అక్షయ తృతీయ నాడు అప్పన్నకు చందనోత్సవం

 

నిజ రూపం

 

అక్షయ తృతీయకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏడాది పొడుగునా చందనంతో కప్పబడి ఉండే సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఈ ఒక్క రోజు మాత్రం నిజ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి వారి మీద కప్పబడి ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు.

 

విశాఖపట్టణానికి 11 కి.మీల దూరంలో సింహగిరిపై, సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత  యుగంలో హరి భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా స్వామి ఇక్కడ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా స్వయంభువుగా వెలిశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించే ఈ ఆలయంలో నిత్యం పండితులు నాలుగు వేదాలు అధ్యయనం చేస్తారు. తిరుపతి తరువాత అధిక రాబడి ఉన్న ఆలయం ఇదే.

 

నిత్య రూపం

 

సంవత్సరంలో 364 రోజులు చందనం పూతతో కనిపించే స్వామి వారు ఈ ఒక్క రోజు చందనం లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఇలా ఒక రోజు మొత్తం చందనం లేకుండా ఉన్న స్వామివారికి ఆ సాయంత్రం నుండి వైష్ణవ స్వాములు అక్కడి దగ్గరలో ఉన్న గంగధార నుంచి మట్టి కుండలలో నీళ్ళు తెచ్చి వరాహ లక్ష్మీ నృసింహస్వామి మూర్తికి అభిషేకం చేస్తారు. అలా వెయ్యి కుండలతో నీళ్ళని అభిషేకం చేస్తారు దీనినే సహస్రఘట్టాభిషేకం అంటారు. ఈ సహస్రఘట్టాభిషేకం అయిన తరువాత స్వామివారికి మళ్లీ చందనం అద్దుతారు. ఇదే చందనోత్సవంగా ప్రసిద్ధికెక్కింది. స్వామివారి నుంచి తీసిన చందనాన్ని ప్రసాదంగా భక్తులకి అందచేస్తారు. ఈ చందనం ఎంతో మహిమాన్వితం అయినదని భక్తుల నమ్మకం. మనలో ఎటువంటి శారీరిక ఇబ్బంది ఉన్నా ఈ చందనం రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని కూడా కొందరి భక్తుల కథనం.

 

చందనం అరగతీయటం

 

ఆ ప్రాంతవాసులు నృసింహ స్వామిని ఆపదలు తీర్చి ఆదుకునే 'అప్పన్న'గా పిలుస్తారు. ఈ రోజంతా అక్కడ అప్పన్న నామం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. సంపెంగ పూల వాసనలు వెదచల్లుతూ ఉండే సింహాచలంలోని ఆ స్వామి నిజరూప దర్శనం సకల పాప హరణమని భక్తుల నమ్మకం.

 

..కళ్యాణి


More Others