• Prev
  • Next
  • Rampandu-Ganakoushalamu

    రాంపండు - గానకౌశలమూ

    “మళ్ళీ మళ్ళీ పాడుతా, మల్లి మనసు నాదేననీ "అనంత్ బాత్ రూమ్ లో కూనిరాగం తీస్తుండగా అచలపతి పిలుపు వినబడింది.

    “ సర్, మీ స్నానం,పాట అయిపోతే బయటకు రావచ్చు.రాంపండు గారు మీ కోసం వెయిట్ చేస్తున్నారు

    అనంత్ కీ సమాధానం ఇవ్వక తప్పింది కాదు.

    “చూడు అచలపతీ,స్నానం అయిపోతే పాట ఆపేస్తానని తెలిసి కూడా నువ్వలా అనడం బాగాలేదు.రాంపండు వచ్చాడంటున్నావు కాబట్టి త్వరగా స్నానం ముగించి వచ్చేస్తాను. ఉండమను.”

    అనంత్ చెప్పినది నిజమే.

    అనంత్ బాత్ రూమ్ సింగరే కానీ బాల్ రూమ్ సింగరు కాడు.పాట పూర్తిగా పాడే వరకూ స్నానం చేయాలని వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నేర్పించింది.

    అనంత్ కు ఏ పాట-లిరిక్ గానీ,ట్యూన్ గానీ సరిగ్గా గుర్తుండవు.అవన్నీ గుర్తుకు తెచ్చుకుని పాట పూర్తి చేసేసరికి కాస్త ఎక్కువ సేపు స్నానం చేయవలసి వస్తుంది.అదే వాళ్ళ అమ్మ కోరుకున్నది కూడా !స్నానం అంటే రెండు చెంబుల నీళ్ళు పోసుకుని పరిగెట్టుకురాకుండా ఆవిడ ఈ ఉపాయం కనిపెట్టింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశం అంతా ఊపేస్తున్న పాట కాబట్టి "మళ్ళీ మళ్ళీ పాడుతా...” అనంత్ ను పట్టేసుకుని వదలనంటోంది.

    స్నానం ముగించి అనంత్ వచ్చేసరికి రాంపండు బల్ల మీద దరువులు వేస్తున్నాడు.పాట అదే "మళ్ళీ మళ్ళీ పాడుతా, మల్లి మనసు నాదేనని..."

    “ఏం గిరాకీ ?”

    “అనంతూ, నాకు పెళ్లి కుదిరింది " అన్నాడు రాంపండు ఉత్సాహంగా.

    “తిక్క కుదిరింది.వీణాపాణే నా ?”

    రాంపండుకు కోపం వచ్చింది. “ఏమిట్రా...ఆ వీణాపాణి తప్ప వేరే ఆడదే నాకు దొరకదా ?పుట్ బాల్ మ్యాచ్ వ్యవహారంలో మేనక చెయ్యివ్వడంతో ఒళ్ళు మండి మళ్ళీ వీణాపాణి దగ్గరకు వెళ్ళాను.నాలుగు రోజులు సవ్యంగా నడిచాయో లేదో, మళ్ళీ పోట్లాటేసుకుంది.నేను బొత్తిగా అలుసయిపోయాననుకో...”

    “అయితే ఇప్పుడీ పెళ్లి ఎవరితో కుదిరినట్టు ? కొత్త కాండిడేటా ?” అనడిగాడు అనంత్ నిర్లక్ష్యంగా.

    “ఒరే,అంత తీసిపారేసినట్టు మాట్లాడకురా.ఈ కోకిల చాలా మంచిది తెలుసా.అస్సలు అహంభావం లేదు.సంగీత విభావరులు అనీ ఉంటాయి చూడు, వాటిల్లో పాటలు పాడుతుంటుంది.భలే వాయిసులే.చక్కగా మిలమిలలాడే కళ్ళు.కమ్మటి...” రాంపండు మామూలు ట్రాక్ లో పడిపోతున్నాడని తెలిసి అనంత్ భయపడ్డాడు.

    రాంపండుని ఆపబోయేడు.

    “ సరే,ఇప్పటిదాకా మూడు డజన్ల మంది అమ్మాయిలలో ఈ లక్షణాలు కనబడ్డాయి నీకు. ఇంతకీ పెళ్లి నిజంగా కుదిరినట్టేనా ? లేక...”

    “నువ్వు తలుచుకుంటే కుదిరినట్టే " అన్నాడు రాపండు లౌక్యంగా.

    “మధ్యలో నేనెక్కణ్ణుంచి వచ్చాను ?” అనంత్ తికమక పడ్డాడు.

    రాంపండు వివరించాడు-కోకిలకు రాంపండు నచ్చాడట.కానీ చిన్న చిన్న అభ్యంతరాలున్నాయట.

    కోకిల చాలా సీరియస్ మనిషట.ప్రాక్టికల్ జోక్స్ వేసేవాళ్ళని అసహ్యించుకుంటుందిట. రాంపండు ప్రాక్టికల్ జోక్స్ వేస్తాడని ఎవరో చెప్పారట.పుగా ఫలానా ఊళ్ళో ఫలానా రోజున అనంత్ తలకింద ఐసుదిండు పెట్టి ప్రాక్టికల్ జోక్ వేశాడు.కావాలంటే చెక్ చేసుకో.అని కూడా చెప్పారట.

    అది నిజమో కాదో తెలుసుకుందామని అనంత్ ఇంటికి రాబోతోందుట.

    “ఒరేయ్,నా కథకు ముగింపు నీ చేతిలో ఉంది.నన్నో ఇంటివాణ్ణి చేసి ఈ కథ ముగిస్తావో,ఇలా సాగదీస్తావో నువ్వే తేల్చుకోవాలి.ఆ ఐసుదిండు విషయం నిజమేనని చెప్పావో నాకు శాశ్వతంగా టాటా చెప్పేస్తుంది.అందుకని అదంతా గిట్టని వాళ్ళు పుట్టించిన కట్టు కథ అని చెప్పేయి.పెళ్లి చేయడానికి లభించే వెయ్యి అబద్దాల కోటాలో తక్కిన తొమ్మిది వందల తొంబై తొమ్మిది దాచుకో.

    ఇవాళ మధ్యాహ్నం నీ ఆహ్వానం మీద మీ ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడు కోకిల ఆ విషయం ప్రస్తావిస్తే పగలబడి నవ్వేయి.'జనాలు భలేవాళ్ళే.ఎలాటేలాటి కథలు పుట్టిస్తారో.అందునా అతి సీరియస్ మనిషైన రాంపండు మీదనా !?అనే వ్యాఖ్య కూడా జోడించు.” రాంపండు బతిమాలు కున్నాడు.

    “ ఈ భోజనానికి నేనెప్పుడు ఆహ్వానించానట ?' మర్యాదగానే అడిగాడు అనంత్.

    “నో ఫార్మాలిటీస్ మై డియర్.నేను అలాటివేవీ పెట్టుకోను.ఒంటి గంటన్నర కల్లా మేం ఇఅద్దరం వచ్చేస్తాం " హామీ ఇచ్చి రాంపండు పారిపోయాడు. అనంత్ నిట్టూర్చి అచలపతి కేసి చూశాడు.

    “అచలపతీ,చూశావా విధివిలాసం !వీది ప్రాక్టికల్ జోక్స్ కు గురి కావడమే కాకుండా వీడు అతి గంభీరమైనా మనిషనీ, సోక్రటీసుకి బాబనీ కాన్వాస్ చెయ్యాలట.పైగా వాడి ప్రియురాళ్ళందరినీ పీకలదాకా మేపాలట.ఖర్మ !”

    “జీవితమే అంత సర్ !” అన్నాడు అచలపతి.

    “ నిజం.నిజం.కరెక్టుగా చెప్పావ్.అవునూ ట్రేలో ఏమిటవి ?”

    “ వేయించిన రొయ్యలు సర్ " అనంత్ ఫిలాసఫించాడు.

    “ తరచి చూస్తే పాపం రొయ్యలక్కుడా వాటి కష్టాలుంటాయి.ఏమంటావ్ ?” అచలపతి కాదనలేదు.

    “ఉండవచ్చు సర్ "

    “అంటే నా ఉద్దేశ్యం -ఇలా వేయించడమే కాకుండా తక్కిన,ఇతర కష్టాలు కూడా నన్నమాట "

    “ తక్కిన ఇతర కష్టాలా సర్...?”

    “అవును, ఇతర తక్కిన కష్టాలు...”

    “ఓకే సర్.నాకు సెలవిప్పిస్తే లంచ్ ఏర్పాట్లు చేస్తాను " అనంత్ ఫిలసాఫికల్ మూడ్ చూసి అచలపతి పారిపోయాడు.

    *****

    లంచ్ తర్వాత కోకిలను ఆటో ఎక్కించి రాంపండు లోపలకు పరిగెట్టుకు వచ్చాడు.

    “ నేను చెప్పినది నిజమే కదా !ఆమె భూలోకం మీద నడియాడే గంధర్వ కన్య కదూ !అని అడిగి చూశాడు.

    “ తక్కిన విషయాల మాట ఎలాగున్నా పాట మాత్రం ఆదరగోట్టేసింది.చూరుమీద నుంచి పెచ్చులింకా ఊడిపడుతూనే ఉన్నాయి !”

    “ నీ జోకులకేం గానీ ఏమైతేనేం ఓ అబద్దం చెప్పి నా పెళ్లి కాపాడావు.ఋణం ఉంచుకోను.నువ్వు పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు చెప్పు.నువ్వు తెలివైనవాడివని అబద్దం చెప్పి నిన్నూ ఓ ఇంటి వాణ్ణి....” అంటూ రాంపండు టేబుల్ మీద ఉన్న గ్లాసులోంచి విస్కీ ఓ గుక్క నోట్లో పోసుకున్నాడు.

    “ అదేమిట్రా,ఇందాక ఆ అమ్మాయి ఎదురుగుండా విస్కీ వద్దనేశావ్ !”

    “ అవును,విస్కీ తాగడం గురించి ఆ అమ్మాయి అభిప్రాయాలు పూర్తిగా తెలియకుండా రిస్కు తీసుకోలేం కదా !ప్రస్తుతం తనని ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో ఓ ప్లాను వేశాను.మన గుర్నాధం గాడి పాటల ప్రోగ్రాం లో తన చేత పాడిస్తున్నాను.ఈ లోపున ఇంప్రెషన్ పాడుచేసుకోవడం ఎందుకు ? గుర్నాధం గాడి ప్రోగ్రాం సంగతి విన్నావుగా ?”

    " వినకపోవడమేం ? తను చేపట్టిన సాంఘీక సేవాకార్యక్రమాల గురించి గుర్నాధం,అనంత్ కూడా చెప్పాడు.ఊళ్ళో వాడుండే లోకాలిటీలో ఉన్నవాళ్లందరూ కూలీనాలీ చేసుకునే మొరటు మనుషులే. కూరలమ్మే వాళ్ళల్లోనూ, చేపలమ్మే వాళ్ళల్లోనూ, మాంసం కొట్టేవాళ్ళల్లోనూ కూడా కళాహృదయం ఉందని నిరూపించడానికి గుర్నాధం ఓ క్లబ్బుపెట్టి పుస్తకాలిచ్చి చదవమనడం, శాస్ర్తీయ సంగీతం లాటివి వినమనడం చేస్తున్నాడు.స్కూల్ కు వెళ్లేందుకు మొరాయించే పిల్లల్లా వాళ్ళు కాస్సేపు మారాం చేసినా చివరికి గుర్నాధం మాట కొట్టేయలేక ఆ కార్యక్రమాలకు హాజరయి తామూ సంస్కారం నేర్చుకున్నామని అతనికి ధైర్యం చెబుతూ ఉంటారు.

    ఆ కార్యక్రమాలకు గుర్నాధం అనంత్ దగ్గర అప్పుడప్పుడు విరాళాలు వసూలు చేస్తూ ఉంటాడు.వారం రోజుల తర్వాత జరగబోయే ప్రోగ్రాంలో కోకిల చేత ఓ పాట పాడిస్తాడట. అంతకంటే దారుణం -తను కూడా ఓ పాట పాడుతాడట !మధ్యలో అదెందుకురా ? అనడిగాడు అనంత్.

    “ నీకు తెలియదులే.నేను పాడబోయే పాట వింటే నా హృదయంలో చాలా లోతులూ , లోయలూ ఉన్నాయని తెలుస్తుందన్నమాట.వాటి గురించి కోకిలకు ఇంకా ఏమి తెలియదు. అటువంటివి వున్నాయని అనుమానం కూడా లేదు తనకి ఇప్పటిదాకా.కానీ నా పాట విన్నాక ఆ స్థానిక రౌడీలందరూ కరిగి, కళ్ళు తుడుచుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆమెకి. 'ఈ రాంపండు గాడికి చాలా ఉదాత్తమైన భావాలు, లోతైన అనుభూతులు ఉన్నాయి 'అని ఆ పాట కూడా నువ్వు పాడే జూలాయి,ఆకతాయి పాటల్లాటిది కాదు.చాలా భావగర్భితమైన భావగీతం లాటిది.నీవు విన్నావో లేదో " అనంత్ కెవ్వుమన్నాడు.

    “కొంపదీసి నువ్వు 'మళ్ళీ మళ్ళీ పాడుతా,మల్లి మనసు' అని పాడడం లేదు కదా !”

    “కొంపదీయడం లేదు.ఖచ్చితంగా అదే పాట పాడుతున్నాను.” అనంత్ కు కూడా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది -అలాటి పాట రాంపండు లాటివాళ్ళు పాడకూడదని.అంటే తనలాటి వాళ్ళు పాడవచ్చని కాదు.అయినా తనూ పాడవలసి వచ్చింది.ఆ సందర్భంగా ఇలా వచ్చింది.

    రాంపండు వెళ్ళిన కాసేపటికి మాంకాళి అత్తయ్య వచ్చింది.వీణాపాణిని వదిలేసి ఇంకోదాని వెంట పడుతున్నాడని విని వాడికి బుద్ధి చెబుదామని వచ్చింది.కాస్సేపటి క్రితమే రాంపండు కి అనంత్ లంచ్ ఇచ్చాడని విని మండిపడింది.

    “వాడి సూప్ లో ఇంత విషం కలపాల్సింది నువ్వు " అంది కసిగా.

    “వాడు సూప్ తీసుకోలేదులే.ఆ కోకిల కళ్ళలోని అమృతాన్ని జుర్రేస్తూ తన దాహాన్ని తీర్చుకున్నాడు.వదిలేయ్.ఇదిగో అచలపతీ,అత్తయ్య సమస్య విన్నావు కదా.రాంపండుని కోకిలని విడగొట్టే ఉపాయం ఏదైనా చెప్పు.” అన్నాడు అనంత్.

    అచలపతి తలవూపాడు.

    “ మేడమ్,ఉదహరించబడిన పరిస్థితులలో,మొట్టమొదటిగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది ఆ వ్యక్తి యొక్క మనోవిశ్లేషణ "

    “ వ్యక్తి యొక్క...ఏమిటది ?” అంది మాంకాళి అత్తయ్య కంగారు పడి. “ మనోవిశ్లేషణ " అచలపతి జవాబు.

    అనంత్ కలగజేసుకున్నాడు.

    “ అర్థం కాలేదా అత్తయ్యా.మనోవిశ్లేషణ అన్నమాట !అవునూ,అచలపతీ ,ఈ మనోవిశ్లేషణ అంటే అర్థం ఏమిటోయ్ ?”

    “అంటే పరిశీలనలలో ఉన్న వ్యక్తుల యొక్క నైసర్గిక స్వభావము,మానసిక స్థితి అన్నమాట సర్ "

    “ అంటే వాళ్ళ తత్త్వం అన్నమాట "

    “ అలా కూడా అనచ్చండి " అత్తయ్య ఇద్దరికేసి అదోలా చూసింది.

    “ ఒరే అనంతూ...మీరిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు కూడా అతనిలాగే మాట్లాడతారా ?” అని అడిగింది.

    “ఒక్కోసారి.ఒక్కోసారి ఇలా మాట్లాడడు కూడా.అంటే కొన్ని సార్లు మాములుగా మాట్లాడతాడు.కొన్నిసార్లు మామూలుగా మాట్లాడడు అన్నమాట.అర్థమయ్యింది కదూ. అచలపతీ, నువ్వు ముందుకు సాగిపో !”

    “ సరే సర్.కోకిల మేడమ్ నా పరిశీలనలో ఉన్న సమయంలో నాపై గాఢంగా వేసిన ముద్ర ఏమిటంటే-ఆమెది కఠినమైన స్వభావం.తప్పులు క్షమించలేని తత్త్వం .నా మనోఫలకంలో రూపుదిద్దుకున్న ఆమె వ్యక్తిత్వం విజయాన్ని హర్షించగలదు కానీ అపజయాన్ని సహించలేదు.బహుశ మీరూ గమనించే వుంటారు.రాంపండు సార్ తన ప్లేట్ లోంచి ఫోర్స్ తో ఆమె ప్లేటులోకి నూడుల్స్ కిందపడకుండా వేయబోయి రెండుసార్లు విఫలమయినప్పుడు ఆమె చూసిన చూపు!”

    “ ఓ గుర్తుంది !రాంపండు గాణ్ణి విదిలించి పారేసింది.మీకు చేతకాకపోతే నాకివ్వండి గానీ కిందామీదా పొయ్యవద్దు అంది కూడా !”

    “ సరిగ్గా వర్ణించారు సర్ " మధ్యలో అత్తయ్య కలగజేసుకుంది.

    “ ఆగండాగండి.నా కర్థమయినంత వరకూ మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకొన్నదాని భావమేమిటంటే రాంపండు కోకిల ప్లేటులోకి నూడుల్స్ వేయడానికి ప్రయత్నిస్తూ పొతే,చివరికి ఆమెకి ప్రాణం విసిగి'నాకూ నూడిల్సూ వద్దు.నువ్వు వద్దు వెళ్ళిరా నాయనా 'అంటుంది. అంతేనా !”

    “ మేడమ్,కోకిల గారి దయారాహిత్యానికి ఓ చిన్న ఉదాహరణగా మాత్రమే నూడిల్స్ ఉదంతం చెప్పాను కానీ...” అని అచలపతి అంటూండగానే అనంత్ ఎగిరి గంతేశాడు.

    “దయరాహిత్యం !అబ్బ ఇందాకటి నుంచి అదే మాట గురించి వెతుక్కుంటున్నానయ్యా !భలే చెప్పావు సుమా !” అత్తయ్య అనంత్ కేసి కోరగా చూస్తూ ఉండగానే అచలపతి తన ఐడియా వివరించాడు.

    “ సరే, రాంపండు గారు పదిమంది ఎదుట అపహాస్యం పాలయితే.అది కోకిల మేడమ్ కంటపడితే ఆమెకు ఆయనపై గల అభిమానం ప్లాష్ బ్యాక్ అయిపోతుంది.ఉదాహరణకి మంగళవారం నాటి సాయంత్రం గుర్నాధం ఫంక్షన్ లో రాంపండు ప్రేక్షకులను మెప్పించలేకపోతే...” అనంత్ కి జ్ఞానోదయం అయింది.

    “ అంటే జనాలు వాణ్ణి మోసేస్తే వాడి ప్రేమాయణం అంతటితో సరి అంటావ్ "

    “ అలా జరక్కపోతేనే ఆశ్చర్యపడాలి సర్ " అనంత్ కాస్త ఆలోచించాడు.

    “రాంపండు గాడు సరిగ్గా పాట పాడలేక కంపు కొట్టిస్తాడనుకో.కానీ ఆ బండవెధవలకి వాడి పాట నచ్చి చప్పట్లు కొడితే...?ఛాన్స్ తీసుకోకూడదు."

    “ సర్, మనం అదృష్టాన్నే నమ్ముకుని కూచోనక్కరలేదు.గుర్నాదానికి చెప్పి రాంపండు పాటకు ముందు "మళ్ళీ మళ్ళీ పాడుతా"పాటను మీరు పాడేశారనుకోండి.

    రాంపండు పాట ఆరంభించే సమయానికి ఆ పాట మీద సభికులకు మోజు పోయి వాళ్ళ అభిప్రాయాలను కాస్త ఘాటుగా వ్యక్తం చేసే అవకాశం ఉంది. అత్తయ్య వెంటనే అరిచింది. “నీ బుర్ర అమోఘమోయ్ అచలపతీ "అని. అనంతూ అరిచాడు.

    “ నీకు మతిపోయిందోయ్, పోయి పోయి నేను స్టేజిమీద పాట పాడడమేమిటి ?” అని. కానీ అత్తయ్య మాట వినిపించుకోలేదు. ' అనంతూ,నువ్వు పాడబోతున్నావ్.లేకపోతే నేను శాపం ఇస్తానంతే !” అనేసింది.

    గుర్నాధానికి ఫోను చేయడం,అరగంటలోగా ప్రోగ్రాం ఫిక్స్ అయిపోవడం జరిగింది.మంగళవారం నాటి ప్రోగ్రాంలో ఇంటర్వెల్ తర్వాత అనంత్ పాట.తర్వాత రాంపండుది.ఆ తర్వాత ప్రఖ్యాత గాయని కోకిల పాట.

    *****

    మంగళవారం హాలు దగ్గరికి చేరేసరికి అన్నిటీకి తెగించే వచ్చాననుకున్న అనంత్ కూడా ఖంగు తిన్నాడు.సంగీతామృతంలో ఓలలాడడానికి అక్కడ చేరిన రసికశిఖామణుల పెర్సనాలిటీలు చూడగానే టాక్సీ పట్టుకుని వెనక్కి పారిపోయు నాగరీకుల మధ్య పడదామనిపించింది.నిప్పులో దూకే శలభం ఫీలింగు కలుగుతూండగానే -” హాలు బాగా నిండింది కదా సర్ " అంది అతని మోచేయి.

    తిరిగి చూస్తే అచలపతి " నువ్వు ప్రోగ్రాం మొదటి నుండీ ఉన్నట్టున్నావు -ఎవణ్ణైనా మోసేశారా ?”అని అడిగాడు.

    “ఇంకా ఎవర్నీ...లేదు సార్ "

    “ అంటే నాతోనే ఆరంభమవుతుందన్నమాట "

    “ అబ్బే అదేం కాదండి " అనంత్ కి కోపం వచ్చింది.

    “ నీ ప్లాను ప్రకారం అంతా జరుగుతుందనుకుంటున్నావేమో !దాంట్లో ఓ పెద్ద లొసుగు ఉంది తెలుసా !?”

    “లోసుగా ?”

    “ అవును.గట్టిగా మాట్లాడితే లొసుగున్నర! నేను పాడడం విన్నాక రాంపండు ఆ పాటే ఎందుకు పాడతాడు ?పబ్లిక్ మూడ్ గమనించి రంగం విడిచి పారిపోతాడు.”

    “రాంపండు గారికి మీ పాట గురించి తెలియడానికి అవకాశం లేదు సర్.నా సలహామేరకు ఆయన రోడ్డుకు అటు సైడున్న బార్ లో కాస్త మందు పుచ్చుకుంటున్నారు.ఈ ప్రోగ్రాంలో ఆయన వంతు రాగానే నేను వెళ్లి చెప్పివస్తాను.” అన్నాడు అచలపతి.

    “ఓహో, ఇదో ఏర్పాటా ?”

    “అవును సార్, మీరేమనుకోకపోతే,రోడ్డుకు ఇటు సైడున్న బార్ లో మీరూ అదే పని చేయవచ్చు.స్టేజీ ఎక్కబోయేముందు కలిగే నెర్వస్ నెస్ పారద్రోలడానికి...” అచలపతి చెప్పిన విస్కీ చికిత్స అద్భుతంగా పనిచేసింది.

    ప్రపంచం యెడల అనంత్ దృక్పథాన్ని మార్చివేసింది.మోకాళ్ళు పట్టుదప్పడం మానేశాయి.చేతులు వణకడం మానేశాయి.నాలుక ఫ్రీగా ఆడటం మొదలు పెట్టింది.వెన్నెముక దన్నుగా నిలిచింది.లోకంలో ఎటువంటి గుండా ఆడియన్స్ నైనా ఎదుర్కోవడానికి ధైర్యం వచ్చింది.కాస్సేపట్లో అనంత్ స్టేజీ మీద, ఓ లక్ష కళ్ళు అతని మీద.దేవుడి మీద భారం వేసి,గట్టిగా ఊపిరి పీల్చి "మళ్ళీ మళ్ళీ పాడుతా ...” పాట అందుకున్నాడు.

    తరువాత ఏమయిందో అనంత్ కు అంత స్పష్టంగా గుర్తులేదు.అంతా అలుక్కుపోయిన ఫీలింగ్.ఏదో గొణుగుడు.ఏదో సణుగుడు మాత్రం పాడుతున్నంతసేపూ వినబడింది. ప్రేక్షకశ్రోతలు అత్యుత్సాహంతో అతని పాటను బృందగానంగా మారుద్దామనుకున్నట్టు అనిపించిందతనికి.

    ఈ ఊపులో ఒంట్లో శక్తినంతా గొంతులోకి తెచ్చుకుని అలా,ఇలా తారాస్థాయికి వెళ్లి అలా పాడుతూనే తెర పక్కకి తప్పుకున్నాడు.పాత అయిపోయాక వంగి నమస్కారాలు పెట్టి, ప్రేక్షకుల అభినందనాలు స్వీకరించే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదతనికి. ఏమో.తన వీపు చూస్తే ఎ తుంటరికి ఏం బుద్ది పుడుతుందో ! అని అతని భయం.

    స్టేజి దిగి ఆచలపతి వద్దకు రాగానే డిక్లేర్ చేసేశాడు.

    “ ఇక నేను జన్మలో స్టేజి ఎక్కడం జరగదు.ఇక మీద ఎవరైనా నా పాట వినాలనుకుంటే నా బాత్ రూమ్ బయట నిలబడి చెవి తలుపు కాన్చాల్సిందే !ఇవాళ కూడా పాట చివరికి వచ్చేసరికి శ్రోతలు కాస్త చికాకుపడుతున్నట్లు అనిపించిందెందుకో.బహుశా నా భ్రమోనేమో-మోసేయడానికి బోయాలు 'బోహొం,బోహొం ;అంటున్న ఫీలింగ్ కలిగింది.అంతా వట్టి ఊహే కదూ !

    " ప్రేక్షకులు అంత సంతోషంగా లేనట్టు నాకూ అనిపించింది సర్.అదెంత గొప్ప పాటైనా జనాలకి మొహం మెత్తినట్టనిపించింది నాకు "

    “ అదేమిటి ?”

    “నేను ముందే చెప్పి వుండాల్సిండి సర్.ఆ పాట అప్పటికే మీరొచ్చేముందు ఓ ఇద్దరు పాడారండి ".

    “ అమ్మనాయనోయ్ "

    “ఒక అమ్మాయి...ఒక అబ్బాయి.ఒకరి తరువాత ఒకరు.అది చాలా ప్రజాదరణ పొందిన గీతం కదా సర్.”అనంత్ అచలపతికేసి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయేడు.అన్నీ తెలిసి తన యజమానిని మొసళ్ళకు ఆహారంగా వేయడానికి కూడా వెనకాడని మనిషన్నమాట !ప్రభు శక్తి లాటి మాటలు రాజుల కాలంలోనే అంతరించాయా ?అని అనుకుంటుండగానే రాంపండు స్టేజెక్కడం కనబడింది.

    బార్ నుండి వచ్చిన రాంపండు బార్ నుండి వచ్చినట్టే ఉన్నాడు. ఆడియన్స్ లో వాడి ప్రెండ్స్ ఉన్నారేమో చప్పట్లు కొట్టి కేకలు వేశారు.రాంపండు మొహం ఇంతయింది.అయి,అయి తలకాయ వెనకభాగం తగ్గిపోయేటంతయింది.

    ఆనందంతో తేలిపోతున్న మనిషి నేలమీద ఎంత బాగా నిలబడగలడో అంత బాగా నిలబడి,తన ప్రజల నుండి వందనాలు,అభినందనలు స్వీకరించే రాజుగారి స్టయిల్లో చేతులూపాడు.

    ఆర్కెస్ట్రా వాళ్లకు ఏ పాట వాయించాలో చెబుతుండగానే వాళ్ళూ తెల్లబోయారు.కానీ అదేమీ పట్టించుకోకుండా రాంపండు బెలూన్లా ఉబ్బి,చేతులు జోడించి,కళ్ళు గిరగిరా పైకి తిప్పి వాసాలకేసి చూసి పాట లంకించుకున్నాడు.'మళ్ళీ మళ్ళీ పాడతాను.మల్లి మనసు నాదేనని …' హల్లో ఉన్న జనాలకి రిమ్మ తిరిగిపోయుంటుంది.వాళ్ళు ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి రావడానికి కాస్త టైము పట్టింది.మొత్తమంతా అయిన తర్వాత గుర్తు చేసుకుంటే అనంత్ కు ఒక విషయం మాత్రం బాగా నాటుకుపోయింది.

    రాంపండు పల్లవి పూర్తి చేసేదాకా సభలో కలకలం కూడా లేదు.ఆ తర్వాతే ప్రజల్లో చైతన్యం రగిలింది.'జనంలో చైతన్యం రావాలి. రావాలి'అంటాం గానీ అది వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించలేం.ఆవాళ అనంత్ కీ అది చూసే సందర్భం పడింది.ఫ్రెంచి విప్లవం ఎలా జరిగి వుంటుందో ఓ అయిడియా వచ్చిందతనికి.కుస్తీ పోటీల్లో రిఫరీ అన్యాయం చేసినప్పుడు ప్రేక్షకులు చేసే శబ్దం లాటిది హాలు అన్ని మూలలనుండీ బయలుదేరి హాలంతా వ్యాపించింది.

    ఆ తర్వాత మాటలతో సరిపెట్టకుండా కార్యక్రమంలో కూరగాయల అంశం కూడా ప్రవేశపెట్టారు కొంతమంది. మనసు గారడీలు చేస్తుంటుంది.ఎందుకో తెలియదు కానీ రాంపండు మీద మొదటపడింది బంగాళదుంప అనే ఊహ అనంత్ మనస్సులో తిష్టవేసుకుని ఉండిపోయింది.నిజానికి మొదట పడినది అరటిపండు !

    అరటిపండు విసిరిన తీరు చూస్తే నచ్చని కళాకారుణ్ణి ఎలా సత్కరించాలో,ఏ కూరగాయ ఎటువంటి శక్తి కలిగి ఉంటుందో తెలిసి చిన్నప్పటి నుండీ బాగా తర్పీదు పొందినవాళ్ళనిపించింది అనంత్ కీ.

    ఆ అరటిపండు రాంపండు చొక్కా మీద పడగానే బంగాళదుంప కంటే అది ఎంత కళాత్మక మైనదో అనంత్ కి తెలిసివచ్చింది.అంతమాత్రాన బంగాళదుంప భక్తులను తక్కువగా అంచనా వేయడానికి లేదు.బంగాళాదుంప విసిరే వాళ్ళలోనూ అతనికి కళాభిరుచిగల ముఖాలు కనబడ్డాయి.

    రాంపండు మీద దీని ప్రభావం చెప్పుకోదగ్గది.కళ్ళు ఉబ్బాయి.జుట్టు నిలబడింది.అయినా నోరుమాత్రం తెరుచుకుంటూ,మూతబడుతూ దానంతట అదే పాటపాడుతూ పోయింది.హఠాత్తుగా స్పృహ లోకి వచ్చి పక్కకు పారిపోయేటప్పుడు మాత్రం పుట్ బాల్ కి 'హెడ్ 'ఇచ్చినట్టు ఓ పెద్ద బంగాళదుంపకు హెడ్డిచ్చి వెళ్ళిపోయాడు.

    జనం చల్లబడ్డాక అనంత్ అన్నాడు.

    “అచలపతీ,రాంపండు గురించి బాధపడకు.ఆపరేషన్ చేసేటప్పుడు కత్తి ఉపయోగించడానికి వెరవకూడదు.అది తన స్వంత కళ్ళతో చూశాక కోకిల 'రాంపండూ ,నీకూ నాకూ రాంరాం 'అని ఉత్తరం రాయకపోతే నన్నడుగు ". అచలపతి ఔనని సమాధానం చెపుతుండగానే గుర్నాధం స్టేజి మీదకు వచ్చాడు.

    “ప్రేక్షకులు మన్నించాలి.తర్వాత పాడవలసిన కోకిల గారు దారిలో కారు చెడిపోవడం వలన కాస్త ఆలస్యంగా వస్తానని ఇప్పుడే ఫోన్ చేశారు.ఈ లోపున ,మన మిత్రుడు సూరిబాబు ...” అనంత్ పడిపోబోయి అచలపతి భుజం పట్టుకుని తమాయించుకున్నాడు.

    “ విన్నావా...ఆ అమ్మాయి రానే లేదుట.నేను ప్రాణాలకు తెగించి చేసిన త్యాగం వేస్టయిపోయింది. రాంపండు పరాభవం ఆమె కంటబడనే లేదు.ఇక అత్తయ్యకు మొహం ఎలా చూపించగలను.?ఇంకోసారి బార్ కు వెళ్లి అక్కణ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాను.కావాలంటే నువ్వు తర్వాత రా.”అని వెళ్ళిపోయాడు.

    *****

    రాత్రి పదిన్నర అయివుంటుంది. రాంపండు వచ్చాడు.మృత్యుముఖంలోంచి తప్పించుకుని వచ్చినట్టున్నాడు.ఎడం కన్ను వాయనా ?వద్దా ?అని ఆలోచిస్తోంది.

    “ గుర్నాధం ప్రోగ్రాంకు నువ్వు వచ్చినట్టు లేదే !నేను పాటపాడి వచ్చాను.అదిరిపోయింది.పాట విని ఎవరూ తేరుకోలేకపోయారు.కంటతడి పెట్టనివారు లేరనుకో "అన్నాడు.

    'హారి అబద్దాల కోరా !' అనుకుని "ఇంతకీ మీ కోకిల ఏమందేమిటి ?” అన్నాడు అనంత్.

    “చాలా సంతోషించిందనుకో. కానీ ఆలోచించి చూస్తే తనకీ, నాకూ కొన్ని విషయాల్లో పొట్టు కుదరదేమో ననిపిస్తోంది.వీణాపాణియే బెటరనిపిస్తోంది.రేపే వాళ్ళ ఊరు వెళ్ళాలి.నీ దగ్గర కాస్త చిల్లరేమైనా ఉంటే..?”అన్నాడు రాంపండు.

    'హమ్మయ్య, అత్తయ్య దగ్గిర మాట దక్కితే చిల్లరేమిటి ?నోట్లే ఇస్తాననుకుంటూ అనంత్ డబ్బు ఇవ్వడం, క్షణంలో రాంపండు మాయం కావడం.ఆ తర్వాత ఐదు నిమిషాలకు అచలపతి ఇంటికి తిరిగిరావడం చకచక జరిగాయి.

    “ఆచలపతీ విన్నావా ? రాంపండుకి, కోకిలకు చెడిందట ! అదేమిటి ?నువ్వు ఆశ్చర్యపడినట్టు లేదే !” అన్నాడు అనంత్.

    “కోకిల మేడమ్ రాంపండు గారి ఎడమ చెంప వాయుగొట్టినప్పుడే అలాటిదేదో జరుగుతుందని పించింది సర్ "

    “ కొట్టడమా ? ఆమెకేం వచ్చింది ?”

    “తన పాటకు జనం ప్రతిస్పందించిన విధానం వల్ల ఆవిడ మనసు చెదిరినట్లయింది సర్ .”

    “చచ్చాం పో, కొంపదీసి జనాలు ఆమెను కూడా మోసేయలేదు కదా !?”

    “అలాటిదే జరిగింది సార్ "

    “అదేమిటయ్యా, తనది బ్రహ్మండమైనా వాయిస్ అయితేనూ...”

    “కరేక్టేనండీ.కానీ ఆమె ఎన్నుకున్న పాట ప్రజలకు నచ్చలేదు లాగుంది.” అనంత్ కు అనుమానం వచ్చింది.

    “ కొంపదీసి కోకిల కూడా మళ్ళీ మళ్ళీ పాడుతాను...పాట పాడలేదు కదా "

    “ ఎస్ సర్,అదే పాట పాడారు.అంతే కాకుండా,అదేమిటో గానీ.ఓ పెద్ద టెడ్డీబేర్ స్టేజి మీదకు తెచ్చి దాన్ని ఉద్దేశించి మరీ పాడారు.జనం ఆ బొమ్మ చూసి మిమిక్రీ చేస్తారని ఆశ పెట్టుకున్నారు లాగుంది.మళ్ళీ 'మళ్ళీ మళ్ళీ' పాట పాడడం వారిని మండించినట్టుంది.”

    “ ఇక చాలు బాబూ.నాకు అర్థం అయిపొయింది.జనం ఎలా రియాక్ట్ అయివుంటారో నేనూహించగలను.విధివిలాసం కాకపొతే తను కూడా ఇదే పాట ఎంచుకోవడం ఏమిటి చెప్పు " అని వాపోయాడు అనంత్.

    “ ఈ విషయంలో విధికి తక్కువ పాత్రే ఉందండి.నేను కాస్త చొరవ తీసుకువలసి వచ్చింది.కోకిల మేడమ్ కారులోంచి దిగగానే రాంపండు గారు ఈ పాటే పాడమని తన రిక్వెస్టు గా చెప్పమన్నారని చెప్పానండి.రాంపండు గారు ఆ టైములో బార్ లో సెకండ్ రౌండ్ కి వెళ్లి వున్నారండి.ప్రేక్షకుల గొడవ భరించలేక కోకిల మేడమ్ పాట మాధ్యలో ఆపి వచ్చేసరికి రాంపండు గారు ఎదురుగా కనబడ్డారండి.

    ఆవిణ్ణి చూసి పలకరింపుగా నవ్వారండి.దాంతో ఇది రాంపండు గారు చేసిన ప్రాక్టికల్ జోక్ అని ఆవిడ భావించి ఎడమ చెంపమీద...ఈ సమాచారం చాలా సర్..?”

    “ఇక చెప్పనక్కరలేదు మహాప్రభో చాలు.ఏమైతేనేం మా అత్తయ్య శాపం బారి నుండి నన్ను రక్షించావ్.చాలు గుడ్ నైట్ " అన్నాడు అనంత్ ఆనందంగా.

    -ఎమ్బీయస్ ప్రసాద్

    (పిజి ఉడ్ హవుక్ రాసిన ''జీవ్స్ అండ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ ''అనే కథ ఆధారంగా )

  • Prev
  • Next