్కకు అంత పవిత్రత..,విశిష్టత.
‘పాలవెల్లి’ ఎందుకు కట్టాలి?
‘పాలవెల్లి’...‘పాలపుంత’...అంతరిక్షంలోని గ్రహ, నక్షత్ర సముదాయానికి పర్యాయ పదాలు. దానికి ప్రతిరూపమే ఈ ‘పాలవెల్లి’. అంతరిక్షంలో వ్రేలాడే గ్రహ, నక్షత్రాలే.., మనం పాలవెల్లికి కట్టే రకరకాల ఫలాలు, పుష్పాలు. సమస్త సృష్టికీ ఈ ఆదిదేవుడే అధినాయకుడు అని చెప్పడానికే మనం ‘పాలవెల్లి’ని కడతాం.