ఉగాది రోజున ఎవరిని పూజించాలి?
ఉగాది అనుష్టానం:
ఉగాది పండుగ నాడు వేకువ జామునే నిద్రలేచి అభ్యంగనస్నానం చేసి కొత్తబట్టలు ధరించి , ఇంటికి మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన పూర్తి చేసి, బంధుమిత్రులతో కలిసి, మృష్టాన్న భోజనాలు చేయడం సంప్రదాయం. "ఉగాది'' నూతనత్వానికి మారుపేరు కనుక ఈరోజున కొత్త నిర్ణయాలను తీసుకోవడం, ఆయా కార్యాలకు శుభారంభం చేయడం 'ఉగాది ప్రత్యేకత.
ధర్మ కుంభదానం:
ఉగాది నాడు ప్రతి గృహమందు ధ్వజారోహణం చేయాలి. ఒక నూతన కలశను వేపాకులతో అలంకరించి, అందు పంచపల్లవములు అనగా మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేపచిగుళ్ళను వేసి ఆ కలశమును శుద్ధ జలమును నింపి, ఆ జలములో సుగంధచందనాదులు, పుష్పాక్షతలు వేసి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి, పసుపు, కుంకుమ, చందనం దారాలతో అలంకరించి కలశముపైన ఒక కొబ్బరిబొండాన్ని ఉంచి, ఇష్టదేవతను ఆవాహన చేసి, పుణ్యమంత్రాలతో, షోడశోపచారాలతో అర్చించి, ఉగాది పచ్చడిని నివేదన చేసి, ఆ కలశాన్ని కులగురువుకుగానీ, పురోహితుడికిగానీ దానమిచ్చి వారిని నూతన వస్త్రాలతో, దక్షిణలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి. దీనినే 'ధర్మకుంభదానం' అంటారు.
ఈ దానం వల్ల ఆ సంవత్సరమంతా కోరుకున్న కోరికలు సిద్ధించి, పరిపూర్ణ మనోరధులు అవుతారని శాస్త్ర ప్రమాణం.
-యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం