• Prev
  • Next
  • Rampandu-Brilliant Idea

    రాంపండు - బ్రిలియంటు అయిడియా

    అనంత్ రాంపండుని అయిడియాలు వాడుకున్న దాఖలాలు లేవు.కానీ కామేశం బాబయ్య విషయంలో మాత్రం సలహా అడగడం సంభవించింది.దానికి కారణం - రాంపండూ పూర్వానుభవం !

    రాంపండు అనుభవం తక్కిన వాటిల్లో ఎలా ఉన్నా ప్రేమ వ్యవహారాల్లో మహాగట్టిది.అంటే ఆపాటి అనుభవం కామేశం బాబయ్యకు లేదని కాదు.ఆ మాటకొస్తే బాబయ్య రాంపండు కంటె ఎంతో సీనియర్.నలభై యేళ్ళుగా,అంటే తన పదహారో ఏటి నుండి ఆయన ఎంతమందితో ప్రేమలో పడ్డాడో లెక్కేలేదు.

    బాబయ్య వరుస అవుతాడు కాబట్టి అతని గురించి అనంత్ చిన్నప్పటి నుండీ వింటూనే ఉన్నాడు.విన్నదానిలో చెప్పుకోదగ్గదీ,మెచ్చుకోదగ్గదీ ఏమీ కనబడలేదు.ముఖ్యంగా ఆ చెప్పేది మాంకాళి అత్తయ అయినప్పుడు ! కనబడ్డప్పుడల్లా పాఠం ఒప్పగించేది.

    “ఒరేయ్ అనంతూ!మీ కామేశం బాబాయ్ ని చూసి నేర్చుకో అంటున్నావంటే అలా ఉండమని కాదు.అలా ఉండకూడదని చెబుతున్నాను.ఎవరు కనబడితే వాళ్ళను ప్రేమించానని వెంటబడడం.మనం ఏమిటి,మన వంశం ఏమిటి అన్న ఆలోచనే లేకపోవడం -ఇది మంచి పద్దతి కాదు.దాన్నెవత్తినో ప్రేమించాను,పెళ్లి చేసుకుంటాను అని వీడు అనడం.మేమంతా వెళ్లి అడ్డుపడడం.ముఖ్యంగా ఆ రికార్డింగ్ డాన్సర్ అచ్చమ్మవిషయంలో అయితే మరీనూ. గుళ్ళో పెళ్లి చేసుకుంటానని అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు కూడా !దాన్ని వదుల్చుకునేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది.నువ్వూ అలాటి వేషాలు వేశావో వీపు చీరేస్తాను జాగ్రత్త ".

    కామేశం లాగానే అనంత్ కూడా బ్రహ్మచారిగా ఉండిపోవడంతో మాంకాళి అత్తయ్య ఇలా హెచ్చరిస్తూ ఉండేది.కానీ నిజానికి అనంత్ పెళ్లి చేసుకోక పోవడానికి కారణం-బద్ధకం,సంసారం చూసుకోవలసి వస్తుందనే భయం!కామేశం విషయంలో అయితే-అతనికి నచ్చిన పిల్లలెవర్నీ కుటుంబం ఆమోదించక పోవడమే అతన్ని బ్రహ్మచారిగా మిగిల్చింది.

    అందునా ఈ మధ్య బాగా ఒళ్ళు రావడంతో విహహేచ్చ నశించి ఉంటుందని అనంత్ అనుకుంటూండగానే ఓ రోజు బాబయ్య దిగబడ్డాడు. అనంత్ క్లబ్బు నుండి ఇంటికి వచ్చేసరికి బాబయ్య అద్దం ముందు నిలబడి ఈలవేసుకుంటూ తల తల దువ్వుకుంటున్నాడు.అనంత్ పలకరించాడు.

    “ఏమిటి బాబయ్యా..ఈ మధ్య బాగా ఒళ్ళు చేసినట్టున్నావ్ !ఎవరైనా టైలర్ స్లిమ్ అవుదామనుకుంటే వారానికోసారి నీ కొలతలు తీసుకుంటే సరి !”.

    “ఏడిశావ్ లేవోయ్ !ర్ర్ మధ్య గాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల తినడం తగ్గించేశాను.నీకు తెలుసా ?ఎసిడిటీ వల్ల స్టమక్ లైనింగ్ చెడిపోయి,వేళకు అన్నం తినకపోతే అరగని స్టేజికి వచ్చేశాను " అన్నాడు బాబయ్య అద్దం నుండి దృష్టి మరల్చకుండానే !

    బాబయ్యతో ఇదొకటి చిక్కు.ఎప్పుడు చూసినా స్టమక్ లైనింగ్ గురించి తెగ మాట్లాడతాడు.

    “పోన్లే బాబాయ్,ఇంక ముస్తాబు ఆపు.నీ ఇమేజ్ బరువు మోయలేక అద్దం పగిలి పోయేట్టుంది.అయినా పెళ్లికొడుకులా అంత ముస్తాబయ్యా వేమిటి ?”అని జోక్ చేశాడు అనంత్.

    “పెళ్ళికొడుకుని కాబట్టే పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్నానురా చవటా "అంటూ కామేశం బాబాయ్ అనంత్ ను జెల్లకాయ కొట్టబోయేడు. ఇది జోకో, సీరియస్సో అనంత్ కు అర్థం కాలేదు.

    “ఈ వయస్సులో నీకు పెళ్ళేమిటి బాబాయ్ ?నిన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయ్ ఒప్పుకుంటుంది కనక !”అన్నాడు.

    కామేశం బాబాయ్ అనంత్ కేసి జాలిగా చూశాడు.

    “పిచ్చివాడా,ఈనాటి యంగ్ గళ్స్ కి కావాల్సినది ఉఫ్ అని ఊదితే పడిపోయే కుర్రసజ్జు కాదు. నాలాగ స్ట్రాంగ్ గా,రాక్ లైక్ సపోర్ట్ గా నిలబడగల అనుభవజ్ఞుడు.అందుకనే ఓ అందమైన అమ్మాయీ నేనంటే ఇష్టపడింది.నాకు నచ్చింది.డిన్నర్ కు హోటల్ కి రామ్మనమన్నాను. సరేనంటే వచ్చేనెలలోనే పెళ్ళి.నువ్వు తోడు పెళ్లి కొడుకుగా కూచోవలసి వస్తుంది.మంచి బట్టలు అవీ కుట్టించుకో " అంటూనే బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు.

    అనంత్ కి కళ్ళు తిరిగినట్టయింది.

    “ఎవరావిడ ?ఐమీన్ అమ్మాయ్ ?”

    “ సుబ్బి అని గాంధీ పార్కు పక్కన పెసరట్లు వేస్తూంటుంది.వెరీ బ్యూటీఫుల్ గళ్ "

    “బాబాయ్ బాబాయ్...అటువంటి అమ్మాయిని చేసుకోవడానికి మాంకాళి అత్తయ్య ఒప్పుకుంటుందా ?” బాబాయ్ మంచి దైర్యంగా ఉన్నాడు.

    “మాంకాళి అక్కయ్య ఒప్పుకుంటే...కుంది..లేకపోతే లేదు.నిన్న రాత్రే చెప్పేశాను.తాంబూలాలు వేసేసుకుంటున్నాం. తన్నుకు చావండి అని ఈసారి మాత్రం తను అడ్డుపడితే ఊరుకోను.ఖబడ్దార్ అని చెబుతాను.నాకూ ఏబై ఏళ్లు దాటాయ్.అయినా ఇంకా తన మాట వినాలా ? వినను. నాకూ స్వతంత్రం వచ్చింది.జైహింద్.ఛలో సుబ్బీ "అని నినాదం ఇచ్చేసి కామేశం బాబాయ్ రోడ్డున పడ్డాడు.

    'ఈ వరస చూస్తూంటే ఈసారి బాబాయ్ ను ఆపడం ఎవరితనం కాదు.పాపం ఎవడు అడ్డుపడడానికి ప్రయత్నిస్తాడో కానీ వాడు మసి అయిపోతాడు.”అనుకున్నాడు అనంత్,

    కాస్సేపటిలోనే మాంకాళి అత్తయ్య ఫోను వస్తుందని తెలియక. ఫోన్ వస్తూనే అత్తయ్య లంకించుకుంది.

    “ఏరా అనంతూ,కామేశం గాడు అక్కడ లవ్ ఎఫయిర్స్ నడుపుతుంటే నువ్వు గాడిదలు కాస్తున్నావా ?కనిపెట్టి నాకు ముందుగానే చెప్పవద్దా ? పోయిపోయి దోసెలు పోసేదాన్నా వరించడం "అంటూ అత్తయ్య ఆ సుబ్బి వంశాన్ని తిట్టనారంభించింది. దోసలు కాదు పెసరట్లు అని సవరించబోయి అనంత్ మరిన్ని చివాట్లు తిన్నాడు.

    “పోనీ,దోసెలు పోసేదాన్ని నువ్వు వరించు!పెళ్ళీ పెటాకులు లేకుండా ఆంబోతుల్లా తిరిగితే అటువంటి వాళ్ళే దొరుకుతారు.ఈ పెళ్లి ఆపకపోతే నేనూరుకోను. నిన్ను కోరతవేస్తాను చూడు ".

    అనంత్ అభ్యంతరం తెలపబోయాడు.

    “ సుబ్బి పెళ్లి ఎంకి చావుకి వచ్చిందని- సుబ్బితో బాబాయ్ పెళ్లి నా చావుకి వచ్చినట్టుంది. మధ్యలో నేనేం చేయగలను ?”

    “అది నేను చెప్తాను లేరా. మా వూరి కుర్రాడితో నీకో బ్లాంక్ చెక్కు పంపిస్తున్నాను. కాస్సేపటిలో నీ దగ్గరకు వస్తాడు.నువ్వా చెక్కు పట్టుకెళ్ళి ఆ దోసలదాని...సర్లేరా...పెసరట్ల దాని మొహాన్న కొట్టు.అలాగే అంటూ ఆ చెక్కు ఆ పళాన ఇచ్చేయడం కాదు.ఆ బాబాయ్ ని వదలడానికి ఎంతుచ్చుకుంటావ్ అని అడిగి,ఆ అంకె వేసి మరీ ఇయ్యి.మరీ ఎక్కువ ఇవ్వకు. బేరమాడు.ఇలాటి అలగా జనానికి ఓ వంద మొహాన పడేసినా చాలు...”అని మాంకాళి అత్తయ్య చెబుతుండగానే

    “ అత్తయ్య,ఈ స్కీము బాగాలేదు.సినిమాల్లో ఈ సీను వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల సింపతీ ఆ అమ్మాయి మీదే ఉంటుంది.ఆ అమ్మాయి 'నాప్రేమని తూచగలిగే త్రాసు ఇంకా చేయబడలేదు. చెక్కు ఇంకా రాయబడలేదు.లాటి డైలాగులు కొట్టినప్పుడు ప్రేక్షకులు తెగ చప్పట్లు కొడతారు.”

    “ఒరేయ్, నువ్వు ప్రేక్షకుల నెవరినైనా తీసుకువేళదామనుకుంటూ ఉంటే ఆ ఐడియా డ్రాప్ చేసుకో.మనకు కుటుంబ గౌరవం ముఖ్యం.ఇది ఎవరికీ తెలియడం నాకిష్టం లేదు...”

    “నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్ అత్తయ్యా...నేను ఆడియన్స్ ను తీసుకెళతాననటం లేదు.సినిమాల్లో అటువంటి సందర్భం గురించి చెబుతున్నాను.అలాటి సీన్లలో ఆ సదరు ప్రేమికురాలు డబ్బు పట్టుకొచ్చిన వాణ్ని క్రీన్ షాట్ లో పురుగుని చూసినట్టు చూసి...”

    “...చూస్తే చూడనీయ్.నేనేం అనుకోనులే !” అత్తయ్య హామీ ఇచ్చింది. :కానీ నేను అనుకోవచ్చుగా "అని అనంత్ అభ్యంతరం లేవనెత్తగానే అత్తయ్య వార్నింగ్ ఇచ్చేసింది.

    “నువ్వా చెక్కు దాని మొహాన్న తగలేసి పెళ్లి జరక్కుండా చేయకపోతే నేను నిన్ను పురుగున్నరగా చూస్తాను.జాగ్రత్త" అని ఫోను పెట్టేసింది అత్తయ్య.

    *****

    రెండురోజులు పోయాక,ఇక వాయిదా వేయడం కుదరదని తేల్చుకున్నాక అనంత్ సుబ్బి ఇంటికి వెళ్లాడు.తలుపు తట్టేసరికి ఓ నలభై ఏళ్లు పైబడినావిడ తలుపు తీసింది.మొహం అందంగానే ఉన్న మనిషి చాలా భారీగా ఉంది.అక్కడక్కడ నెరిసిన జుట్టు,కాస్త పల్చటి చీర. అనంత్ ను చూస్తూనే "వచ్చారా,రండి రండి "అంది.

    ఘాటు ఘాటు డైలాగులు ఎదురుచూస్తున్న అనంత్ కాస్త ఆశ్చర్యపడుతూ "వచ్చేశా " అన్నాడు చెక్కు స్కీము వాళ్ళకూ అలవాటేనేమో అనుకుంటూ.

    “నా పేరే అచ్యుతశ్రీ..సుబ్బి మా మేనకోడలే.పాపం ఇప్పుడే కాస్త కునుకుపట్టింది.కాస్సేపు ఆగుతారా ?రాత్రంతా జ్వరం వల్ల నిద్రలేదు.”అందామె. “పర్వాలేదు లెండి.కాసేపు ఆగుతాను.”అన్నాది అనంత్.

    “పోనీ ఎలాగూ ఖాళీగా కూచున్నారు కదా.నా మోకాలు కాస్త చూడండి.”అందామె చీర కాస్త పైకి లాగుతూ.

    వీళ్ళింటికి వచ్చిన వాళ్లందరూ ఈవిడ మోకాలు చూడడం ఆనవాయితీ యేమో అనుకుంటూ అనంత్ ఆ మోకాలి కేసి తదేకంగా చూశాడు. “మీ ఉద్దేశం ఏమిటి ?”అని ఆవిడ అడగగానే ఏదో ఒకటి చెప్పాలని "ఏముంది ?బాగుంది "అన్నాడు మెచ్చుకోలుగా.

    “ఇప్పుడు బాగానే ఉన్నట్టు కనబడుతుంది.రాత్రి పూట ఒకటే సలవరం.రెండు నెలలుగా అవస్త.సూదులు గుచ్చినట్టు ఒకటే చెప్పి "అంది అచ్యుతశ్రీ.

    దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సానుభూతి ప్రకటిస్తూ అనంత్ నోరు చప్పరించాడు. కానీ ఆవిడ తృప్తి పడడ్డట్టు కనబడలేదు.

    “తమాషా ఏమిటంటే వారం రోజుల్నుంచి ఇక్కడ కూడా సేమ్ అదేరకం నొప్పి"అందామె చెయ్యి వెనక్కు పోనిస్తూ. “ఎక్కడ " అన్నాడు అనంత్ ఏపాటి ఉత్సాహమూ కనబరచకుండా.

    ఈ గోలంతా ఎందుకు,బేరసారాలు లేకుండా ఫిక్సెడ్ రేటు ఎంతో చెప్పేస్తే చెక్కు గిలికేసి పోవచ్చు కదాని అనంత్ తొందర.

    “ఇక్కడే...వెన్నెముక క్రింద !కాస్త చూడండి.మీకే తెలుస్తుంది.”అంటూ ఆవిడ లేచి నిలబడింది.

    'ఎంత ఆనవాయితీ అయినా కొన్ని హద్దులుంటాయి.మోకాలు చూడమన్నారు పోన్లేనని చూశాను.బొత్తిగా...”అనంత్ మాటల కోసం వెతుకుతున్నాడు. “ఎక్కడ పడితే అక్కడ చూడమంటే నేను చూడను "అన్నాడు మొహం మాడ్చుకుంటూ.

    అచ్యుతశ్రీ కూడా మొహం మాడ్చుకుంది.

    “డాక్టరన్నాక పేషంటు బాధలన్నీ చూడాలి.అలా గిరి గీసుకుని కూచుంటే ఏలా ?” అంది. అనంత్ కీ కథ కాస్త అర్థమయింది.

    “చంపారు పొండి. నేను డాక్టర్నీ కాను,యాక్టర్నీ కాను ". ఆవిడా తెల్లబోయి అనతలోనే ఫెళ్ళున నవ్వింది.

    “సుబ్బికి జ్వరంగా ఉంది కదాని నేను డాక్టర్ కోసం కబురంపాను.మీరు వస్తే మీరే డాక్టరనుకున్నాను.పోనీ మోకాలు చూపించినప్పుడే నేను డాక్టర్నికానని చెప్పవచ్చుగా. గడుసుగా ఊరుకున్నారేం ?చిలిపి " అంటూ అనంత్ చేతి మీద చిన్నగా కొట్టింది కూడా.

    ఈ అచ్యుతం వరస అనంత్ కీ అర్ధం కాలేదు.కోప్పడేబదులు ఇలా మాట్లాడుతుందేమిటాని అనుమానం వచ్చింది.ఇలాటి టైములో చెక్కు ఆఫర్ చేస్తే సుబ్బి డైలాగుల మాట ఎలాగున్నా మరోరకమైన ఇబ్బంది వచ్చేట్లు ఉందని భయం వేసింది.

    “అబ్బే,అదేం కాదు.సుబ్బిగారితో పని ఉండి వచ్చాను లెండి.మళ్ళీ రేపు వస్తాను.”అని ఇంటికి పరిగెట్టుకు పారిపోయి వచ్చేశాడు.

    'వాళ్ళ దగ్గర్నుంచి పారిపోగలను కానీ మాంకాళి అత్తయ్య దగ్గర్నుంచి పారిపోలేనుగా.కాస్సేపటిలో ఆమె దగ్గర్నుంచి ఫోను వస్తుంది.ఏం చెప్పాలా 'అని అనంత్ అనుకుంటుండగానే రాంపండు వచ్చాడు.

    అతన్ని చూడగానే అనంత్ కీ గుర్తుకు వచ్చింది -ఈ సదురు సుబ్బిని రాంపండు కూడా గతంలో ప్రేమించాడని. విషయం చెప్పి "మంచి సమయానికి అచలపతి కూడా ఊళ్ళో లేడురా.ఏదైనా మంచి ఐడియా చెప్పి బాబయ్యను దీంట్లోంచి బయపడేట్టు చెయ్యి "అన్నాడు.

    రాంపండు చిరునవ్వు చిందించాడు.

    “అన్నిటికీ అచలపతి అక్కర్లేదురా!ఐడియా చెప్తాను కానీ దాని కాఫీరైటు నా దగ్గరే ఉంచుకుంటున్నాను. మీ మాంకాళి అత్తయ్యకు చెప్పినప్పుడు 'ఇది రాంపండు ఐడియా 'అని చెప్పి తీరాలి.లేకపోతే నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కు భంగం కలుగుతుంది"

    “తప్పకుండా చెప్తాను కానీ ముందా ఐడియా చెప్పి చావు"అన్నాడు అనంత్ విసుగ్గా.

    “సింపుల్.ఇప్పటిదాకా అచ్యుతశ్రీ,కామేశం కలవలేదు.వాళ్ళీద్దరికీ ఓ భేటీ ఏర్పాట్ చేయ్. సుబ్బి అందగత్తె కావచ్చు.మీ బాబాయ్ ను ఆకర్షించవచ్చు.కానీ ఈ అచ్యుతశ్రీ -నాకు గుర్తిందిలే -బొత్తిగా దారుణంగా ఉంటుంది.అడ్డపడి తింటుంది.సిగ్గూ,ఎగ్గూ కాస్త తక్కువ.నువ్వే చూశావ్ గా!కామేశం గారు ఈ అత్తయ్యను,ఆవిడ విధానాలను చూడగానే చికాకు పడతాడు. సుబ్బిని కట్టుకుంటే ఈ లెవల్ మనుష్యులతో మసలవలసి వస్తుందని ఒక్కసారి జ్ఞానోదయం అవుతుంది.దెబ్బకి సుబ్బికి గుడ్ బై చెప్తాడు.” అని అమోఘమైన అయిడియా చెప్పాడు రాంపండు.

    ఇంతలోనే అత్తయ్య నుండి ఫోను వచ్చింది.

    అనంత్ తన పర్యటన విషయాలను అతి క్లుప్తంగా చెబుతూ (అప్పటికే బోల్డన్ని అక్షింతలు పడ్డాయి)ఈ అచ్యుతశ్రీ ను భోజనానికి పిలిచే ప్లాను గురించి చాలా విశదంగా చెప్పాడు.చెబుతూ ఇది రాంపండు కొచ్చిన బ్రిలియంటు ఐడియా అని కూడా చెప్పి రాంపండుకి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.మాంకాళి అత్తయ్య 'సరే అలా కూడా చూద్దాం.గత ముప్పయేళ్ళుగా ఈ కామేశం గాడి ఎఫయిర్స్ మీద బోల్డంత ఖర్చయింది.చెక్కు ఇంకా ఇవ్వలేదంటున్నావు కాబట్టి ఈసారి ఖర్చు మిగిలినా మిగిలినట్టే !” అంటూ ఫోన్ పెట్టేసింది.

    రాంపండు చాలా సంతోషించాడు.

    “మీ మాంకాళి అత్తయ్య తిట్టకుండా సరేనందంటే ఇది చాలా గొప్ప అయిడియాయే నన్నమాట.పేటెంటు చేయించుకోవాలి.త్వరలోనే నా బుర్ర గట్టిదని గ్రహించి మీ అత్తయ్య నాకో మంచి ఉద్యోగం చూసి పెడుతుందేమో !" అంటూ గాలిమేడలకు పునాదులు తవ్వనారంభించాడు.

    మాంకాళి అత్తయ్య దగ్గర్నుంచి గ్రీన్ సిగ్నలు వచ్చేసింది కాబట్టి పనులు చకచక అయిపోయాయి.అనంత్ సుబ్బి ఇంటికి వెళ్లి అచ్యుతశ్రీని భోజనానికి ఆహ్వానించాడు. సుబ్బి లేకుండా నేనొక్కత్తినీ రావడం ఏమిటి ?పైగా మీరు నాకు బొత్తిగా తెలియదు కూడా " అంటూనే "అయితే మీ ఇంటికి ఎన్ని గంటలకు రమ్మంటారు.”అనేసింది.

    కామేశం బాబాయ్ కూడా "అసలే సుబ్బికి ఒంట్లో బాగాలేదని చెప్పి నా మనసు బాగాలేదురా ఇప్పుడీ విందు భోజనాలేమిటి ?” అంటూనే "సరే వస్తానులే.గుత్తొంకాయ కూర స్పెషల్ గా చేయించు "అంటూ ఆర్డరేశాడు.

    అచ్యుతశ్రీ వచ్చేసరికి రాత్రి ఎనిమిదయింది.

    “అప్పుడే భోజనం వద్దు.నా స్టమక్ లైనింగ్ కాస్త వీక్.ముందు ఏమైనా డ్రింక్స్ ఉంటే తీసుకుని ఆ తర్వాత అన్నం సంగతి చూద్దాం "అంది.

    " కామేశం బాబాయ్ డైలాగులే నువ్వూ కాపీ కొడుతున్నావా తల్లీ.నీకివాళ డిన్నర్ దగ్గర మంచి కంపెనీయే దొరుకుతుందిలే " అనుకుంటూ డ్రింక్స్ ఏర్పాటు చేశాడు అనంత్.

    ఇంకో పావుగంటకు కామేశం బాబాయ్ వచ్చాడు.డైనింగ్ రూమ్ లోకి ప్రవేశిస్తూనే అచ్యుతశ్రీని చూసి కొయ్యబారిపోయాడు. కాస్సేపటికి తేరుకుని "అచ్చమ్మా !నువ్వు ఇంకా ఉన్నావా ?ఎక్కడికి వెళ్లిపోయావ్ ఇన్నాళ్ళూ ?నీకు పెళ్ళయిపోయిందన్నారే !పిల్లలా "అంటూ ప్రశ్నలు కురిపించాడు.

    కొద్దిసేపటిలోనే విషయాలన్నీ బయట పడ్డాయి.ఈ అచ్యుతశ్రీ వేరెవరో కాదు.కామేశం బాబాయ్ యవ్వనంలో అత్యంత గాఢంగా ప్రేమించి,గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దపడ్డ రికార్డింగు డాన్సర్ అచ్చమ్మే !ఆ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని మాంకాళి అత్తయ్య అచ్చమ్మ వద్దకు వచ్చి బోల్డంత డబ్బిచ్చింది.(చిన్నతనం,ప్రేమ విలువ గుర్తించలేక వెదవ డబ్బుకి లొంగిపోయాను.'అంటోంది అచ్యుతశ్రీ ఇప్పుడు.దెబ్బకి అచ్చమ్మ ఊళ్లోంచి మాయమయిపోయింది.ఆమె వేరేవర్నో కట్టుకుందని కామేశం బాబాయ్ మనసు మార్చేసింది.

    ఇన్నాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఇలా తారసిల్లారు. జీర్ణశక్తుల గురించి ఒకరినొకరు పరామర్శించు కుంటుండగానే తమ మధ్య ఒకప్పుడు ఉన్న గాడమైన ప్రేమ ఇంకా సజీవంగానే ఉందని ఇద్దరూ తేల్చుకున్నారు.సుబ్బిని మనస్సులోంచి తుడిచేసి,అచ్చమ్మను పెళ్ళాడతానన్నాడు కామేశం బాబాయ్ ! అంతకంటే భాగ్యమా అంది అచ్చమ్మ.

    తన కొత్త నిర్ణయం గురించి కామేశం బాబాయ్ మాంకాళి అత్తయ్యకు ఎప్పుడు చెప్పాడో ఏమో,పొద్దునే మాంకాళి అత్తయ్య అనంత్ కు ఫోను చేసింది.

    “నేనెప్పుడో కష్టపడి వదుల్చుకున్న ఆ రికార్డింగు డాన్సర్ ను ఇంటికి భోజనానికి పిలిచి కామేశానికి పరిచయం చేయమని ఎవడ్రా నీకు చెప్పింది ?చెక్కు మొహాన పడేసి పెసరట్లదాన్ని వదుల్చుకోరా అని చెబితే నువ్వు వినకుండా మళ్ళీ అచ్చమ్మను సీన్లోకి లాక్కొస్తావా ? అది జలగ.

    ఆ రోజుల్లోనే నన్ను ముప్పుతిప్పలు పెట్టింది.ఇప్పుడు వీడు బిర్ర బిగిశాడు.ఇన్నేళ్ళుగా నేను పడ్డ కష్టమంతా వేస్టయింది.ఎవడ్రా నీకి ఐడియా ఇచ్చింది ?” అంటూ అత్తయ్య అరవ నారంభించింది.

    “రాంపండు అనిమా ప్రెండు...నువ్వు చూసి వుంటావ్...వాడే ఇది బ్రిలియంటు అయిడియా అని చెబుతేనూ...” అంటూ అనంత్ నానుస్తుండగానే "వాడూ...వాడి అడియియానూ . రాంపండో, జంపండో వాడి తాట తీయకపోతే నన్నడుగు.ఉండు"అని గర్జిస్తూ అత్తయ్యా ఫోను పెట్టేసింది.

    ఫోన్ పెట్టగానే అనంత్ రాంపండు కోసం పరిగెట్టాడు.అత్తయ్య సంగతి తెలుసుకాబట్టి ఆ కైమా ఏదో రాంపండునే చేస్తే మంచిదని అతని అభిప్రాయం.

    ఎమ్బీయస్ ప్రసాద్

    (పి.జి.ఉడ్ హవుస్ రాసిన "ఇండియన్ సమ్మర్ ఆఫ్ యాన్ అంకుల్ "అనే కథ ఆధారంగా )

     

  • Prev
  • Next