భక్తప్రహ్లాద
కొడుకు విష్ణుభక్తితత్పరతను మానిపించలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఆవేశంతో ‘నీ దేవుడు ఎక్కడున్నాడురా?’ అని అడగ్గా, అందుకు ప్రహ్లాదుడు,
ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే
అని బదులు చెప్పగా, ‘అయితే, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని ఆ స్తంభాన్ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడా స్తంభం విచ్చిపోగా, అందులో నుంచి ఉగ్రనరసింహమూర్తి బయల్వెడలి హిరణ్యకశిప సంహారాన్ని చేస్తాడు.ఇక్కడ స్తంభం అంటే నిశ్చలతత్త్వం. నిరంతర భగవచ్చిం తన వలన జ్ఞానం, కర్మరహితమైన నిశ్చలతత్వానికి చేరుతుంది. అప్పుడు అద్భుతత్వం సిద్ధిస్తుంది. అదే స్తంభం నుంచి నృసింహస్వామి అవతరించడం.
న‘హింసా’యాం - అంటే నశింపజేసే హింస.
సింహా - కనుక నశింపజేసేదానిని నశింపజేసేది. అంటే జీవుని నాశనం చేసే ఐహిక, భోగ, దుఃఖకారణమైన విషయ లోలత్వాన్ని నశింపజేసే మోక్షస్థితే నృసింహావతారం. అందుకే నృసింహ స్వామి తాపత్రయాలను నివారించి ముర్తినిచ్చే అవతారం. తన భక్తుల పరాజయాన్ని సమ్మతించలేని అపార కరుణాకటాక్ష వీక్షణానికి ఈ అవతారం ఓ సాక్ష్యం!
