కేరళలో వెయ్యి సంవత్సరాల శివాలయం.. ఎన్నెన్నోఅద్బుతాలు, రహస్యాలు!

భారతదేశంలో శైవ క్షేత్రాలు చాలా పురాతనమైనవి. ఎన్నో క్షేత్రాలు ఎన్నో రహస్యాలను, అద్భుతాలను దాచుకున్నవి ఉన్నాయి. వీటిలో కేరళలో ఉన్న ఒక శివాలయం చాలా విశిష్టమైనది. వెయ్యి సంవత్సరాల కిందట ఈ శివాలయాన్ని పరశురాముడు ప్రతిష్టించాడట. ఈ ఆలయం వాస్తు శిల్పం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ జరిగే అద్బుతాలు భక్తులతో సహా అక్కడి పూజారులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెబుతారు. ఈ ఆలయం గురించి తెలుసుకుంటే..
వడక్కున్నాతన్ ఆలయం..
కేరళలోని త్రిస్సూర్ నగరంలో ఉన్న వడక్కున్నాతన్ ఆలయం శివుడు పూజలు అందుకుంటున్న అతి ప్రాచీన దేవాలయం. ఈ ఆలయ వాస్తు శిల్పం చాలా విశిష్టమైనది. పచ్చని ప్రకృతి , ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న కొండపై కొలువుదీరింది. ఇక్కడికి చేరుకున్న వెంటనే, సందర్శకులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభూతి చెందుతారు. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు , పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కేరళ రాష్ట్ర ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం పండుగకు కూడా ఈ ఆలయంతో సంబంధం ఉందని నమ్ముతారు.
పరశురాముడు స్థాపించాడు..
పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడట. కేరళ భూమిని పవిత్రం చేయడానికి ఆయన ఇక్కడ శివారాధనను ప్రారంభించాడని చెబుతారు. కేరళ వ్యాప్తంగా 108 శివాలయాలను స్థాపించారు. వాటిలో మొదటి శివాలయం వడక్కున్నాకన్ శివాలయం. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైనదని నమ్ముతారు. అయితే దీనిని ఎప్పటికప్పుడు పునర్నిర్మించి, పునరుద్ధరించారు. ఈ ఆలయం సాంప్రదాయ కేరళ శైలిలో రూపొందించబడింది. చెక్క శిల్పాలు , రాగి కప్పు దీని అందాన్ని మరింత పెంచుతాయి. ఆలయ గోడలపై ఉన్న పురాతన చిత్రాలు ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తాయి.
నెయ్యి అద్బుతం..
వడక్కున్నథన్ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలు ప్రజలకు బాగా తెలుసు. ఇక్కడ శివలింగానికి ప్రతిరోజూ నెయ్యి సమర్పిస్తారు. శతాబ్దాలుగా నిరంతరంగా నెయ్యి సమర్పిస్తున్నప్పటికీ, అది ఎన్నడూ పాడవదని అంటారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వేడి వాతావరణంలో కూడా నెయ్యి కరగదు. ఇది ఆలయ పూజారులు, భక్తులను కూడా ఆశ్చర్యానికి గురిచేసే అద్బుతం. మనస్పూర్తిగా ఆరాధిస్తే ఇక్కడి పరమేశ్వరుడు భక్తుల కోర్కెలు తప్పక నెరవేరుస్తాడని చెబుతారు.
ఈ ఆలయం మతపరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. ఆలయ సముదాయం విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం జరిగే హారతుల సమయంలో వాతావరణం మరింత భక్తిమయంగా మారుతుంది. ఆలయంలోని డప్పుల శబ్దం, మంత్ర పఠనం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. త్రిస్సూర్ పూరం సమయంలో, ఆలయం మొత్తం అలంకరణలతో, ఏనుగుల ఊరేగింపుతో ాలా కోలాహలంగా ఉంటుంది.
*రూపశ్రీ.



