• Prev
  • Next
  • Rampandu-Prakriti Aharam

    "రాంపండూ -ప్రకృతి ఆహారమూ "

    “అచలపతీ, పద మైలారం వెళ్ళాలి. ఈ రాంపండు గాడికి మళ్ళీ ఏదో ముప్పు వచ్చిందట "

    “ అంటే వీణాపాణి గారితో పెళ్లి జరిగే అవకాశాలు మళ్ళీ సంనగిల్లాయంటారా ? ”

    “ అబ్బే, అదేం కాదులే. వాడి పాలిట వీణాపాణి ప్రెండు లావణ్య అనే అమ్మాయి వాడి పాలిట దాపురించి ప్రాణం తీస్తోందట...రేదర్ తీయిస్తోందట. వెళ్తేనే పూర్తీ వివరాలు తెలుస్తాయి.” అన్నాడు అనంత్.

    అనంత్ బస చేసిన హోటల్ కీ వచ్చి రాంపండు భోరుమన్నాడు.

    " వాడు ప్రస్తుతం వీణాపాణి ఇంట్లో గెస్టుగా ఉన్నాడట. ఏదో ఒకలా నెట్టుకోస్తుండగా వీణాపాణి క్లాసు మేట్ లావణ్య గెస్టుగా వచ్చి తల తినేస్తోందట.”

    “ ఎవరిది ? నీదా ? అయితే ఆవిడకి తినడానికి పెద్డెం దొరకదులే !"

    “ ఒరే కుళ్ళు జోకులేయకు.అసలే ఆకలేసి రంకెలేస్తున్నాను.ఇలాంటి జోకులేస్తే రక్కుతాను జాగ్రత్త" అన్నాడు రాంపండు ఆక్రోశంతో.

    “ ఏం ? మీ పేయింగ్ హోస్టుగారు సరిగ్గా అన్నం పెట్టరా ?”

    “ పాపం పెట్టేదిరా. ఇదిగో ఈ లావణ్య వచ్చి మొత్తమంతా చెడగోట్టేసింది. సాలు తిండితినే విధానం ఇది కాదంటూ మొదలెట్టింది.పిండి పదార్థాలుట, కొవ్వు పదార్థాలుట, అరిగేవట, అరగనివట. ఒకటి కాదనుకో, పది రకాల ఆంక్షలు.ప్రకృతిలో ఏ రూపంలో ఎలా దొరుకుతాయో అలాగే వాటిని తినాలట.వండకూడదట "

    “ బాబాయ్, అంటే కోడిని అలాగే తినేయాలా ? అది ఒప్పుకుంటుందా ? అరచి గోల చేయదూ ? ” సందేహించాడు అనంత్.

    “ చాల్లే. కోడిట, కోడి. కోడి కాదు పకోడి కూడా తినడానికి లేదు.ఆయిల్ లో డీప్ ప్రై చేసినది తినకూడదట. కొలెస్టరాలో, మరోటో ఎక్కువయి పోతుందిట "

    “ అంటే శుద్ధ శాకాహారమా ?”

    “ పరమ శాకాహారం. ఆహారం ఏమిట్లే, మన హాహాకారమే అనుకో.లావణ్య ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసింది.నేను తిండిపోతునట. ఎక్కువ తింటానట. తినకూడనది తింటానట.తినకూడని విధంగా తింటానట....ఒకటి కాదనుకో...” అని వాపోయాడు రాంపండు.

    అనంత్ కి జాలివేసింది. రాంపండు తిండి విషయంలో భీంపండు అన్నమాట నిజమే కానీ, బొత్తిగా ఇలా వాడి కడుపు కొట్టడం అన్యాయం అనిపించింది.బొత్తిగా వేర్లూ, దుంపలు టిని బతకమంటే ఈ బకాసురుడు బతకాలా ?చావాలా ? అసలు వీణాపాణి ఎందుకు ఊరుకుంటోంది ? అదే అడిగాడు రాంపండు.

    “ అదేరా నాకూ అర్థం కాదు.ఆ లావణ్య ఏం చెబితే అది వేదం తనకి.కుక్కను చూపించి పండి అనమంటే వరాహం అనే రకం.ఎంత క్లాసుమేటు అయినా అంత ఆరాధనా? ఆ మాటకొస్తే మనమూ క్లాసుమేట్స్ మే. నువ్వేమైనా మేధావవి నేను అనుకుంటున్నానా ?”

    “ అనుకోవా ? ”

    “ నువ్వు మాట్లాడిన ప్రతీ మాట ఆణిముత్యమని భ్రమపడతానా ? ”

    “ పడవా !? ”

    “....కానీ ఈ వీణాపాణి ఉందే, లావణ్య అంటే నడిచే విజ్ఞాన సర్వస్వం అని అభిప్రాయం పెట్టేసుకుని కూర్చుంది.తను చెప్పిన దగ్గర్నుంచి కనబడ్డ ప్రతీ కూరగాయనీ శంకిస్తోంది. దీనిలో ఏ దోషగుణం ఉందోనని ! ప్రతీదాన్నీ కేలరీల్లోనే తూచి తోసిపారేస్తోంది. ఈ లావణ్య వచ్చిన పదిహేను రోజుల్లోనే జీవితం నరకం చూపించదనుకో ! ” రాంపండు గొల్లుమన్నాడు.

    “ ఇన్ని బాధలు పడుతూ నువ్వు వాళ్ళింట్లో పేయింగ్ గెస్టుగా ఉండడం ఎందుకురా? హాయిగా బయట రూమ్ తీసుకుని ఉండు.” అని అనంత్ ఓదార్చబోయాడు.

    “ ఆపాటి తెలివితేటలు నాకు లేవనుకోకు. ఇప్పటికే రెండు మూడు సార్లు మేం ఇద్దరం పోట్లాడుకోవడం, నేను ఊరొదిలి వెళ్లిపోవడంతో వీణాపాణికి డౌటు వచ్చేసింది.మా ఇద్దరికీ పొసుగుతుందా లేదానని, అందువల్లనే ఈ పేయింగ్ గెస్టు ఏర్పాటు.పెళ్ళికి ముందు ప్రొబేషనరీ పీరియడ్ లాటిదనుకో ఈ వ్యవహారం ! నాలో ఏ లోపం కనబడినా గుడ్ బై చెప్పెస్తుందన్నమాట ! అందుకే ఎలాగోలా సర్ధుకుందామని చూస్తున్నాను "

    “ అయితే సద్దుకో. నన్ను రమ్మని చంపడం దేనికీ ?” అనంత్ చికాకు పడ్డాడు.

    “ అలా విసుక్కోకురా. ఓ నెల్లాళ్ళకో, రెణ్సెళ్ళకో అయితే సర్ధుకుందును. ఈ లావణ్య సంగతి చూస్తూ ఉంటే పెళ్లి మాట తలపెట్టడం లేదు. పెళ్లి చేసుకోవడం ప్రకృతి సహజం కాదంటుందేమోనని నా భయం. ఒకవేళ దీని సంగతి తెలియక ఎవడైనా పెళ్లి చేసుకున్నా నాలుగు రోజుల్లో సన్యాసుల్లో కలిసిపోవడం ఖాయం. అందువల్ల ఆవిడ మా ఇంట్లో పెర్మనేంట్ గా సెటిలయిపోవడం తప్పదని నా అంచనా.అసలిప్పటికీ వీణాపాణి అంటోంది -మనం ఇల్లు కట్టుకున్నప్పుడు లావణ్యకి సెపరేట్ గా రూమ్ కట్టాలండి అని ".

    “ చచ్చావ్ పో "

    “ అందుకే నాకేదైనా మృతసంజీవని అమర్చి పెట్టమని అచలపతినడుగు. అందుకే నిన్ను పిలిచాను ". అనంత్ అచలపతి కేసి చూశాడు.కానీ అచలపతి పెదవి విరిచేశాడు.రాంపండు బెంబేలు పడ్డాడు.

    “ అచలపతీ, కంగారేమీ లేదు. పరిస్థితి జాగ్రత్తగా స్టడీ చేసాకనే మంచి ఐడియా చెప్పు.ఇన్నాళ్ళు ఓర్చుకున్నవాణ్ణి, ఇంకో వారం ఓర్చుకుంటానులే. అంతేగానీ నన్ను తిండిమాలిన వాణ్ణి చేయకు " అని బతిమాలాడు.

    ఆవేళ రాత్రి వీణాపాణి ఇంట్లోనే భోజనం. దాన్ని భోజనం అనడానికి అనంత్ కి మనసు ఒప్పుకోలేదు.పచ్చి కాబేజీ ఆకులు, పసుపు నీళ్ళలో పచ్చి బఠానీలు,చితక్కొట్టిన వేర్లూ ఇవన్నీ కలిపితే లంచ్ కానీ, డిన్నర్ కానీ అవదని అతని అభిప్రాయం.

    రోజూ అంతేట.అంతేకాదు లావణ్య గురించి రాంపండు చెప్పినది అక్షరాలా నిజం. లావణ్య దృష్టిలో రాంపండు ఓ తిండిపోతు రామన్న.మొరటు మనిషి, నోట్లో పెట్టుకున్నది ఎలా నమలాలో కూడా తెలియని శుంఠ.రోజుకి పదిసార్లు ఈ మాటలు వింటే అర్జునుడికి కూడా కృష్ణుడి సారధ్యం మీద అపనమ్మకం కలిగేది.

    ఇక వీణాపాణి అనగా ఎంత ? ఆమె దృష్టిలో రాంపండు నానాటికీ దిగజారిపోయినట్టు స్పష్టంగా కనబడుతోంది.పెళ్లి అయిన తర్వాత భర్తను మార్చగలరని అందరూ ఆడపిల్లలు దురభిప్రాయ పడినట్లే ఆమె కూడా దురభిప్రాయ పడడం వల్ల ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చేయకుండా ఊరుకుందని అనంత్ అభిప్రాయం.

    రెండు మూడు రోజుల్లోనే వారందరూ ఒక తిరనాళ్ళకు వెళ్ళే సందర్భం పడింది.కార్లో మూడు గంటల ప్రయాణం. పొద్దున్న బయలుదేరుతుండగా రాంపండు వచ్చి గుసగుసలాడేడు.

    “ బ్రహ్మండమైనా లంచ్ ఏర్పాటు చేసానులే. వెళ్ళేదాకా లంచ్ బాస్కెట్ తెరిచి చూడకు. వాసన బయటకు వస్తే ఆ లావణ్య పసిగట్టేస్తుంది " అని.

    “ ఏం ? చికెన్, ఫిష్ గట్రా ఉన్నాయా ?”

    “ బ్రహ్మాండంగా. ఇది వద్దంటే తిరనాళ్ళలో తినడానికి ఏమీ దొరకదుగా. ఉలవలూ, వేర్లూ, మూలికలు పెట్టమంటే అక్కడ హొటల్ వాడు పిచ్చాసుపత్రికి అప్పగిస్తాడు.అందరూ గతిలేక ఇది తినాల్సిందే ! ఎలా వుంది ఐడియా ?”

    ఐడియా వరకు బాగాగే వుంది.కానీ వాళ్ళు ఆడంగుచేరి తినబోయేసరికి ఆ బాస్కెట్ కనబడలేదు. “ పెట్టడం మర్చిపోయానేమో " అని గొణిగాడు రాంపండు.

    “ పోన్లేండి.అదీ మంచిదే. ఓ పూట ఉపవాసం ఉంటే కడుపుకి చాలా మంచిది.” అంది వీణాపాణి.

    అనంత్ కొరకొరా చూసాడు ఆమెకేసి. కాబోయే మొగుడి కడుపు కాలుతుంటే ఆనాల్సిన మాటలివేనా అని, బ్రహ్మ సృష్టిలో ఇంతకంటే దారుణమైన వాళ్ళుంటారా అన్న అనుమానం వచ్చిందతనికి. అంతలోనే సందేహం తీరిపోయింది.

    “ ఉపవాసం అనేది శరీరాన్ని క్షాళన చేస్తుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ఉపవాసం ఉన్న రోజు ధ్యానం, ప్రార్థనలో గడిపితే శరీరంతో బాటు మనసు కూడా కడగబడి, మకిలి తుడిచి వేయబడుతుంది రాంపండూ గారూ.ఇది మీకు అనుకోకుండా వచ్చిన అవకాశం.లంచ్ లేదు కదాని తిరనాళ్ళలో జీళ్ళు గట్రా తినకుండా,చుట్టూ పల్లెపడచుల్ని చూడకుండా మనస్సు దేవుడి మీద లగ్నం చేసి...” లావణ్య ఉపవాసం ఎంతసేపు సాగేదో కానీ అచలపతి బస్సు దిగి వారి వద్దకు వచ్చాడు.

    “ సర్, ఒక చిన్నమాట " అని అనంత్ ను పక్కకు పిలిచి

    " లంచ్ బాస్కెట్ కారు డిక్కీలోంచి తీసేసింది నేనే సర్ ! మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించగోర్తున్నాను " అన్నాడు.

    యజమానిని ఆకలితో మాడ్చి చంపే కార్యక్రమానికి ఆమోదముద్ర వేయలేక అనంత్ విలవిలలాడేడు.

    “ అదేం పనయ్యా, ప్రాణాలు పోయేట్టున్నాయి.ఇంకో గంటలో నాకు వేరేదైనా ఏర్పాటు చేయకపోతే నువ్వు వేరే యజమానిని వెతుక్కోవలసినదే "

    “ సర్, ఇవాళ పొద్దున్న రాంపండు గారు లంచ్ ను వర్ణించే విధానం చూస్తే నలుగురి తిండి ఆయన ఒక్కడే కబళించేటట్టు కనబడ్డాడు. లావణ్య గారి ఎదురుగా అలా తింటే ఆవిడ నోరు మూసుకోదని, ఏవో కామెంట్స్ చేసి వీణాపాణి గారి మనసు విరిచేస్తుందని అనిపించింది. రాంపండు గారి వైవాహిక భవిష్యత్త్ దృష్ట్యా మీరీ త్యాగం....” అనంత్ ఏకీభవించక తప్పింది కాదు.

    “ యశోదకు బాలకృష్ణుడి నోట్లో భూగోళం కనబడ్డట్టు, పొద్దున్న రాంపండు నోట్లో బకాసురుడి ఫోటో కనబడిని కానీ నేను పోల్చుకోలేక పోయాను.నువ్వు బాగానే గుర్తుపట్టావ్. కానీ నువ్వో పాయింట్ మిస్ చేస్తున్నావ్.ఆకలి ఎంతోమంది చేత ఎన్నో నేరాలు చేయిస్తుంది.మరి రాంపండు చేత ఏం చేయిస్తుందో !రాంపండు ఒక్కడే అన్న మాటేమిటి ? ఈ ఆడవాళ్ళిద్దరూ కూడా మలమల మాడరూ ? ఆకులూ, అలములైనా తినాలి కదా !”

    “ సర్, ఆడవాళ్ళ విషయం నాకు బాగా తెలుసు.నేను ఇదివరకు పని చేసిన ఇంట్లో యజమానురాలు వేళకు భోజనం లేటయినా ఏమీ అనేది కాదు.కానీ మధ్యాహ్నం నిద్రలేచే సరికి కాఫీ లేకపోతే మాత్రం దుంప తెంపేసేది. మనిషి మనిషిలా ఉండేది కాదు.ఆ సూత్రం మీదనే ఇవాళ ప్రోగ్రాం ప్లాను చేశాను.

    ఇంకో రెండు గంటల్లో వాళ్ళు కార్లో బయలుదేరతారు.ఇంకా చూడవలసినవి ఉన్నాయంటూ మీరు వెనకనే దిగిపోండి " అని చెప్పాడు అచలపతి.

    రెండు గంటల తరువాత ఆడవాళ్ళని వెంట బెట్టుకుని రాంపండు కార్లో బయలుదేరాడు. తిరనాళ్ళలో దుమ్మూ ధూళీ,జనం తొక్కిడి, ఎండ వాళ్ళని చికాకు పెట్టేశాయి.కబుర్లు చెప్పుకునే మూడ్ కూడా పోయి, బ్యాక్ సీట్లో ప్రెండ్స్ ఇద్దరికీ కునుకు కూడా పట్టింది.

    అంతలో చిన్న జర్కుతో కారు ఆగింది.ముందుగా మేల్కొన్నది లావణ్య.కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే నిర్మానుష్యంగా ఉంది.

    “ కారెందుకు ఆపేరు ?” అంది ధాటీగా. తిరనాళ్ళలో జీళ్ళు తిననీయలేదనీ, ఆడవాళ్ళ కేసి తల తిప్పనీయలేదని రాంపండు అసలే మహాచిరాకుగా ఉన్నాడు.

    “ నేను ఆపలేదు.అదే ఆగింది " అన్నాడు దాన్ని దాచుకోకుండా.

    “ ఎందుకు ? ”

    “ ఎందుకో నాకేం తెలుసు ? దాన్నే అడగండి. దాన్లో కూడా మూలికల పెట్రోలు పోసారేమో. నీరసించిపోయి ఆగిపోయినట్టుంది " అన్నాడు కసిగా.

    “ చేతకాని వాళ్ళు తగుదునమ్మా అని స్టీరింగ్ పట్టుకోకూడదు.మీరు దిగండి.నేను చూస్తాను " అంది లావణ్య విసవిసా కారు దిగి వచ్చి.

    అప్పుడే మెలకువ వచ్చిన వీణాపాణి ఆ మాటలకు నొచ్చుకుంది.

    “ ఏమిటి లావణ్య ? కారన్నాక ఏవో ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి.ఏది నోటికొస్తే అది అనేయడమేనా ?” అంది.

    లావణ్య సమర్థించుకోబోయింది.

    “ బావుంది. మధ్యాహ్నం నిద్రలేవగానే కాఫీ పడకపోతే నాకు మహాచిరాకు వస్తుంది. ఎక్కడ హోటల్ కూడా లేదు.పోయి పోయి ఇక్కడ ఆపాడు మీ రాంపండు. పైగా మూలికల మీద జోకులోకటి !”

    “ ఆ మాటకొస్తే నా పరిస్థితి అంతే.ఇప్పుడు అర్జంటుగా కాఫీ పడాలి.అంతమాత్రం చేత...” అంటూనే " బాబాయ్, ఇది హైవే కూడా కాదు.అసలి ఇటు వైపు వెహికిల్స్ ఏవీ వచ్చేటట్టు లేవు.దగ్గర్లో ఇళ్ళేమీ లేవు.ఇదేంటండీ పోయి పోయి ఇక్కడ ఆపేరు ? ” అంది లావణ్య అడుగుజాడల్లో నడిచే వీణాపాణి. లావణ్య అరగంటసేపు కారులో రకరకాల వైర్లన్నీ పీకి చూసి పైనల్ గా పెట్రోలు లేదని తేల్చింది .

    పోయించమని అచలపతికి చెప్పానే అంటాడు రాపండు.

    పొద్దున్న లంచ్ బాస్కెట్ లాగానే ఇదీ మర్చిపోయి ఉంటావ్.అంటుంది లావణ్య. వీణ్ని కట్టుకుంటే నిన్నునట్టడవిలో నీలి లేకుండా చంపుతాడని వీణాపాణిని బెదిరించింది.

    వీణాపాణి ఎదురుతిరిగింది.పిల్లల్ని వెనకేసుకొచ్చే తల్లిలా...రాంపండు అంత నేరం, ఘోరం ఏమీ చేయలేదని వాదించింది. దెబ్బకి రాంపండు కరిగిపోయాడు.

    “ ఉండండి మీరు ఆవేశపడకండి.అదిగో అక్కడ ఒక ఇల్లు కనబడతోంది.అతన్ని అడిగి మీకు కాఫీలు ఏర్పాటు చేస్తాను.దగ్గర్లో పెట్రోలు బ్యాంకు ఏదైనా ఉందేమో కనుక్కుని డబ్బాలో పట్టించుకుని వస్తాను " అని హామీ ఇచ్చి ఆ ఇంటికి చేరాడు. తలుపు మూడోసారి తట్టాకనే ఓ భారీ మనిషి తలుపు తెరిచాడు.

    రాంపండు నోరు తెరిచి " ఎక్స్యూజ్ " అనబోయెంతలో " నువ్వేనా తలుపు బాదుతున్నది.ఇంకోసారి బాది చూడు.ఏం చేస్తానో చూద్దువు గాని " అన్నాడు.

    మాట వినకపోతే తన్నేట్టున్నాడని భయం వేసి రాంపండు చెయ్యి ఎత్తుతూండగానే అతను వాక్యం పూర్తీ చేశాడు.

    “ … చెయ్యి విరిచేస్తాను.” గొంతు తగ్గించి అతను తిట్టిన తిట్ల వల్ల తెలిసిందేమిటంటే అతని భార్య చంటి పిల్లవాణ్ని ఇతని సంరక్షణలో పెట్టేసి తిరనాళ్ళకు వెళ్ళింది.ఆ పిల్ల రాక్షసుడు ఓ పట్టాన పడుక్కోలేదు.

    పైగా ఏడుపు. అతి కష్టం మీద వాణ్ని పడుక్కోబెడుతుండగానే రాంపండు వచ్చి తలుపు తట్టాడు.పిల్లవాడు ఎక్కడ లేస్తాడోనన్నభయం. వచ్చి రాంపండుని విరుచుకుతినేయాలన్న కోరిక.ఈ రెండింటి మధ్యలో నలిగిపోయాడు ఆ భారీమనిషి.పిల్లవాడు కాస్త కళ్ళు అలా మూయగానే ఇలా వచ్చి రాంపండు పని పట్టాడు. కాఫీ పెట్టి ఇమ్మని అడిగే ధైర్యం లేక

    " ఇక్కడ పెట్రోలు బంక్ " అని రాంపండు అనబోతూండగానే " లేదు.ఉండి ఉంటే నిన్ను పెట్రోలు పోసి తగలెట్టి ఉందును.గట్టిగా ఊపిరి కూడా పీల్చకుండా ఇక్కణ్నుంచి చెక్కేయ్.లేకపోతే....” ఆ తర్వాత అన్నది గుసగుసల వల్ల తెలియలేదు.

    కానీ ఆ ప్రణాళిక తనకు ఉపకరించేది మాత్రం కాదని రాంపండులి అర్థం అయింది. వెనక్కి తిరిగివచ్చేసరికి ఆడవాళ్ళ మధ్య పోట్లాట తారాస్థాయికి చేరుకుంది.రాంపండు లాటి వాణ్ని కట్టుకోబోతున్న...అమ్మాయి తన ప్రెండని చెప్పుకోవడం నామోషీ అంటోంది లావణ్య.

    లావణ్య చదివిన స్కూల్లో చదివానని చెప్పుకోవడం డబల్ నామోషీ అంటోంది వీణాపాణి. ఎలాగోలా ఈ అడవిలోంచి బయటపడితే ఈ జన్మలోగానీ, వచ్చే జన్మలోగానీ మీ ఇద్దరి మొహం చూడనని ప్రతిజ్ఞ పట్టింది లావణ్య.

    లావణ్య జీవాత్మ కలిపినా పరమాత్మలో తాను చస్తే లీనమవనంది వీణాపాణి. అంతలో టాక్సీ ఆగిన చప్పుడు వినబడింది.పెట్రోలు డబ్బాతో అనంత్ దిగాడు.

    “ అచలపతి మర్చిపోయాడట.సారీ చెప్పి నాతో పెట్రోలు పంపించాడు.ఈ రూటయితే షార్ట్ కట్ అని నీకు చెప్పినది కూడా అతనేటగా ! వెతుక్కుంటూ వచ్చాను " అన్నాడు అనంత్.

    “ పెట్రోలు తో బాటు కాస్త కాఫీ కూడా పంపించి వుండాల్సింది. కారుతో బాటు పాసింజర్లు కూడా చల్లబడ్డేవారు " అన్నారు రాంపండు కార్లో పెట్రోలు పోసుకుంటూ....

    రాంపండు నుండి సేకరించిన సమాచారమే ఆయుధంగా అనంత్ వెళ్లి ఆ భారీమనిషి ఇంటి తలుపు తట్టాడు.ఈసారి అతి వేగంగా రెస్పాన్సు వచ్చింది.

    “ మళ్ళీ వచ్చావురా...ఇంకా బుద్ది రాలేదూ...” అంటూ దూకుడుగా వచ్చిన భారీమనిషి అనంత్ ను చూసి తెల్లబోయాడు. అతను ధాటీగా మాట్లాడిన విధం చూసి తెల్లబోయాడు.

    “ ఇదిగో, నాలుగు కప్పుల కాఫీ తయారుచేసి ఇయ్యి.త్వరగా.టైము లేదు.” అన్నాడు అనంత్.

    భారీమనిషి నోరు విప్పబోయెంతలో " లేకపోతే ఈ సీనారేకుడబ్బా మీద ఇదిగో, ఈ కర్ర పెట్టి వాయిస్తా.దెబ్బకి మీ పిల్లాడు లేచి ఏడుపు లంకించుకుంటాడు.” అని బెదిరించాడు. భారీమనిషి భారీ పిల్లి అయిపోయాడు.

    పది నిమిషాలు గడవకుండా నలుగురూ కాఫీలు తాగడం,కారు ఎక్కడం జరిగింది. మైలారం చేరగానే సంఘటనలు చకచకా జరిగిపోయాయి.లావణ్య మాట నిలబెట్టుకుంది.కారు దిగుతూనే ఫేడౌట్ అయిపొయింది.కానీ ఆమె నిష్ర్కమణ వల్ల రాంపండు లాభపడలేడనే చెప్పాలి.

    లావణ్య తో వాదించినప్పుడు రాంపండుని వెనకేసుకు వచ్చినా, అనంత్ కాఫీ ఏర్పాటు చేసిన తీరు చూసి,వీణాపాణి ముచ్చటపడింది.అనంత్ ను భోజనానికి ఆహ్వానించి,ఆ ఆహ్వానం రాంపండు ద్వారానే పంపింది.

    “ ఈసారి చికెన్,ఫిష్ ఉంటాయా ?” అని అడిగాడు అనంత్ హుషారుగా.

    “ మటన్ మాత్రం తప్పకుండా ఉంది.బక్ రాది "

    “ ఎవరా బకరా ?”

    “ ఇంకెవరు నేనే ! వీణాపాణి స్పష్టంగా చెప్పింది.తన లెవెల్ కి నేను తగనట ! పెళ్ళంటూ చేసుకుంటే నీలాటి డాషింగ్ ఫెలోనో చేసుకుంటుందట !లంచ్ అయ్యాక తనే ప్రఫోజ్ చేస్తుందిట ! ” అన్నాడు రాంపండు ఏడుపు మొహం పెట్టి.

    అనంత్ మూర్చపోయాడు.

    ఎమ్బీయస్ ప్రసాద్

    (పిజి ఉడ్ హవుస్ రాసిన 'జీన్స్ అండ్ ది ఓల్డ్ స్కూల్ ఛమ్ ' కథ ఆధారంగా )


  • Prev
  • Next