చాతుర్మాస వ్రతం ఇలా చేస్తారు!
ఆషాఢమాసంలో వచ్చే తొలిఏకాదశినాడు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రకు ఉపక్రమిస్తాడట. అందుకని ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అప్పటి నుంచి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు ఆయన మేల్కొంటాడని చెబుతారు. ఈ నాలుగునెలలపాటు చాతుర్మాస వ్రతాన్ని పాటించే ఆచారం ఉంది. ఆ ఆచారం వెనుక ఓ కారణం లేకపోలేదు. భౌతిక రీత్యా ఈ నాలుగు మాసాలలో మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. ఒక పక్క నుంచి వర్షాలు, మరో పక్క పెరిగిపోతున్న రాత్రివేళలు, ఇంకో వైపు ఉధృతంగా సాగే పొలం పనులు... దాంతో మానసికంగా, శారీరకంగా మనం నీరిసించిపోతాము. పైగా రాత్రివేళలు పెరగడం అంటే చంద్రుని ప్రభావం మన మీద అధికంగా ఉండటమే! జాతకరీత్యా చంద్రుడు మనఃకారకుడు కదా! ఇలాంటి పరిస్థితుల మధ్య ఉపవాసం, జాగరణ, భగవన్నామస్మరణ... వంటి ఆయుధాలతో అటు మనసునీ, ఇటు శరీరాన్నీ దృఢంగా ఉంచే సాధనమే చాతుర్మాసవ్రతం.
చాతరుర్మాసవ్రత కాలంలో వచ్చే ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండటమే కాకుండా... ఒకో మాసంలో ఒకో రకమైన ఆహారాన్ని విసర్జించాలని చెబుతారు పెద్దలు. శ్రావణమాసంలో కొన్ని రకాలైన కూరలు; భాద్రపదంలో పెరుగు; ఆశ్వయుజంలో పాలు; కార్తికంలో పెసలు, మినుములు వంటి పదార్థాలను తినవద్దని సూచిస్తారు. ఆయా నెలలలో మన శరీరంలో ఏర్పడే పిత్త, వాత, కఫ సంబంధమైన దోషాలను పరిహరించేందుకు ఈ నియమాలను ఏర్పరిచి ఉంటారు.
ఈ చాతుర్మాసవ్రతం మనకే కాదు, యతులకు కూడా ముఖ్యమైన ఆచారమే! ఈ నాలుగుమాసాలపాటు వారు ఎటువంటి ప్రయాణాలూ సాగించకుండా, ఒకచోట స్థిరంగా ఉండి భక్తులకు బోధ చేస్తుంటారు. దీని వెనుకా ఒక భౌతిక కారణం లేకపోలేపోదు. యతులు సాధారణంగా పర్వతాలు, అడవులలోనే కదా సంచరించేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, వాగువంకలు పొంగిపొరలడం సహజం. ఈ కాలంలో ప్రయాణం ప్రాణాంతకం! కాబట్టి ఒకచోట స్థిరంగా ఉండి తపస్సుని ఆచరించుకోవడం కోసం వారికి చాతుర్మాసవ్రతాన్ని సూచించి ఉంటారు. పైగా ఈ సమయంలో తమ ఊరిగుండా వెళ్లే యతులను కలిసి, వారిని సేవించి, ఆతిథ్యాన్ని అందించి... వారి నుంచి నాలుగు మంచిమాటలు వినే భాగ్యమూ సామాన్యులకు కలుగుతుంది.
- నిర్జర.