సోమ ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం ఎలా పొందాలి!

పరమేశ్వరుడికి సంబంధించిన ప్రత్యేక రోజులలో ప్రదోష వ్రతం చాలా ప్రత్యేకమైనది. ప్రతి మాసంలో వచ్చే తృతీయ తిథి రోజు ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ తిథి ఏ వారంలో వస్తుందో ఆ వారాన్ని ఆ రోజుతో ముడిపెట్టి ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఇప్పుడు చైత్రమాసంలో శుక్లపక్ష తృతీయ సోమవారం రోజు వచ్చింది. అందుకే.. ఈ రోజును సోమ ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి, ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమ ప్రదోష వ్రతం రోజున ఉపవాసం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పరమేశ్వరుడిని ఎలా ఆరాధించాలి? వివరంగా తెలుసుకుంటే..
ప్రదోష పూజ సమయం..
మార్చి 30వ తేదీన సోమ ప్రదోష వ్రతం వచ్చింది. ఈ రోజు పూజ సమయం సాయంత్రం 6:38 నుండి రాత్రి 8:57 వరకు ఉంటుంది. పూజ చేయడానికి 2 గంటల 19 నిమిషాల సమయం లభిస్తుంది.
ఉపవాసం..
ప్రదోష వ్రతం సమయంలో పగలంతా ఉపవాసం పాటించి, సాయంత్రం ప్రదోష కాలంలో శివారాధన చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. సాత్విక ఆహారం, పండ్లు మొదలైనవి తినవచ్చు, కానీ తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి.
ప్రదోష వ్రతం తర్వాత సాత్విక ఆహారం లేదా అల్పాహారం వంటివి తినవచ్చు. బియ్యం, అన్నం, నూనె పదార్థాలు తినకూడదు.
పూజకు ముందు..
పూజకు ముందు ఏమీ తినకూడదు. పూజ తర్వాత కూడా ధాన్యాలు తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, లేదా అధిక నూనె, మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి.
పరమేశ్వర అనుగ్రహానికి పూజ..
సోమప్రదోష వ్రతం రోజు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం.. పరమేశ్వరుడి ఆరాధన ఎలా చేస్తారనేది కూడా చాలా ముఖ్యం. ప్రదోష సమయంలో ప్రదోష స్తోత్రాల పఠనం, రుద్రం, నమకం చమకం వంటివి పఠిస్తూ లేదా వాటి ఆడియోలు వింటూ ఇంట్లో శివలింగానికి అబిషేకం చేసుకోవడం ఎంతో మంచిది. అవన్నీ కుదరకపోతే.. కనీసం "ఓం నమఃశివాయ" అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ అయినా శివలింగానికి అబిషేకం చేసుకోవచ్చు. విభూతి సమర్పణ, బిల్వపత్రాల సమర్పణ తప్పకుండా చేయడం వల్ల పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు.
అన్నింటికంటే ముఖ్యంగా.. ఏ దేవుడు అయినా.. పూజల కంటే ముందు.. పూజ చేసే వ్యక్తి ధర్మబద్దంగా జీవిస్తున్నాడా లేదా అనే విషయాన్నే చూస్తాడు. మనిషి ధర్మబద్దంగా లేకుండా ఇతరులను ఇబ్బంది పెడుతూ మరొకవైపు భగవంతుడిని ఆరాధిస్తే వారికి ఆ భగవంతుడి అనుగ్రహం లభించదు. ఈ విషయాలు గుర్తుంచుకుని దైవాన్ని ఆరాధించడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.


