భీమశంకర జ్యోతిర్లింగం ఎలా వెలసింది?

పూర్వకాలంలో సహ్యాద్రి మీద 'భీముడు' అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు 'కర్కటి'. ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో 'అమ్మా! నా తండ్రి ఎవరు?' అని అడిగాడు. దానికి ఆ రక్కసి "నాయనా 'కర్కటుడు' అనే రాక్షసుడు నా తండ్రి. 'పుష్క' నా తల్లి. నా తల్లితండ్రులకు నేను లేక లేక కలిగిన గారాల బిడ్డను. నన్ను అపురూపంగా పెంచి పెద్దచేసి విరాధుడు అనే దానవుడికి ఇచ్చి వివాహం చేశారు. 

శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినై నా తల్లిదండ్రుల పంచన చేరాను, అలా చాలాకాలం గడిచింది. ఒకరోజున భీమానదిలో స్నానం చెయ్యటానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు. నా తల్లితండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదకి వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు. ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు. కన్నతల్లితండ్రులూ పోయారు. దిక్కులేని అనాధనై పోయాను. అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతున్నాను. ఇంతలో ఒక రోజున రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు. నేను వంటరిగా ఉన్నాను. దాంతో నన్ను బలవంతంగా లంకానగరానికి తీసుకువెళ్ళాడు. అతని వల్ల నేను గర్భవతినైనాను. ఆ తరువాత నిన్ను కని, పెంచి, పెద్దవాడిని చేశాను" అంది.

తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారము తీర్చుకోవాలనుకున్నాడు. బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు. వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుని ఓడించి, స్వర్గాన్నాక్రమించాడు. దేవతలంతా తలా ఒక దిక్కు కూ పారిపోయారు. రాక్షసుడు మునీశ్వరులను, సాధు వర్తనులను నానాబాధలు పెడుతున్నారు. స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు. అప్పుడు కామరూప దేశాన్ని 'సుదక్షిణుడు' అనే రాజు పాలిస్తున్నాడు. అతన్ని ఓడించి, కారాగృహంలో బంధించాడు. సుదక్షిణుడు పార్థివ లింగాన్ని తయారుచేసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపించి, ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు. ఇదంతా కారాగృహములోనే జరుగుతోంది.

ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూసి "ఓరి పిచ్చివాడా! మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ పూజలు, జపతపాలు వృధా. ఈ మట్టి లింగము నిన్ను కాపాడదు" అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు మాట్లాడకపోవటం అవమానముగా భావించాడు. దాంతో 'నీ పూజలు ఆపుతావా? నిన్ను నరికి చంపెయ్యనా?' అన్నాడు. దానికి రాజు "దానవేంద్రా! శివుడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. శివనామము జపిస్తేనే సర్వపాపాలు హరించుకుపోతాయి. శివనింద మహా పాపము" అన్నాడు. 

భీముని కోపం కట్టలు తెంచుకున్నది. దాంతో 'బొందితో కైలాసానికి వెళ్ళేవాడికిమల్లే మాట్లాడతావా? ఈ దెబ్బతో నీ పని సరి' అని కత్తి తీసి ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యము కత్తి మాయమైపోయింది. శివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుణ్ణి భస్మం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుని పరిపరి విధాల స్తుతించి, భీముని చంపి మమ్ము కాపాడిన ఓ శంకరా! ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు. వారి ప్రార్ధన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడు అనే పేరుతో సహ్యాద్రి పర్వతంపై జ్యోతిర్లింగమైనాడు. ఇదీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరుడి కథ.

                                        ◆నిశ్శబ్ద.


More Shiva