ఏరువాక పౌర్ణమి రోజు ఎన్ని ప్రత్యేకతలో!

చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించే సమయం జ్యేష్ఠ మాసం. చైత్రమాసం నుంచి మొదలయ్యే మన సంవత్సరంలో మూడవ నెల మాత్రమే కాదు… త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవునికి ఈ మాసం అత్యంత ప్రీతికరం అని చెబుతారు. బ్రహ్మ అంటేనే సృష్టికి అధిపతి. జ్యేష్ఠమాసంలోనూ తొలకరితొ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ చతుర్ముఖునికి ఈ కాలం ఇష్టసమయం కావడంలో ఆశ్చర్యం లేదు.

ఇక జ్యేష్ఠమాసం అనగానే ఏరువాక పున్నమి గుర్తుకువస్తుంది. ఆ సమయానికి రుతుపవనాలు బలపడి, వర్షాలు మొదలవుతాయి. దుక్కిదున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకేసారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమపద్ధతిలో ఉంటుంది. అందుకోసమే… జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను మొదలుపెట్టాలని సూచించి ఉంటారు మన పెద్దలు. ఒక రకంగా ఇది వ్యవసాయానికి ఉగాదిలాంటిది. కర్షకులకు క్యాలెండర్‌ ఇది!

ఏరువాక అంటేనే దుక్కి మొదలుపెట్టడం అని అర్థం. ఈ ప్రత్యేకమైన రోజును ఓ వేడుకలా నిర్వహిస్తారు రైతులు. ఎద్దులను శుభ్రం చేసి, వాటిని చక్కగా అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యంగా పెడతారు. మరో విశేషం ఏమిటంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఎద్దులతో తొలి దుక్కి దున్నించడంతో పాటు.. ఆ సమయంలో, తాము కూడా కాడి పడతారు రైతులు. తమ కష్టసుఖాలలో తోడుండే మూగజీవుల పట్ల తమ గౌరవాన్ని తెలియచేసే ఆచారమది!

ఏరువాక పున్నమికి పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ఓ విశేషం ఉంది. ఆ రోజు ఆలయంలోని జగన్నాథ, సుభద్ర, బలరాములకు స్నానం చేయించి… వారిని పదిహేను రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. రైతులు ఈ సమయంలో తీర్థయాత్రలు కూడా మానుకుని, శ్రద్ధగా పొలంపనులు చేసుకోవాలనే సూచన ఇందులో ఉండిఉండవచ్చు. రుతువు మారిన క్రమంలో ఆరోగ్యాన్ని గమనించుకోవాలనే హెచ్చరిక కూడా కావచ్చు!

ఏరువాక పున్నమి రోజున వటసావిత్ర వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. మహిళలకు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వత్రాలతో పాటు ఈ వటసావిత్రి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఇస్తారు. వటవృక్షం అంటే మర్రిచెట్టు! దాన్ని త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ రోజున ఆ వటవృక్షాన్ని పసుపు, కుంకుమలతో పూజిస్తారు. దాని చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ, దారం చుడతారు. ఇలా చేస్తే… భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందనీ, ఇద్దరూ దీర్ఘాయుష్షుతో ఉండేలా త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయనీ వారి నమ్మకం!


More Others